Home వికారాబాద్ సదా మీ సేవలో

సదా మీ సేవలో

Corrupt police In Police Departmaent In Telangana

మన తెలంగాణ/వికారాబాద్ జిల్లా ప్రతినిధి : ప్రభుత్వంలో రెవెన్యూ, పంచాయత్‌రాజ్, పోలీసుశాఖలు ఎంతో కీలకం. ఈ శాఖల ప్రక్షాళనకు ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు ఉన్నతాధికారులు అనేక సంస్కరణలు తీసుకువచ్చారు. అయితే, పోలీసుశాఖ పట్ల అందరి దృష్టి ఉండటంతో చిన్న మార్పులు చేసినా సోషల్‌మీడియా ద్వారా వెలుగులోకి వచ్చి చర్చనీయాంశంగా మారుతోంది. ఇటీవల మామూళ్ల విధానం రద్దు అంశం కూడా ఆనోటా, ఈనోటా బహిర్గతం కావడంతో పోలీసుశాఖలో కిందిస్థాయి సిబ్బంది తీవ్ర మనస్థాపానికి గురికావాల్సి వచ్చింది. అయినప్పటికీ రాష్ట్ర పోలీసుబాస్ మహేందర్‌రెడ్డి చేపడుతున్న కార్యక్రమాలు సత్ఫలితాలు ఇవ్వనున్నాయి.  ప్రజలకు సేవ చేసేందుకే పోలీసులు ఉండాలనే విధంగా పలుమార్పులు చేపట్టారు.  నెలవారీ మామూళ్లను నిర్మూలించిన డిజిపి ప్రజల ప్రాణ, మాన, ఆస్తుల రక్షణకు  సమర్థవంతంగా డ్యూటీలు చేయాలని ఆదేశించారు. శాంతిభద్రతల పరిరక్షణకు చర్యలు చేపడుతున్నారు.  పోలీసు వ్యవస్థను పటిష్టమంతం చేయాలనే ఉద్దేశ్యంతో రాష్ట్ర ప్రభుత్వం వారికి ఆధునిక వాహనాలను సమకూర్చింది. గతంలో పాత వాహనాల వల్ల పోలీసులు నానా అవస్థలు పడాల్సి వచ్చింది. కానీ మూడేళ్ల క్రితమే ఆధునిక వాహనాలను సమకూర్చారు.  దేశ చరిత్రలోనే తెలంగాణ పొలీసు విభాగాన్ని పటిష్టమంతం చేసే దిశగా అడుగులు వేశారు. పోలీసులకు కావాల్సిన ఆధునిక సాంకేతిక విధానాలను అందుబాటులోకి తీసుకువచ్చారు. నేరాల పరిశోధనను సులువుగా ఛేధించేందుకు తోడ్పడే సాంకేతిక విధానాన్ని అమలు చేశారు. పోలీసుస్టేషన్‌కు వచ్చే ప్రజలకు భయం ఉండరాదనే ఉద్దేశ్యంతో సకల సౌకర్యాలు కల్పించనున్నారు. స్టేషన్లను ఆధునీకరించి కార్పొరేట్ కార్యాలయాల్లో తీర్చిదిద్దనున్నారు. అందుకు ప్రతి ఠాణాకు ప్రభుత్వం రూ.30 లక్షల చొప్పున మంజూరు చేసింది. జిల్లాలో 19 స్టేషన్లకూ ఈ నిధులు మంజూరు చేయడం గమనార్హం. త్వరలో పాత ఠాణాలను ఆధునీకరించనున్నారు. అక్కడ సకల వసతులు కల్పించనున్నారు. ఫిర్యాదుదారులకు, పోలీసు సిబ్బందికి కావాల్సిన ఫర్నిచర్ ఏర్పాటు చేయనున్నారు. వారికి తాగేందుకు సురక్షితమైన నీరు అందించనున్నారు. పోలీసు సిబ్బందికి మంచాలను ఏర్పాటు చేసి విశ్రాంతి తీసుకునేందుకు వీలు కల్పించనున్నారు. సమాజానికి అనుగుణంగా పోలీసులను తీర్చి దిద్దేందుకు పునశ్చరణ తరగతులు నిర్వహిస్తున్నారు. సిబ్బందిలో వృత్తి నైపుణ్యం పెంచుతున్నారు. కేసుల పరిశోధనకు ఆధునిక పద్ధతులు అనుసరించేలా తర్పీదు ఇవ్వనున్నారు.

పోలీసుస్టేషన్‌కు వచ్చే ఫిర్యాదుదారులకు సిబ్బంది భరోసా కల్పించే విన్నూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టనున్నారు. జిల్లా కేంద్రంలో రూ.30 లక్షలతో భరోసా కేంద్రం ఏర్పాటు చేస్తున్నారు. వికారాబాద్ ఎస్పీ కార్యాలయంలో భరోసా విభాగం ఏర్పాటు చేశారు. ఎస్పీ అన్నపూర్ణ చేతుల మీదుగా త్వరలో దాన్ని ప్రారంభించనున్నారు.  ఇది వరకు స్టేషన్‌కు వచ్చే ఫిర్యాదుదారు వద్ద ఖర్చుల పేరిట డబ్బు వసూలు చేసే విధానానికి స్వస్తి పలకాల్సిందే. యేడాది నుంచి ప్రతినెలా ఠాణాకు రూ.25 వేల చొప్పున అందజేస్తున్నారు. స్టేషనరీ, అనాధ శవాల పోస్టుమార్టం నిర్వహణ, ఫిర్యాదుదారులకు టీ, బిస్కట్లు ఇతర్రతా వాటికి ఖర్చు చేయాలని డిజిపి ఆదేశించారు. అయితే, చాలామంది స్టేషన్‌హౌజ్ అధికారులు, ఎస్సైలు వాటిని దుర్వినియోగం చేసినట్లు తెలుస్తున్నది. ఇకపై ప్రజల నుంచి వసూళ్లు చేయకుండా ప్రతి స్టేషన్‌కు కేటాయిస్తున్న రూ.25 వేలను వాటికి ఖర్చు చేయాలని ఆదేశాలు జారీ చేశారు. పట్టణ స్టేషన్ల ఖర్చుకు రూ.50 వేలను మంజూరు చేశారు. ఇప్పటి వరకు ఆరోపణలు వచ్చిన సిబ్బందిలో కూడా మార్పు తీసుకురావాలని ఉన్నతాధికారులు యోచిస్తున్నారు. వారికి సమీప ఠాణాల్లోనే పోస్టింగ్ ఇచ్చి పరివర్తన తీసుకువస్తున్నారు. మామూళ్ల వసూలు, స్టేషన్లలో స్టేషనరీ పేరిట దండుకునే సంస్కృతికి స్వస్తి చెప్పనున్నారు. స్టేషన్లను ఆధునీకరించిన తర్వాత ప్రజలకు పోలీసుశాఖ పట్ల సానుకూల ధోరణి వచ్చే అవకాశాలు ఉన్నాయి. సిబ్బందిలో కూడా మార్పు రావడం వల్ల ప్రజలకు మరింత గౌరవం పెరుగనున్నది.