Home దునియా అరుగుల మీద కూకుండి ముచ్చట్లు పెట్టుకునుట

అరుగుల మీద కూకుండి ముచ్చట్లు పెట్టుకునుట

People Chitchat in front of House in Villages

ముచ్చట్లు పెట్టుకునేందుకు ఓ సమయం ఉంటది అట్లనే ఒక తావు ఉంటది. ముచ్చట్లు అంటే ఊరు మీద జరిగే ముచ్చట్లు. ముచ్చటకు ఎజండా ఏమి ఉంటది నడుస్తున్న దాన్ని మాట్లాడుకునుడు ఇప్పుడంటే ఎవల సెల్లుల వాల్లకు వాట్సప్ గ్రూపుల గుమికూడి ముచ్చట్లు పెట్టుకొని సమాచారం అదల బదలు చేసికుంటుండ్రు గని ఎన్కట ఊర్లల్ల అంత సమాచారం అందరికి చేరేది. అరుగుల మీద కూకొని మాట్లాడుకునుడే. పొద్దీకెనంగ ఏడుగొట్టంగనే బువ తిని ఇంటి ముందట అరుగుల మీద సుట్టు పక్క ముసలాల్లు వచ్చి కూసోని మాట్లాడుకునేది. వాల్ల అల్లుడు పిల్లను తోలుక పోలేదట. గా లచ్చవ్వ కోడలును తిడుతుందట గా పటేలవ్వ ఐద ఎకరాలు నాటేసిందట గిసొంటివి మాట్లాడుకునుడు ఆడోల్లు మొగోల్లు కల్సి ముచ్చట పెట్టుకుంటరు. అందుకే ఇంటి ముందట వాకిట్ల అటు ఇటూ అరుగులు కట్టిచ్చుకుంటరు. తిన్నంక రాత్రి ఎన్నీలకు మాట్లాడుకుంటరు. పొద్దుందక కూడా ముసలోల్లు అక్కన్నే ఎండుగల కావలి ఉండి కైనీడకు మాట్లాడుకుంటరు.

ఊర్లల్ల ముచ్చట్లకు అసలైన తావు తాళ్ళ మండువ. అక్కడ రాని ముచ్చట ఉండది. ఊరు మీద ఎవరు ఏంది ఎవలు లేశిపోయిండ్రు కొన్నింటి సకలం కళ్ళు తాగుకుంట మాట్లాడుకుంటరు. మనుషులు మాట్లాడుకుంటేనే కదా అన్ని విషయాలు తెల్సికునేది. మాట్లాడుకోవాలంటే ఉర్లల్ల బస్‌లు నిలబడే దగ్గర ఏదైన పెద్ద చెట్టుకింద నాలుగు బాటల కాడ, బండమీద, గుడికాడ, పాలకేంద్రం కాడ, గాంధీ బొమ్మకాడ, అంబ్కేర్ బొమ్మకాడ, గడి దగ్గర, పెద్దబంగ్ల దగ్గర-, బడికాడ, చెరువు కట్టమీద, తూము దగ్గర ఇట్లాంటి చోట్ల రోజు కల్సుకునే వాల్లు కల్సుకొని మంచి చెడూ అన్ని మాట్లాడుకుంటరు.

పనిచేసే ఆడవాల్లు అయితే నాల్లేసే కాడ ముచ్చట్లే ముచ్చట్లు. కలుపు తీసేకాడ ఒడ్డు మీద నిలబడి వింటన్నట్టు గాక ఎటో చూసుకుంటు వింటే ఊరు మీద ఎన్నో కతలు కతలుగా ముచ్చట్లు తెలుస్తయి. వాటితో కతలు అల్లుకోవచ్చు. బడి పిల్లలు సుత బడి నుంచి వచ్చినంగ ఆడుకుని పోతరు. అక్కడ కూడా పిల్లలు ముచ్చట్లు నడుస్తయి. ఇప్పుడంటే బండెడు పుస్తకాలు హోం వర్క్‌లతో సస్తండ్రు పోరగాల్లు గని ఎన్కట బడి ఇడిశినంగ ముచ్చట్లకు పోయేది. పిల్లలు మాట్లాడుకునేది ఎక్కువ బడి దగ్గర మైదానంల నాలుగు బాటల కడ కూడుతరు మాట్లాడుకంటరు.

ఒక సంకేత స్థలం అనుకుంటే అందరు ఆవలేకు ఆడికే వస్తరు మాట్లాడుకుంటరు. ఊర్లల్ల గుడిసెలహోటల్లు ఉంటయి. అక్కడ ఎప్పడు చాయ ఉంటది. పొద్డుట పూట పూరి ఇస్తరు. సాయంకాలం అయితే మిర్చిబజ్జీలు చేస్తరు. అక్కడ ఎక్కువ మంది ఆగుతరు. అక్కడికే పేపర్ వస్తది. పేపర్ వార్తల చాయ తాగుకుంటు ఆనే చెట్ల కింద సూరు నీడకు గోడ పొన్న ఉండి ఆరాముగ ముచ్చట్లు పెట్టుకుంటరు. ఎవుసం చేసేటోల్ల ఒక దగ్గర కలుస్తరు. పంతుల్లు నలుగురు అయిదుగురు ఉంటే వాల్లు ఒక తాన కలుస్తరు పత్తా ఆడే కాడ సుత మంచి మంచి ముచ్చట్లు పెట్టుకుంటరు.

మూడు కేంద్రాలు జర పెద్ద పట్నాలల్ల కూడ ముచ్చట్లకు పాన్ దుకునాల కాడ, సినిమా టాకీసు మూల నీడ. లేదంటే హోటల్ ముందట బుక్‌స్టాల్ కాడ, లేదా కరెంట్ షాపు దగ్గర కూసొని కల్సుకుంటరు. కొందరు జిరాక్స్ సెంటర్ దగ్గర అని అడ్డ పెట్టుకుంటరు. ఆ అడ్డ మీద అందరు వచ్చి మాట్లాడుకుంటరు అయితే రాను రాను మనుషులు కల్సుడు తగ్గిపోతుంది. వాట్సస్ సంస్కృతి వచ్చి ఏ విషయమైన అందులోనే కన్పిస్తుంది. ఊరు మంచి చెడు అన్ని అందులో వీడియో రూపంలో, ఫొటో రూపంలో వచ్చే వరకు కల్సి మాట్లాడుకునే స్థితి పోతంది. ఈ ముచ్చట్ల కలయికలు సలహాలు ఒగలివి ఇంకొకలకు తెల్సుకునే వీలు కల్గింది.

-అన్నవరం దేవేందర్, 94407 63479