Home బిజినెస్ రోజువారీగా పెట్రో, డీజిల్ ధరలు

రోజువారీగా పెట్రో, డీజిల్ ధరలు

 జూన్ 16 నుంచి అమలు
Petrolన్యూఢిల్లీ : దేశవ్యాప్తంగా జూన్ 16 నుంచి రోజువారీగా పెట్రోలు, డీజిల్ ధరల ప్రక్రియ రానుంది. ప్రస్తుత పదిహేను రోజులకోసారి అంతర్జాతీయ ధరల ప్రకారం ఇంధన ధరలను సవరిస్తున్నారు. ఇప్పటికే పైలట్ ప్రాజెక్ట్‌లో భాగంగా కొన్ని ఎంపిక చేసిన పట్టణాల్లో మే 1 నుంచి రోజువారీ పెట్రోలు ధరల మార్పు ప్రక్రియను ప్రారంభించారు. అంతర్జాతీయ మార్కెట్ ధరలకు అనుగుణంగా ప్రతి రోజూ ధరలను నిర్ణయిస్తూ విశాఖపట్టణం, పుదుచ్చేరి, ఉదయ్ పూర్, ఛండీగడ్, జంషెడ్ పూర్‌లలో ప్రయోగాత్మకంగా పెట్రోలు, డీజిల్ లను విక్రయిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ విధానాన్ని దేశవ్యాప్తంగా అమలు చేయాలని ప్రభుత్వరంగ ఇంధన సంస్థలు నిర్ణయించాయి. దీంతో ఈ నెల 16 నుంచి దేశవ్యాప్తంగా ప్రతిరోజూ పెట్రోల్, డీజిల్ ధరలు మారతాయి. ఇప్పటి వరకు పక్షం రోజులకోసారి ధర మార్పు చేయగా, దీనివల్ల కొన్ని సార్లు లాభాల బాటపడుతున్నా కొన్నిసార్లు మాత్రం నష్టం వస్తోందని ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్, భారత్ పెట్రోలియం కార్పొరేషన్, హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్‌లు కేంద్రానికి విన్నవించాయి. దీంతో ఈ నిర్ణయానికి వచ్చారు. కాగా ప్రభుత్వ రంగ సంస్థల బాటలోనే ఎస్సార్ ఆయిల్, రిలయన్స్ ఇండస్ట్రీస్‌లు కూడా ఇదే విధానాన్ని అమలు చేయనున్నట్టు సమాచారం. ప్రభుత్వ నిర్ణయంపై డీలర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వేర్వేరు ధరల వద్ద కొనుగోలు చేసే ఇంధన నిల్వలను ఏ ధర వద్ద విక్రయించాలనే దానిపై తీవ్ర గందరగోళం ఉందని వాపోతున్నారు. దేశంలోని చాలా పెట్రోల్ బంకుల్లో ఆటోమేటిక్ వ్యవస్థలు లేవని, అందువల్ల లాభాలపై ప్రభావం పడుతుందని యజమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.