Home వనపర్తి డంపింగ్ యార్డుకు మోక్షమెప్పుడో..?

డంపింగ్ యార్డుకు మోక్షమెప్పుడో..?

  • వృథా అయిన రూ.కోటి 30లక్షల నిధులు
  • రూ.70 లక్షలతో చేపట్టిన డంపింగ్ యార్డు నిర్మాణం అసంపూర్తిగానే
  • అధికారులు, మున్సిపల్ కౌన్సిల్ నిర్లక్షంతో చెత్త వనపర్తిగా మారుతున్న వైనం

Dumping-Yard

వనపర్తి : నూతన జిల్లా కేంద్రంలో మౌలిక సదుపాయాల కల్పన అంతంతా మాత్రంగానే వుంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు స్వచ్చభారత్ స్వచ్చతెలంగాణ కార్యక్రమాన్ని అధిక ప్రాధాన్యత ఇస్తున్నప్పటికి వనపర్తి పట్టణంలో నేటికి డంపింగ్‌యార్డు ఏర్పాటు కలగానే మిగిలిపోయింది. అధికారుల నిర్లక్షం ,మున్సిపల్ కౌన్సిల్ సమస్యను గాలికి వదలేయడంతో చెత్త సేకరణ కార్యక్రమం నత్తనడకన కొనసాగుతుంది.డంపింగ్‌యార్డు కోసం గత 11 సంవత్సరాల క్రితం 12వ ఆర్థిక సంఘం నుండి రూ.కోటి 30 లక్షలు మంజూరు అయినప్పటికి డంపింగ్‌యార్డు పనులు పూర్తి చేయడంలో అధికారులు నిర్లక్షంగా వ్యవహరించడంతో, డంపింగ్‌యార్డు కోసం మంజూరైన నిధులను ఇతర పనుల కోసం ఖర్చు చేయడంతో డంపింగ్‌యార్డు నిర్మాణం మూలన పడింది.వనపర్తి మండలం చిట్యాల గ్రామ శివారులో డంపింగ్‌యార్డు కోసం మూడేకరాల భూమిని కొనుగోలు చేశారు. ఆ స్థలంలో రూ.60లక్షల వ్యయంతో డంపింగ్ యార్డు పిల్లర్ల వరకు నిర్మించారు.మిగిత భవనం నిర్మించకుండానే వదిలేయడంతో డంపింగ్‌యార్డు నిర్మాణం ప్రశ్నార్థకంగా మారింది.డంపింగ్‌యార్డు కోసం మంజూరైన నిధుల్లో మరో రూ.10లక్షలతో చెత్తను రిసైక్లింగ్ చేసి సేంద్రియ ఎరువుగా తయారు చేసే యంత్రాన్నికొనుగోలు చేశారు. సేంద్రియ ఎరువును బయట మార్కెట్‌లో రైతులకు విక్ర యించడం ద్వారా మున్సిపల్ కార్యాలయానికి అదనపు ఆదాయం వస్తుందనే లక్షంతో ఈ యంత్రాన్ని కొనుగోలు చేశారు. కానీ అటూ డంపింగ్ యార్డు నిర్మాణం అసంపూర్తిగానే,ఇటూ సేంద్రియ ఎరువు యంత్రం వృదాగానే మిగిలిపోయింది.అధికారులకు పక్క ప్రణాళిక పనులు చేయాలన్న లక్షం లేకపోవడంతో రూ.70 లక్షల ప్రభుత్వ ధనం వృదా అయిపోయింది.డంపింగ్‌యార్డు లేకపోవడం వల్ల వనపర్తి పట్టణంలో సేకరించిన చెత్తను కొత్తబస్టాండ్ సమీపంలోని పోట్టి శ్రీరాములు విగ్రహం దగ్గర వున్న ఓ వివాదస్పద స్థలంతో పాటు ,చిట్యాల రోడ్డులో వున్న చింతల హనుమాన్ దేవాలయం దగ్గర ,అప్పాయిపల్లి దారిలో వ్యవసాయ పొలల్లో చెత్తను పారవేయడం వల్ల తిరిగి చెత్త, ప్లాస్టిక్ కవర్లు ఈదురు గాలులకు పట్టణంలోకి వస్తున్నాయి. కొత్తబస్టాండ్, చింతల హనుమాన్ దగ్గర చిన్నపాటి గాలులు వస్తే చెత్తం తా రోడ్లపైకి వచ్చి పడుతుంది.

కనుమరుగైన రీసైక్లింగ్

పట్టణలో సేకరించిన తడి పొడి చెత్తలను రీసైక్లింగ్ చేసి వర్మీ కంపోస్ట్ తయారు చేయాలనుకున్న ప్రతిపాదన మూలన పడింది. ఇందుకోసం నల్గోండ జిల్లాలోని సూర్యాపేట మున్సిపాలిటిలో గతంలో పాలక వర్గ సభ్యులు సందర్శించి పరీశీలించారు. ఇందులో భాగంగా తడి పొడి చెత్తలను వేర్వేరుగా సేకరించడానికి రెండేసి చొప్పున బుట్టలు పంపిణీ చేశారు.

అధికారులు నిర్లక్షం వీడి ఇప్పటికైనా డంపింగ్‌యార్డు ఏర్పాటును పూర్తి చేయాలి
-15వ వార్డు కౌన్సిలర్ ఉంగ్లం తిరుమల్

ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో వుంచుకొని అధికారులు వెంటనే డంపింగ్‌యార్డు నిర్మాణం పూర్తి చేయాలని 15వ వార్డు కౌన్సిలర్ ఉంగ్లం తిరుమల్ అన్నారు. 11 సంవత్సరాల క్రితం చేపట్టిన పనుల అధికారుల ఆలసత్యం వల్ల పూర్తి కాకపో వడం దారుణమన్నారు. పట్టణంలో సేకరించిన చెత్తను మళ్ళి పట్టణంలోనే పారవేయడం వల్ల తిరిగి ఆ చెత్త రోడ్లపైకి వచ్చి డ్రైనేజిలలో పేరుకుపోతుందని దీంతో వర్షం వచ్చినప్పుడులో తట్టు కాలనీల్లో మురుగు నీరు ఇండ్లలోకి వస్తుందని ఆయన అధికారుల పనితీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు.ఇప్పటికైనా అధికారులు స్పందించి డంపింగ్ యార్డు నిర్మాణం యుద్దప్రాతిపదికన పూర్తి చేసి డంపింగ్‌యార్డు నిర్మాణాన్ని వినియోగంలోకి తీసుకోరావాలన్నారు.

వెంటనే డంపింగ్ యార్డును నిర్మించాలి…
21 వ వార్డు కౌన్సిలర్ సతీష్‌యాదవ్

11 సంవత్సరాలుగా పెండింగ్‌లో ఉన్న డంపింగ్ యార్డులను వెంటనే పూర్తి చేయాలని 21 వ వార్డు కౌన్సిలర్ సతీష్ యాదవ్ తెలిపారు. అధికారుల నిర్లక్షంతో ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్న విధంగా డంపింగ్ యార్డు పనులు ముందుకు సాగడం లేదని ఆయన తెలిపారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి డంపింగ్ యార్డును పూర్తి చేయాలని ఆయన కోరారు.

స్థలం వివాదంలో ఉన్నందున పనులు ఆపి వేశాం ..
ఇంచార్జీ కమిషనర్ సురేష్

డంపింగ్ యార్డు కోసం 11 సంవత్సరాల కింద తీసుకున్న స్థలం వివాదంలో ఉందని నూతన డంపింగ్ యార్డు స్థలం కోసం కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లడం జరిగిందని ఇంచార్జీ కమిషనర్ సురేష్ తెలిపారు.