Search
Thursday 15 November 2018
  • :
  • :
Latest News

పెట్రో జ్వాలలు

petrol

పెట్రోల్‌పై  36, డీజిల్‌పై 26 పైసలు ధర పెంపు

న్యూఢిల్లీ: మునుపెన్నడూ లేనంత గరిష్ఠ స్థాయికి పెట్రోల్, డీజిల్ ధరలు ఆదివారం చేరాయి. పెట్రోల్ ధర రికార్డు స్థాయిలో లీటరు రూ. 76.24, డీజిల్ ధర రికార్డు స్థాయిలో లీటరు రూ. 67.57కు చేరింది. రోజువారీ ధరల సమీక్ష విధానాన్ని ప్రవేశపెట్టాక పెట్రోల్ ధర ఈ స్థాయికి చేరుకోవడం ఇదే ప్రథమం. కాగా డీజిల్ 26 పైసలు పెరిగి సర్వకాల(ఆల్ టైమ్) గరిష్ఠం రూ. 67.57కు చేరింది. అంతర్జాతీయ మార్కెట్‌లో గత నాలుగు వారాలుగా పెరుగుతున్న ధరల భారాన్ని ప్రభుత్వ రంగ చమురు సంస్థలు వినియోగదారులపై మోపాయి. ఒక్కో రాష్ట్రానికి స్థానిక అమ్మకం పన్నులు లేక వ్యాట్ వంటి ఆధారంగా వేర్వేరు ధరలున్నాయి. మెట్రో నగరాలన్నింటిలోకి ఢిల్లీలోనే అతి తక్కువ ధర ఉంది. ఢిల్లీలో పెట్రోల్ ధర 33 పైసలు పెరిగి లీటరు రూ. 76.24కు, అలాగే డీజిల్ ధర 26 పైసలు పెరిగి లీటరు 67.57కు చేరింది. ప్రభుత్వ రంగ చము రు సంస్థలు జారీ చేసిన ధరల ప్రకటన ప్రకారం ప్రధాన నగరాల్లో లీటరు పెట్రోలు ధరలు ఇలా ఉన్నాయి. ముంబయిలో రూ. 84. 07, భోపాల్‌లో రూ. 81.83, పాట్నా రూ. 81.73, హైదరాబాద్ రూ. 80.76, శ్రీనగర్ రూ. 80.35, కోల్‌కతాలో రూ. 78.91, చైన్నైలో రూ. 79.13 ఉన్నాయి. కాగా పంజిమ్‌లో లీటరు పెట్రోల్ చౌకగా రూ. 70.26కే లభిస్తుంది.
హైదరాబాద్‌లోనే అత్యధిక డీజిల్ ధర : స్థానికి పన్నులు ఎక్కువ ఉన్న కారణంగా దేశంలోని మిగతా ప్రాంతాలతో పోల్చినప్పుడు హైదరాబాద్‌లోనే డీజిల్‌కు అత్యధిక ధర ఉంది. హైదరాబాద్‌లో లీటరు డీజిల్ ధర రూ. 73.45 కాగా, ట్రివేండ్రంలో రూ. 73.34, రాయ్‌పూర్‌లో రూ. 72.96,గాంధీనగర్‌లో రూ. 72.63, భువనేశ్వర్‌లో రూ. 72.43, పాట్నాలో రూ. 72.24, జైపూర్‌లో రూ. 71.97, రాంచీలో రూ. 71.35, భోపాల్ రూ. 71.12 శ్రీనగర్‌లో రూ. 70.96, ముంబయిలో రూ. 71.94, కోల్‌కతాలో రూ. 70.12, చెన్నైలో రూ. 71.32, పోర్ట్‌బ్లెయిర్‌లో రూ. 63.35గా ఉన్నాయని ప్రభుత్వ రంగ చమురు సంస్థల ప్రకటన పేర్కొంది. ఇదిలా ఉండగా వినియోగదారులపై భారాన్ని తగ్గించేందుకు ప్రభుత్వం ఎక్సైజ్ సుంకాన్ని తగ్గిస్తుందా అని అడిగిన ప్రశ్నకు ఆర్థిక వ్యవహారాల కార్యదర్శి సుభాషచంద్ర గర్గ్ సమాధానం ఇవ్వడానికి నిరాకరించారు. ‘ బ్యారెల్ చమురు ధర 80 డాలర్లను తాకడాన్ని ప్రభుత్వం గమనిస్తోంది. ఇది 2014 నవంబర్ నుంచి గరిష్ఠం. తగిన చరలు తీసుకున్నాం. ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించే విషయంలో వేచి చూడండి’ అని ఆయన చెప్పారే తప్ప ఎక్కువ వివరించలేదు. బిజెపి ప్రభుత్వం ఎక్సైజ్ సుంకాన్ని 2014 నవంబర్ నుంచి 2016 జనవరి వరకు తొమ్మిదిసార్లు పెంచింది. దీంతో లీటరు పెట్రోల్‌పై రూ. 11.77, లీటరు డీజిల్‌పై రూ. 13.47 ఎక్సైజ్ భారం పడింది.
పెరిగే ఇంధన ధరలకు త్వరలో పరిష్కారం: ధరేంద్ర ప్రధాన్
పెరుగుతున్న పెట్రోల్, డీజిల్ ధరలపై కేంద్ర ప్రభుత్వం ఆదివారం స్పందించింది. దీనికి ఓ పరిష్కార మార్గాన్ని ప్రభుత్వం కనుగొంటుందని పెట్రోలియం మంత్రి ధరేంద్ర ప్రధాన్ అన్నారు. ‘పెరిగిన ఇంధన ధరలు భారతీయ పౌరులను బాధిస్తాయని, ముఖ్యంగా మధ్య తరగతి ప్రజలను బాధిస్తాయని నేనంగీకరిస్తాను’ అని ధరేంద్రప్రధాన్ అన్నారు. ‘పెట్రోల్‌ను ఎగుమతి చేసే ఒపెక్ దేశాలు ఉత్పత్తిని తగ్గించడం, అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరలు పెరగడం ఇందుకు మూలం’ అని ఆయన చెప్పారు.

Comments

comments