Home కామారెడ్డి ముదురుతున్న జిల్లా వివాదం

ముదురుతున్న జిల్లా వివాదం

People-Strikeఅఖిలపక్షాలకు తోడుగా విద్యార్థి సంఘాలు
ఆందోళన ఉధృతం చేస్తాం
జిల్లా ఏర్పాటు అయ్యేంత వరకూ ఉద్యమం ఆగదు
మన తెలంగాణ / బాన్సువాడ టౌన్: రోజురోజుకు బాన్సువాడను జిల్లా కేంద్రంగా చేయాలన్న ఉద్యమం ఉదృతం అవుతోంది. అఖిల పక్షాలకు తోడుగా శనివారం విద్యార్థి సంఘం కూడా జత కట్టింది. ఏది ఏమైనా బాన్సువాడను జిల్లా కేంద్రం చేయాలనే ఏకైక నినాదంతో వారు ముందుకు పోతున్నారు. తమ డిమాండ్ నెరవేరే వరకు ఆందోళనను విరమించబోమని భీష్మించుకొని కూర్చుంటున్నారు. రోజుకో పార్టీ చొప్పున రిలే నిరాహార దీక్షలు చేపడుతున్నారు. వీరితో పాటు కుల సంఘాలు సైతం తమ మద్దతు మీకే నంటు ముందుకు వస్తున్నాయి. రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి ప్రాతినిత్యం వహిస్తున్న బాన్సువాడ పట్టణంలో గత ఏడు రోజులుగా ఈ ఆందోళన కొనసాగుతూనే ఉంది. రాబోయే రోజుల్లో మరింత ఉద్యమ కార్యచరణ ప్రణాళికతో ముందుకు పోతామని ఆయా పార్టీల నాయకులు పేర్కొంటున్నారు. శనివారం విద్యార్థి సంఘాల నేతల ఆధ్వర్యంలో రస్తారోకో నిర్వహించారు. జిల్లా కేంద్రంగా మార్చాలంటూ పెద్దపెట్టున నినాదాలు చేశారు. ప్లేకార్డులను చేతులో పట్టుకొని తమ నిరసనను వ్యక్తం చేశారు. గంటపాటు ధర్నాను కొనసాగించారు. బాన్సువాడ రెవెన్యూ డివిజన్‌ను జిల్లా కేంద్రంగా మార్చాలని డిమాండ్ చేస్తూ గత నాలుగైదు రోజులుగా అఖిల పక్షం ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. రోజు రోజుకు దీక్షల ఉదృతి పెరుగుతోంది. రోజుకో రకంగా ఆందోళన కార్యక్రమానికి నాయకులు శ్రీకారం చుడుతున్నారు. ఈ సందర్బంగా కాంగ్రెస్ నియోజకవర్గ ఇంచార్జీ కాసుల బాల్‌రాజ్ మాట్లాడుతూ బాన్సువాడను జిల్లా కేంద్రం చేసే అవకాశాలున్నప్పటికీ రాష్ట్ర పాలకులు రెవెన్యూ డివిజన్‌గా ఏర్పాటు చేయడం సరికాదన్నారు.

బాన్సువాడ ప్రాంతం జిల్లా కేంద్రంగా ఆవిర్బావం చేసినట్లయితే అన్ని రకాలుగా ప్రజలకు సౌకర్యంగా ఉంటుందన్నారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన హైపవర్ కమిటిలో బాన్సువాడకు ప్రాతినిద్యం వహిస్తున్న రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్ రెడ్డి సభ్యుడిగా ఉన్నప్పటికీ జిల్లా కేంద్రం విషయంలో నోరు మెదుపకపోవడం సరికాదన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి బాన్సువాడను జిల్లాగా మార్చే అవకాశం ఎంతైనా ఉందన్నారు. ప్రజాభిప్రాయాన్ని పరిగణలోకి తీసుకుని ప్రభుత్వం జిల్లా ఏర్పాటుకు మార్గం సుగమం చేయాలని ఆయన కోరారు. జిల్లా ఏర్పాటయ్యేంత వరకు తాము ఆందోళన కార్యక్రమాలు కొనసాగిస్తామని, భవిష్యత్ కార్యచరణ ప్రణాళికను రూపొందించుకున్నామన్నారు. రిలే నిరాహార దీక్షతో ప్రారంభమైన తమ ఆందోళన నేడు బంద్‌తో ముగిసిపోదని, ముందు ముందు వంటవార్పు, రాస్తారోకోలు, ధర్నాలతో పాటు బంద్‌లకు పిలుపునిచ్చే విషయంలో ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. తమ ఆందోళనలో బీజేపీ, కాంగ్రెస్, టిడిపి, సీపీఎం, సీపీఐ పార్టీల నాయకులు, కార్యకర్తలు కలిసి వచ్చారన్నారు. రోజుకో పార్టీ చొప్పున ఆ పార్టీ నాయకులు రిలే నిరాహార దీక్షలో కూర్చుంటున్నారని బాల్‌రాజ్ వివరించారు. తమ ఏకైక నినాదం బాన్సువాడను జిల్లా కేంద్రంగా చేయడమేనని ఆయన స్పష్టం చేశారు. తమ ఆందోళనకు ఎన్ని అడ్డంకులు వచ్చినా ఊరుకునేది లేదని, ఆందోళనలు మరింత తీవ్రతరం చేస్తామని ఆయన చెప్పారు.