Search
Wednesday 26 September 2018
  • :
  • :
Latest News

తాగు నీటి కోసం తండావాసుల తంటాలు

Peoples Face Drinking Water Crisis Problem In Vikarabad

వికారాబాద్‌టౌన్ ః మంచి నీటి సమస్యతో కొట్టు మిట్టాడుతున్న కొట్టంగుట్ట తండావాసులు గత నెల రోజులుగా అనేక ఇబ్బందులు పడుతున్న పట్టించుకునే నాథుడే కరువయ్యారు. ఏమాత్రం నీటి సమస్య ఉన్నా ఎన్ని నిధులైనా కేటాయించి నీటి సమస్య తీర్చాలని ప్రభుత్వం ఆదేశించిన కొట్టంగుట్ట తండాలో నెలకొన్న నీటి సమస్యను అధికారులు పట్టించుకోవడం లేదు. అధికారులు నామ మాత్రంగా ఒక ట్యాంకరు నీటిని పంపించగా ఆ నీళ్ళు ఎవరికి అందక, సరిపోక ఒకరినొకరు కొట్టుకుంటున్నారు. దీంతో వచ్చే ఆ ఒక్క ట్యాంకరు కూడా రాకపోవడంతో గుట్టలలో ఉన్న మంచినీటి చెలిమెలే కొట్టంగుట్టతండాకు ప్రాణాధారమైంది. కొట్టంగుట్ట తండా వికారాబాద్ జిల్లా కేంద్రానికి కూత వేటు దూరంలో ఉన్న గెరిగెట్‌పల్లి గ్రామ పంచాయతీ అనుబంధ గ్రామం. ఈ గ్రామం ను ఇటీవల వికారాబాద్ మున్సిపల్‌లో విలీనం చేయడానికి ప్రభుత్వం జిఒ కూడా విడుదలచేసింది. గెరిగెట్‌పల్లి అనుబంధ గ్రామమైన ఈ తండాలో 70 కుటుంబాలు నివసిస్తున్నాయి. 300 ఓటర్లు ఉన్న ఈ గ్రామంలో ఎండకాలం ప్రారంభమైనప్పటి నుండి నీటి సమస్య ఉన్నది. ఉన్న ఒక్క బోరుతో త్రాగు నీరు తెచ్చుకుంటుండగా గత నెలలో పాడైపోయింది. ప్రత్యామ్నయంగా రోజుకు ఒక మంచి నీటి ట్యాంకరు పంపించగా ఎవరికి ముందు నీళ్ళు దొరుకుతాయో అనే హడాహుడిలో గ్రామస్తులు ఒకరినొకరు కొట్టుకుని కోట్లాటలు కావడంతో ఓ బాలుడికి ట్యాంకులోపడి గాయాలయ్యాయి. దీంతో అధికారులు ఆ ఒక్క ట్యాంకరు కూడా నిలిపి వేయడంతో గ్రామంలో ఉన్న పురాతన బావి నీరు వాడుకున్నారు.

బావి నీరు కలుషితమైన నీరు కావడంతో చర్మ వ్యాధుల బారిన పడుతున్నారు. దీంతో ఆ బావి నీరు కూడా వాడడం మానేశారు. పక్కనే ఉన్న గుట్టలలో నుండి వచ్చే చలిమే నీళ్ళు తెచ్చుకుని తాగుతున్నారు. ఉదయం 4గంటలకు లేచి చలిమేలో ఊరిన నీళ్ళను పట్టి తెచ్చుకుంటున్నామని తండావాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొత్త బోరు వేసి నీరివ్వమని గ్రామ సర్పంచిని అడుగగా రేపు మాపని కాలం గడుపుతున్నాడని ఆరోపిస్తున్నారు. ఇటీవల ముఖ్యమంత్రి 300 ఓట్లు ఉన్నతండాలను గ్రామ పంచాయతీలను చేస్తామనగా మా తాండ ప్రత్యేక పంచాయతీ అయితే నిధుల వచ్చి అభివృద్ది అవుతుందని అనుకుంటే గెరిగెట్ పల్లికి చెందిన పలుకుబడి ఉన్న అధికార పార్టీ నాయకుడు అడ్డుకున్నాడని ఆరోపిస్తున్నారు. ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్ నిధులను కూడ వాడుకుని తాండలో రోడ్లు వేయకుండా వేరోచోట వేశారని గిరిజనులు ఆరోపిస్తున్నారు. గ్రామంలో మొత్తం మీద 9 స్థంభాలు ఉంటే 2 స్థంభాలకు మాత్రమే విద్యుత్ దీపాలు వెలుగుతున్నాయి. 30 స్థంభాలు వేస్తామని స్థానిక లైన్‌మెన్ కొలతలు తీసుకు వెళ్ళి సంవత్సరం గడుస్తున్నా ఒక్క స్థంభం కూడా వేయలేదన్నారు. అదేవిధంగా అసైన్‌మెంట్ ల్యాండ్ సాగు చేసుకుంటున్న 51 మంది రైతులకు రైతుబంధు చెక్కులు కూడా రాలేవని ఎవరు పట్టించు కోవడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు, ప్రజాప్రతినిధులు పట్టించుకుని గ్రామ సమస్యలు పరిష్కరించాలని కోరుతున్నారు.

Comments

comments