Search
Friday 21 September 2018
  • :
  • :

పెట్రో మంట…

Petrol prices are  Heavy burden the  common man
పెట్రో మంట… సర్వత్రా నిరసనల వెల్లువ
భగభగమంటున్న పెట్రోల్ ధరలు
ఎన్నడూ లేనంతగా రికార్డు స్థాయిలో పెరుగుదల
ఇష్టారాజ్యంగా ఇంధన కంపెనీల వడ్డన
రోజురోజుకు పెరుగుతున్న ధరలతో ప్రజల బెంబేలు
ఆందోళనలో లారీ యజమానులు
సామాన్యులపై పెనుభారం

మహబూబ్‌నగర్: పెట్రోల్, డీజిల్ ధరలు రికార్డుస్థాయికి చేరుకుంటున్నాయి. రోజురోజుకు ధరలు పెరిగిపోతూ ఆందోళన కలిగిస్తున్నాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా పెట్రోల్ ధర రూ.82.69లకు, డీజిల్ ధర రూ.74.97లకు చేరుకుంది. వీటి ధరలతో మధ్యతరగతి, సామాన్య ప్రజలతో పాటు లారీ యజమానులు, ఆటోల నిర్వాహకులు ఆందోళన చెందుతున్నారు. రవాణా రంగం ఖర్చులు పెరగడంతో ఆ ప్రభావం అన్నింటిపై పడుతోందిని సామాన్యులు విలవిలలాడుతున్నారు. పెట్రోల్, డీజిల్‌లు ప్రస్తుతం నిత్యావసరంగా మారాయి. ప్రస్తుత కాలంలో ప్రతి ఒక్కరి వద్ద పెట్రోల్, డీజిల్‌తో నడిచే ఏదో ఒక వాహనం ఉండడంతో వీటి అవసరం బాగా పెరిగింది. ఇదే సమయంలో వాటి ధరలు నింగిని తాకుతున్నాయి. గతంలో మూడు నెలలకో, ఆరు నెలలకో, ఏడాదికో ధరలు పెంచేవారు. కానీ ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వ విధానాలతో రోజురోజుకు ధరలు పెరుగుతుండడంతో వాహనదారులు బెంబేలెత్తుతున్నారు. ఎన్నడూ లేనంతాగా ఇష్టారాజ్యంగా ధరలు పెరుగుతుండడంతో సర్వత్రా నిరసనలు వ్యక్తమవుతున్నాయి.

రోజురోజుకు పెరుగుతున్న ధరలతో ప్రజల బెంబేలు
ఒకప్పుడు పెట్రోల్, డీజిల్ ధరలు ఏదో ఒక సందర్భంలో తక్కువగానే పెంచడం జరిగేది. కానీ నేడు అలా కాకుండా ఒక విధి విధానం లేకుండా రోజురోజుకు పెరగడంతో వాటి ధరలు రికార్డుస్థాయికి చేరుకుంటున్నాయి. ఈ ధరలకు ఎక్కడ ముగింపు వుంటుందో, లేదోనని వినియోగదారులు వాపోతున్నారు. ఎప్పుడు ఊహించని విధంగా ధరలు పెరిగిపోతూనే ఉన్నాయి. మొదట ప్రతి 15 రోజులకోసారి ధరలు పెంచారు. తరువాత రోజువారీ ధరలను అమలు చేసేందుకు నిర్ణయించారు. గతేడాది జూన్ నుంచి కేంద్రప్రభుత్వం పెట్రోల్, డీజిల్ ధరలను రోజువారీగా పెంచుతోంది. అప్పటి నుంచి రోజుకు రెండు, మూడు పైసల నుంచి రూపాయికి పైగా కూడా పెంచడం జరిగింది. గతంలో లీటర్ పెట్రోల్ ధర రూ.60లు, డీజిల్ రూ.50ల వరకు వుండేది. ప్రస్తుత కేంద్రప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పెట్రోల్, డీజిల్ ధరలపై పూర్తిగా ఆంక్షలు తొలగిపోయాయి. ఎప్పటికప్పుడు ధరలు పెంచుతూ వుండడం వలన లీటరు పెట్రోల్ ఊహించని విధంగా రూ.82.69లకు చేరుకుంది. అలాగే డీజిల్ ధర రూ.74.97లకు చేరింది. పవర్‌పెట్రోల్ ధర రూ.85.52లకు చేరుకుంది. ఒక ప్రభుత్వం నాలుగేళ్ల పాలనలో లీటరు పెట్రోల్, డీజిల్‌పై ఇంత ఎక్కువ మొత్తంలో ధరలు పెంచడం ఇదే మొదటిసారి అని వినియోగదారులు వాపోతున్నారు.

ఇష్టారాజ్యంగా ఇంధన కంపెనీల వడ్డన
ఇంధన ధరలపై ప్రభుత్వ అజమాయిషీ లేకపోవడంతో కంపెనీలు ఇష్టారాజ్యంగా పెంచుతున్నట్లు వినియోగదారులు పేర్కొంటున్నారు. గతంలో ధరలు పెంచినప్పుడు ప్రజలకు తెలిసేది. రాజకీయ పార్టీలు, వామపక్షాలు ధరల పెరుగుదలపై నిరసన తెలిపేవారు. దీంతో ప్రభుత్వం దిగివచ్చిన సందర్భాలు కూడా ఉన్నాయి. పెంచిన ధరలు తగ్గించడం కూడా జరిగింది. అయితే రోజువారీ ధరల పెరుగుదలతో ఎప్పడు ధర ఎలా ఉంటుందో వినియోగదారులకు తెలియడం లేదు. కానీ గత నాలుగు నెలల కాలంలో ధరలు విపరీతంగా పెరిగిపోతూనే ఉన్నాయి. ధరలు తగ్గించిన సందర్భాలు చాలా తక్కువే. పెరుగుతున్న ధరలను అమలు చేయడానికి పెట్రోల్ బంకుల యజమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయినప్పటికీ ఎటువంటి స్పందన లేదు. వినియోగదారులు తప్పని పరిస్థితుల్లో పెట్రోల్, డీజిల్‌ను కొనుగోలు చేస్తున్నారు. పెరుగుతున్న పెట్రోల్, డీజిల్ ధరల కారణంగా లారీల యజమానులపై తీవ్ర ప్రభావం చూపుతోంది. రవాణా భారం పెరుగుతుండడంతో వాటిని నడపలేక అమ్ముకోవాల్సిన దుస్థితి ఏర్పడుతోందని వారు మండిపడుతున్నారు. అదే విధంగా ఆటోలపై కూడా ఈ ప్రభావం పడుతోంది. వారి గిట్టుబాటు ధర కోసం కిరాయిలు కూడా పెంచుతున్నారు. దీంతో నిత్యావసర వస్తువుల ధరలపై ప్రభావం చూపడంతో సామాన్యులు అనేక ఇబ్బందులు పడుతున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పెట్రోల్, డీజిల్ ధరలను అదుపుచేయకపోతే ప్రజల నుంచి తీవ్ర నిరసనలు ఎదుర్కోవాల్సిన పరిస్థితులు లేకపోలేదు. ఇప్పటికే లారీ యజమానులు నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా ధరలను నియంత్రించి వాహనదారులు, సామాన్యులపై భారం పడకుండా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

Comments

comments