Search
Wednesday 14 November 2018
  • :
  • :

త్వరలో జిఎస్ టిలో పెట్రో ఉత్పత్తులు

Petroleum Products under GST

దశలవారీగా అమలు చేస్తాం                                                                                                                                       ఆర్థిక కార్యదర్శి హస్ముఖ్ అధియా వెల్లడి

న్యూఢిల్లీ: జిఎస్‌టి(వస్తు, సేవల పన్ను) కింద పెట్రోలి యం ఉత్పత్తులను తీసుకొచ్చే విషయాన్ని జిఎస్‌టి మండలి పరిశీలిస్తోందని, దీనిని దశలవారీగా అమలు చేస్తామని కేంద్ర ఆర్థిక కార్యదర్శి హస్ముఖ్ అధియా పేర్కొన్నారు. ప్రస్తుతం డీజిల్, పెట్రోల్, క్రూడ్ ఆయిల్, నాచురల్ గ్యాస్, విమాన ఇంధన వంటి ఉత్పత్తులు జిఎస్‌టి పరిధిలో లేవు, ఈ ఉత్పత్తులపై రాష్ట్రాలు వ్యాట్(వాల్యూ యాడెడ్ టాక్స్)ను విధించే హక్కును కల్గి ఉన్నాయి. దీంతో వీటి ధరలు ఎక్కువగా ఉండడం, ప్రజలపై అధికంగా పన్ను భారం ఉంటోంది. ఇదే అంశంపై కేంద్ర పరోక్ష పన్నులు, కస్టమ్స్ బోర్డ్ చైర్మన్ ఎస్ రమేష్ మాట్లాడుతూ, జిఎస్‌టి పరిధిలోకి పెట్రోలియం ఉత్పత్తులను తీసుకురావాలనే డిమాండ్ ఉందని, దీనిపై తుది విధివిధానాలను జిఎస్‌టి మండలి ఖరారు చేయనుందని అన్నారు. ‘మా ముందు ఉన్న డిమాండ్లలో ఇది(జిఎస్‌టి పరిధిలోకి పెట్రో ఉత్పత్తులు) ఒకటి, మేము దీనిని పరిశీలిస్తున్నాం. దశల వారీగా పనులు చేపడతాం’ అని అధియా అన్నారు. విమాన ఇంధనంపై అత్యధిక పన్నుల పట్ల కేంద్ర పౌర విమానయాన మంత్రిత్వశాఖ మరోసారి ఆందోళన వ్యక్తం చేసింది. దీని వల్ల విమాన ఆపరేషనల్ వ్యయాలు పెరిగే అవకాశముందని, ఇది విమాన చార్జీల పెరుగుదలకు దారితీసే అవకాశముందని పేర్కొంది. దీనికి గాను జిఎస్‌టి పరిధిలోకి జెట్ ఇంధనాన్ని చేర్చాలని కోరుతూ పౌర విమానయాన మంత్రిత్వశాఖ కూడా కేంద్ర ఆర్థిక మంత్రిత్వశాఖకు లేఖ రాసింది. దీనిపై ఆర్థిక మంత్రిత్వశాఖ సానుకూలంగా స్పందించింది. త్వరలో జిఎస్‌టి కిందకు గ్యాస్, జెట్ ఇంధనాన్ని తీసుకువచ్చే ఉద్దేశముందని పేర్కొంది. జిఎస్‌టి ప్రస్తుతం నాలుగు శ్లాబ్‌లు.. 5 శాతం, 12 శాతం, 18 శాతం, 28 శాతం కలిగి ఉంది. నవంబర్‌లో జిఎస్‌టి మండలి సమావేశమై.. 178 వస్తువులను 28 శాతం శ్లాబ్ నుంచి 18 శాతం శ్లాబ్‌కు మార్పు చేసింది.

Comments

comments