Search
Sunday 23 September 2018
  • :
  • :

పెట్రోలు, డీజిల్ ధరలు లీటరుకు రూ.4 పెరగొచ్చు!

 Petrol and diesel prices may rise by Rs 4 per liter

న్యూఢిల్లీ: కర్నాటక ఎన్నికల నేపథ్యంలో పెట్రోలు, డీజిల్ రేట్ల సవరణ నిలిపివేసిన ఆయిల్ సంస్థలు మళ్లీ విజృంభించేందుకు సిద్ధమవుతున్నాయి. దాదాపు 19 రోజుల తర్వాత పెట్రో ధరలను పెంచిన చమురు సంస్థలు.. ఈ విరామంలో వచ్చిన నష్టాన్ని పూడ్చుకునే పనిలో ఉన్నాయి. వచ్చే రోజుల్లో లీటరు పెట్రోలు, డీజిల్ ధర రూ.4 వరకు పెరిగే అవకాశముందని పలు సంస్థలు అంచనా వేస్తున్నాయి. కర్నాటక ఎన్నికలు ముగిసిన వెంటనే చమురు సంస్థలు రోజువారీ పెట్రో ధరల సవరణ చేపట్టాయి. ప్రభుత్వరంగ ఆయిల్ సంస్థలు.. ఐఒసి(ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్), హెచ్‌పిసిఎల్(హిందుస్తాన్ పెట్రోలియం కార్పొరేషన్), బిపిసిఎల్(భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్)లు సోమవారం నుంచి రోజువారీ డీజిల్, పెట్రోలు ధరలను సవరణ మొదలు పెట్టాయి. సోమవారం నుంచి గురువారం వరకు అంటే నాలుగు రోజుల్లో.. లీటరు పెట్రోలుపై 69 పైసలు పెరగడంతో ఢిల్లీలో దీని ధర లీటరుకు రూ.75.32కు చేరి.. ఐదేళ్ల గరిష్ఠ స్థాయికి చేరింది. మరోవైపు లీటర్ డీజిల్ ధర కూడా 22 పైసలు పెరగడంతో ఢిల్లీలో డీజిల్ రేటు రూ.66.79కు అయింది. కొటక్ ఇనిస్టిట్యూషనల్ ఈక్విటీస్ నివేదికలో పెట్రో ధర అంచనాలను పేర్కొంది. దీని ప్రకారం, దిగుమతి చేసుకునే ఆయిల్ మార్కెటింగ్ కంపెనీ (ఒఎం సి)లు డీజిల్ రిటైల్ ధర లీటరుకు రూ.3.5 నుంచి రూ.4కు.. అలాగే పెట్రోలు లీటరుకు రూ.4 నుంచి రూ.4.55కు పెంచాల్సిన అవసరం ఉంది. ఈమేరకు ఆ సంస్థ నివేదికలో తెలిపింది. అంతర్జాతీయ చమురు ధరలు, రూపాయి డాలర్ మారకం విలువ ఆధారంగా పెట్రో ధరలను పెంపు ఉంటుంది. అంతర్జాతీయంగా క్రూడ్ ఆయిల్ ధరలు పెరిగినప్పటికీ కర్నాటక ఎన్నికల ఫలితాలకు ముందు పెట్రో ధరలను పెంచలేదు. కాగా గత 28 నెలల్లో డీజిల్ ధరల పెంపు 50 శాతానికిపైగా అంటే 51.17 శాతం పెరిగినట్టు తెలిసింది. 2016 జనవరి 16న ఢిల్లీలో లీటరు డీజిల్ ధర రూ.44.18 ఉంటే, 2018 మే 17 అంటే నేటికి లీటరుకు రూ.66.79కు పెరిగినట్టు వెల్లడైంది.
80 డాలర్లకు చేరిన బ్యారెల్
అంతర్జాతీయ మార్కెట్లలో ముడిచమురు ధరలు ఆందోళన కల్గిస్తున్నాయి. బ్రెంట్ చమురు బ్యారెల్ 80 డాలర్లకు చేరింది. నాలుగేళ్లో ఇంత భారీ స్థాయికి చమురు ధరలు చేరడం ఇదే తొలిసారి. ప్రస్తుతం లండన్ మార్కెట్లో బ్రెంట్ చమురు బ్యారల్ 0.15 శాతం పెరిగి 79.39 డాలర్లకు చేరింది. న్యూయార్క్ మార్కెట్లో నైమెక్స్ 0.3 శాతం పెరిగి 71.72 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. ఫలితంగా చమురు ధరలు 2014 నవంబర్‌నాటి స్థాయిలను తాకాయి. అమెరికాలో ఇంధన నిల్వలు తగ్గడంతో చమురు ధరలు మరింత బలపడినట్లు విశ్లేషకులు పేర్కొన్నారు. చమురు సరఫరాలకు కీలకమైన ఇరాన్‌తో మూడేళ్ల క్రితం కుదుర్చుకున్న అణు ఒప్పందాన్ని అమెరికా రద్దు చేసుకోవడంతో చమురు ధరలకు రెక్కలొచ్చాయి. అణు ఒప్పందం రద్దుతోపాటు ఇరాన్‌పై అమెరికా ఆంక్షలు విధించడంతో చమురు ధరలు మండుతున్నాయి.

Comments

comments