Search
Tuesday 18 September 2018
  • :
  • :
Latest News

దీపావళినాటికి పెట్రో ధరలు దిగొస్తాయ్..

పెట్రోలియం శాఖమంత్రి ధర్మేంద్ర ప్రదాన్

pradhan

న్యూఢిల్లీ: ఇంధన ధరలు దీపావళి నాటికి దిగివస్తాయని పెట్రోలియం శాఖమంత్రి ధర్మేంద్ర ప్రదాన్ వెల్లడించారు. పెట్రో ధరలు భారీగా పెరగడంపై ప్రతిపక్ష పార్టీలు తీవ్ర విమర్శలు చేస్తున్న నేపథ్యంలో ఆయన ఈ విధంగా స్పందించారు. ఇటీవల ప్రభుత్వం రోజువారీగా పెట్రోలు రేట్ల సవరణ విధానాన్ని ప్రవేశపెట్టిన తర్వాత ఇంధన ధరలు గణనీయంగా పెరుగుతూ వస్తున్నాయి. అంతర్జాతీయంగా ముడి చమురు ఉత్పత్తి తగ్గుముఖం పట్టడం వల్లే దేశీయంగా పెట్రో రేట్లు పెరుగుతాయని కొద్ది రోజుల క్రితం మంత్రి చెప్పుకొచ్చారు. ఇప్పుడు విమర్శలు వెల్లువెత్తుతుండడంతో దీపావళి నాటికి ధరలు తగ్గుతాయని ఇక్కడ ఓ సమావేశంలో మంత్రి చెప్పుకొచ్చారు. కేబినెట్ మంత్రిగా హోదా పొందిన ప్రదాన్ మాట్లాడుతూ, పెట్రోలు ధరలను కూడా జిఎస్‌టి పరిధిలోకి తీసుకొస్తే రేట్లు తగ్గుముఖం పడతాయని, హేతుబద్దీకరణ సాధ్యమవుతుందని అన్నారు.
జిఎస్‌టిలోకి వస్తే ధరలు తగ్గుతాయా?
పెట్రోల్, డీజిల్ ధరలను జిఎస్‌టి పరిధిలోకి తెస్తారనే వాదనలు పెరుగుతున్నాయి. ఇదే జరిగితే రేట్లు నిజంగానే తగ్గుతాయా? లేదా? అనే దానిపై అనేక అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. దేశంలోని ప్రధాన నగరాల్లో ప్రస్తుతం పెట్రో ధరలు మూడేళ్ల గరిష్టానికి చేరుకున్నాయి. రోజువారీ మారే పెట్రోధరలతో సామాన్యుడిపై పెను భారం పడుతోంది. రోజువారీ ధరల విధానంతో ధరలు తగ్గుతాయనుకుంటే.. ఒక్కసారిగా పెట్రోలు రేట్లు పెరగడం ప్రజలకు తీవ్ర ఆవేదన కల్గిస్తోంది. తాజాగా ఇంధనశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ దీపావళికి శుభవార్త వింటారని ప్రకటించారు. ఆయన చేసిన ప్రకటనతో పెట్రో, డీజిల్ ధరలను జిఎస్‌టి పరిధిలోకి తెస్తారనే వాదనలకు మరింత ఊతమిస్తున్నాయి. దేశంలోని వివిధ రాష్ట్రాల్లో.. వివిధ రకాల వ్యాట్, ఇతర పన్నులు ఉండడంతో ఇంధన ధరలు భారీగా ఉంటున్నాయి. అందువల్ల పెట్రోల్, డీజిల్‌ను జిఎస్‌టి పరిధిలోకి తీసుకురావాలని ఇంధనశాఖ ఆర్థిక శాఖను కోరింది. రాష్ట్రాలకు ప్రధాన ఆదాయ వనరుగా ఉన్న పెట్రో, డీజిల్‌ను జిఎస్‌టిలోకి చేర్చేందుకు అందరి అంగీకారం ఉంటుందా? అనేది చెప్పడం కష్టమైన విషయమే.. ఎందుకంటే జిఎస్‌టి పరిధిలోకి పెట్రో ధరలను తెస్తే రాష్ట్రాల ఆధాయాలు గణనీయంగా పడిపోతాయనే భయాందోళనలు ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో జిఎస్‌టిలోకి పెట్రో ధరలు తేవడం అంత సులువేం కాదని నిపుణులు అభిప్రాయ వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం పెట్రో ఉత్పత్తులపై వినియోగదారుడు పలు రకాల పన్నులు చెల్లిస్తున్నాడు. అందులో ప్రధానంగా ఎక్సైజ్ పన్ను (కేంద్రం విధిస్తుంది), ఇక విలువ ఆధారిత పన్ను (వ్యాట్)ను ఆయా రాష్ట్రాలు డీలర్ కమీషన్‌తో కలిపి ఆయా రాష్ట్రాలు విధిస్తున్నాయి. ఉదాహరణకు ఢిల్లీలో సెప్టెంబర్ 13 నాటిపెట్రోధరలు చూస్తే.. లీటర్ పెట్రోల్ ధర 70.38 రూపాయలుగా ఉంది. అందులో కేంద్రం విధించే ఎక్సైజ్ డ్యూటీ రూ.21.48, రాష్ట్రాలు విధించే పన్ను రూ.27, అందులో వ్యాట్ రూ. 14.96 కాగా, డీలర్ కమీషన్ రూ.3.24, వాస్తవంగా పెట్రోల్ ధర వచ్చి 30.70 రూపాయలు.. అన్ని రకాల పన్నులతో కలిపి లీటర్ పెట్రోల్ రూ.70.38కి చేరింది. పెట్రో ఉత్పత్తులు జిఎస్‌టి పరిధిలోకి వస్తే వ్యాట్, ఎక్సైజ్ పన్నులు కలిసిపోయి ఒకే పన్ను శ్ల్లాబ్‌లోకి చేరుతుంది. ప్రస్తుతం జీఎస్టీలో అత్యధిక పన్ను స్లాబ్ 28 శాతం మాత్రమే ఉంది. అంటే ధరలు మాత్రం భారీగా తగ్గుతాయి. అంటే లీటర్ పెట్రోల్ ధర 40 లోపుకు వచ్చే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. అయితే పెట్రోల్ డీజిల్‌ను జీఎస్టీ పరిధిలోకి తీసుకువస్తే.. రాష్ట్రాలు భారీగా ఆదాయాన్ని కోల్పోతాయని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. మరోవైపు పెట్రో ఉత్పత్తులను జిఎస్‌టి పరిధిలోకీ తీసుకురావాలన్ని ఇంధనశాఖ విన్నపాన్ని ఆర్థికశాఖ పక్కనపెట్టినట్లు తెలుస్తోంది.

Comments

comments