Home దునియా ఫణిగిరి లక్ష్మీనరసింహ

ఫణిగిరి లక్ష్మీనరసింహ

phanigiri lakshmi narasimhaహైదరాబాదు నగరానికి 1600 ఏళ్ళ చరిత్రవుంది. సాక్షం ఏంటని అంటారా… పురాతన ఆలయాలకన్నా వేరే ఆధారాలేముంటాయి చెప్పండి!? అందుకే అప్పటివారు ఆలయాలలో శాసనాలు రాయించేవారు. సాధారణంగా రాజులు అనేక సందర్భాలలో దేవాలయ దర్శనం చేసుకుని, ఆ దేవాలయాభివృధ్ధికి కానుకలిచ్చి వాటి గురించి ఆ దేవాలయంలోనే రాళ్ళమీద శాసనాలు చెక్కించేవారు. సరిగ్గా అలాంటి శాసనమే మన హైదరాబాదుకి 1600 సంవత్సరాల చరిత్ర వున్నదనటానికి ఆధారభూతమయింది.
ఈ శాసనం చైతన్యపురిలో మూసీనది కుడి ఒడ్డునవున్న కొసగుండ్ల నరసింహస్వామి ఆలయంలో బండ గోడపై వున్నది. దానిని క్రీ.శ. 1983 -84లో పురావస్తుశాఖవారు కాపీ చేసి పరిష్కరించారు. ఇక్కడే 50 అడుగుల ఎత్తున ఇంకో శాసనం కూడా వున్నది. ఆ శాసనం హైదరాబాదు చరిత్రకి సంబంధించిన మొదటి చారిత్రిక ఆధారం.

దేవాలయం విశేషాలు: అతి ప్రాచీనమైన ఈ కొండ ప్రదేశం కాలగమనంలో మనుషులు కాలు పెట్టటానికి కూడా వీలుకాని స్ధలంగా మారింది. అలాంటి ఈ ఆలయాన్ని భక్తుల దర్శనార్ధం పునరుధ్ధరించినవారు శ్రీ శేషాచార్యగారు. ఆయనకి ఒక రోజు స్వప్నంలో నాగుపాము కనబడి తనకి దోవ చూపిస్తూ ఈ గుళ్ళోకి ప్రవేశించినట్లు గమనించారు. ఇది క్రీ.శ. 1951 లో జరిగిన సంఘటన. మర్నాడు ఆయన నాగుపాము చూపించిన ప్రదేశంలో ఆ స్వామి వుండి వుండవచ్చని, కొబ్బరికాయ తీసుకుని ఆ దోవలో వెతుక్కుంటూ వెళ్ళారు, దుర్గమమైన ఆ మార్గంలో కష్టపడి వెతికి, పెద్ద బండరాయి కింద వున్న స్వామి స్పష్టాస్పష్టమైన రూపాన్ని చూశారు. అప్పటినుంచీ ఆయన స్వామికి ధూప, దీప నైవేద్యాలు సమర్పించసాగారు.

ఆలయ నిర్మాణం: ఇది ఒక పెద్ద బండరాతి కింద వున్న గుహలో సహజంగా ఏర్పడిన ఆలయం. గర్భగుడి సహజసిద్ధంగా వున్నదే. ఈ పెద్ద బండ రాతి కింద వున్న ఒక గోడమీద శ్రీ నరసింహస్వామి, లక్ష్మీ దర్శనమిస్తారు. స్వామి శంఖం, చక్రం, తలపైన శేషుడి పడగతో దర్శనమిస్తారు. పక్కనే వున్న ఇంకొక రాతి గోడమీద 5 తలల ఫణీంద్రుడు దర్శనమిస్తాడు. పక్కనే వున్న సన్నటి గుహలో శ్రీ వెకటేశ్వరస్వామి, శ్రీ మహలక్ష్ముల పెద్ద ఫోటోలున్నాయి. వాటి వెనుక గోడమీద వారి ఆకారాలున్నాయట. అవి స్పష్టంగా లేకపోవటంతో అక్కడ ఫోటోలు పెట్టామన్నారు. ఈ బండరాళ్ళ పక్కగా పారుతున్న మూసీ నది మధ్యలో చిన్న శివాలయం వున్నది.

తూర్పు ముఖంగా కొలువైన శివుడు త్రిశూలం, ఢమరుకం చేతిలో పట్టుకున్న విగ్రహం వున్నది. కొండ దిగువనే ఆంజనేయస్వామికి చిన్న ఆలయం ఉన్నది. ఈ స్వామి ఉత్తరం ముఖంగా ప్రతిష్టింపబడ్డాడు. ఈయనని సేవిస్తే సకల సంపదలనిస్తాడని విశ్వాసం. స్వామి వెలసిన గుహ పైన బండరాయి పొడుగ్గా కొసదేరినట్లుంటుంది. ఇక్కడ చాలా
బండరాళ్ళు ఒక దానిమీద ఒకటి పేర్చినట్లు కొసదేరి వుంటాయి. అందుకే ఈ ప్రదేశానికి కొసగుండ్ల అనే పేరు. అలాగే ఆలయంలో నాగేంద్రుడు నరసింహ స్వామి తలమీద, విడిగా పక్కన కూడా దర్శనమిస్తాడు. అందుకని ఫణిగిరి అనే పేరు. ఈ ఆలయం యాదగగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామివారి ఆలయం అధీనంలో వున్నది.

 ఎలా వెళ్ళాలి

దిల్‌సుఖ్‌నగర్ దాటిన తర్వాత వచ్చే బస్ స్టాప్ చైతన్యపురి.. అక్కడ ఎడమవైపు రోడ్డులో లోపలకి ఒక కిలోమీటరు వెళ్ళాక మళ్ళీ ఎడమవైపు వెళ్ళాలి. అక్కడ ఎవరినడిగినా చెబుతారు.

phanigiri lakshmi narasimha history

 -పి.యస్.యమ్. లక్ష్మి