Home తాజా వార్తలు ప్రగతికి ప్రభంజనం

ప్రగతికి ప్రభంజనం

people coming to the Progress Reports House

ఆదివారం నాటి ప్రగతి నివేదన సభకు తండోప తండాలుగా తరలి వస్తున్న ప్రజలు
అన్ని జిల్లాల నుంచీ అసంఖ్యాకంగా సమీకరణ
ఖమ్మం నుంచి శుక్రవారం నాడే 2 వేల ట్రాక్టర్లలో బయలుదేరిన జనం
భారీగా హాజరుకావాలని పలు ప్రజా సంఘాల విజ్ఞప్తి

మన తెలంగాణ/ హైదరాబాద్ : ప్రగతి నివేదన సభ ప్రాంగణం పూర్తి గా గులాబీమయంగా మారింది. ఏ దిక్కు చూసినా గులాబీ పార్టీ జెండాలు రెపరెపలాడుతున్నాయి. సభకు దారితీసే రహదారులన్నీ భారీ ఎత్తున ముఖ్యమంత్రి కెసిఆర్ కటౌట్లు, ఫ్లెక్సీలతో నిండిపోయాయి. సభా ప్రాంగణ పరిసర ప్రాంతాల్లో చెట్లు, కరెంటు స్తంభాలు, భవనాలకు పార్టీ జెండాలు వేలాడుతున్నాయి. రోడ్లకు ఇరువైపులా ఆకర్షణీయమైన పార్టీ పతాకాలను భారీ సంఖ్యలో ఏర్పాటు చేశారు. సభా ప్రాంగణానికి మరో పది కిలోమీటర్ల దూరం నుంచే రోడ్లన్నింటా టిఆర్‌ఎస్ పార్టీ జెండాలు దర్శనమిస్తున్నాయి. ఆదివారం మధ్యాహ్నం నాలుగు గంటలకు ప్రారంభం అవుతున్నప్పటికీ రాష్ట్రంలోని పలు జిల్లాల నుంచి జనాలను తరలించే పనులు శుక్రవారం సాయంత్రం నుంచే మొదలయ్యాయి.

ఖమ్మం ఎంపి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి నాయకత్వంలో సుమారు రెండు వేల ట్రాక్టర్లతో వేలాది మంది ప్రజలు ప్రగతి నివేదన సభకు హాజరయ్యేందుకు హైదరాబాద్‌కు బయలుదేరారు. మంత్రి తుమ్మల నాగేశ్వరరావు జెండా ఊపి ప్రారంభించారు. ఈ ట్రాక్టర్లను పార్టీ జెండాలు, ఫ్లెక్సీలతో అందంగా ముస్తాబు చేశారు. ప్రగతి నివేదన సభకు పాతిక లక్షల మంది హాజరుకానుండడంతో ఆదివారం పెద్దఎత్తున ట్రాఫిక్ సమస్యలు తలెత్తే అవకాశం ఉండడం తో ముందుగానే బయలుదేరారు. శనివారం రాత్రికే ప్రగతి నివేదన ప్రాంగణానికి చేరుకుంటారని పార్టీ వర్గాలు తెలిపాయి. మిగిలిన జిల్లా ల నుంచి జనాల తరలింపు కార్యక్రమం కూడా మొదలైనట్లు తెలుస్తోంది. శనివారం మధ్యాహ్నం నుంచి అనేక జిల్లాల నుంచి పెద్ద ఎత్తు న ట్రాక్టర్లు, ఎడ్లబండ్లపై బహిరంగ సభకు వేలాదిగా చేరుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీంతో ఆదివారం తెల్లవారే సరికే సభా ప్రాంగణానికి భారీగా ప్రజలు చేరుకోనున్నారు.

పోస్టర్‌ను ఆవిష్కరించిన హోంమంత్రి నాయిని : ప్రగతి నివేదన సభ చూసి ప్రతిపక్షాలకు వణుకుపుట్టడం ఖాయమని హోంశాఖ మంత్రి నాయిని నర్సింహారెడ్డి అన్నారు. దేశ చరిత్రలో ఇప్పటివరకు ఏ రాజకీయ పార్టీ తలపెట్టని రీతిలో సభను నిర్వహిస్తున్నామన్నారు. సిఎం కెసిఆర్ తలపెట్టిన ఈ సభకు రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజల తమ వంతు మద్దతు తెలిపేందుకు లక్షలాదిగా ఇక్కడకు తరలి వస్తున్నారని పేర్కొన్నారు. ప్రగతి నివేదన సభను జయప్రదం చేయాలని కోరుతూ టిఆర్‌ఎస్‌వి రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్‌యాదవ్ రూపొందించిన పోస్టర్‌ను కొంగరకాలన్‌లో హోంశాఖ మంత్రి నాయిని నర్సింహ్మారెడి ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో మంత్రి మహేందర్‌రెడ్డి, ఎమ్మెల్సీలు రాములునాయక్, శంభీపూర్‌రాజు, ఎమ్మెల్యే శ్రీనివాస్‌గౌడ్, టిఎన్జీవో సంఘం గౌరవ అధ్యక్షుడు దేవిప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

భారీగా తరలిరండి….విశ్వ బ్రాహ్మణుల సంఘం
రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన కొంగరకాలన్ నిర్వహిస్తున్న ప్రగతి నివేదన సభకు భారీగా తరలిరావాలని విశ్వ బ్రాహ్మణుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఏకానందం పిలుపునిచ్చారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, ప్రగతి నివేదన సభను విజవవంతం చేయడంలో విశ్వ బ్రాహ్మణులు ముందు వరసలో ఉండాలని కోరారు. బీసీలకు సిఎం కెసిఆర్ అండగా నిలుస్తున్నారని, అందుకు తమ బాధ్యతగా సభను విజయవంతం చేయాలన్నారు. విశ్వబ్రాహ్మణులకు ఉప్పల్ భగాయత్‌లో ఐదు ఎకరాల భూమి, రూ.5 కోట్లు మంజూరు చేసిన సిఎం కెసిఆర్‌కు, అందుకు సహకరించిన స్పీకర్ మధుసూదనాచారి, మంత్రులు ఈటెల రాజేందర్, జోగు రామన్నలకు ధన్యవాదాలు తెలిపారు.