Home లైఫ్ స్టైల్ కాటేసే ఫార్మా కాలుష్యం

కాటేసే ఫార్మా కాలుష్యం

హైదరాబాద్ మహానగరాన్ని ఆనుకొని శ్రీశైలం హైవేలోని ముచ్చర్ల కేంద్రంగా భారీ ఫార్మా (ఔషధాల తయారీ) పారిశ్రామిక నగరాన్ని ఆవిష్కరించడానికి రాష్ట్ర ప్రభుత్వం శరవేగంతో ఏర్పాట్లు చేస్తున్నది. ఈ ఫారా సిటీ వల్ల ఆ ప్రాంతంలో అన్ని రకాల కాలుష్యం మహాభూత ప్రమాణంలో పెరిగి పర్యావరణాన్ని, ప్రజలు, ఇతర జీవజాలం ఆరోగ్యాన్ని దారుణంగా బలి తీసుకుంటుందనే భయాలు వ్యాపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో 30 ఏళ్లుగా పర్యావరణ పరిరక్షణ, కాలుష్య వ్యతిరేక ఉద్యమాలకు, యుద్ధాలకు సారథ్యం వహిస్తున్న ప్రఖ్యాత శాస్త్రజ్ఞులు ప్రొఫెసర్ కె.పురుషోత్తమ రెడ్డి ‘మన తెలంగాణ’ కోసం ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వూలో తన అభిప్రాయాలను సీనియర్ జర్నలిస్టు కోడం పవన్ కుమార్‌తో పంచుకున్నారు.

  • ముచ్చర్ల ఔషధ నగరం ముంచుతుందా, పెంచుతుందా?

Pollution-Pharma-City

ఉపాధి అవకాశాలు పెరుగుతాయని సంబరపడాలో, ఊపిరి అందకుండా ప్రకృతి విధ్వంసం జరుగుతుందని బాధపడాలో తెలియని రీతిలో నేటి ప్రభుత్వాల పారిశ్రామిక విధానాలు ఉంటున్నా యి. పర్యావరణ పరిరక్షణ అంటే ప్రకృతి సౌందర్యాన్ని కాపాడ టం కాదు. పర్యావరణానికి, మానవ జీవితానికి తల్లీ బిడ్డల సంబం ధం ఉంది. పర్యావరణ పరిరక్షణతో నిమిత్తంలేని అభివృద్ధి వినాశ నానికి దారితీస్తుంది. సహజ జీవావరణాన్ని మనిషి జోక్యంతో భంగపరచనంత కాలం ఏ అనర్థం జరగదు. ఆధునిక ప్రభుత్వా లు, పారిశ్రామిక కేంద్రాలు పర్యావరణాన్ని ప్రత్యక్షంగా పరోక్షం గా ధ్వంసం చేస్తున్నాయి. అభివృద్ధి తాత్కాలిక ప్రయోజనంగా చూపించి, పర్యావరణ దుష్పరిమాణాలకు దారులు పరిచే పాల కుల విధానాలతో గతులు తప్పుతున్న కాలాలలో జీవనం సాగిస్తు న్నాము. నీళ్లు, నిధులు, నియామకాలే కాదు… స్వచ్చమైన గాలి, నీరు, నేల అందే కాలుష్యరహిత జీవన విధానం అందించే బాధ్యత తెలంగాణ పాలకుల మీద ఉంది. సరూర్‌నగర్, నాచారం, పటాన్ చెరువు పర్యావరణ ఉద్యమాలను దృష్టిలో పెట్టుకోకుండా సుప్రీం కోర్టు ఆదేశాలను పరిగణనలోకి తీసుకోకుండా ఏర్పాటు చేసే పారిశ్రామిక ప్రాంతాలన్నీ భారీ మూల్యం చెల్లించక తప్పదు. రాష్ట్రంలో టిఆర్‌ఎస్ ప్రభుత్వం తలపెట్టిన ‘ఫార్మా సిటీ’ ఇందుకు మినహాయింపు కాదు. పారిశ్రామికీకరణ ఎంత అవసరమో కాలు ష్య రహిత వాతావరణాన్ని కాపాడి పెంపొందించవలసిన బాధ్యత అంతకంటె నూరు రెట్లు ఉంది. ఉమ్మడి రాష్ర్టంలో నిరాటంకంగా సాగిన ప్రకృతి విధ్వంసం ఎన్నో అనర్థాలను దాపురింప చేసింది. దాని నుంచి తెలంగాణ రాష్ర్టం గుణపాఠాలు నేర్చుకున్నప్పుడే నాటిన లక్షల మొక్కలు తల ఎత్తుకు నిలబడతాయి.
“ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌” అని చెబుతున్న తెలంగాణ ప్రభుత్వం పరిశ్రమలు నెలకొల్పడానికి మూడు వారాల్లో అనుమ తులు మంజూరు చేస్తామని చెప్పడంలోనే ప్రకృతి విధ్వంసం ఏమే రకు ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. ఈ చిన్న కాల పరిమితిలో జీవన మూల్యాన్ని, సామాజిక విలువలను, ఆర్థిక ప్రగతిని ఏ నిష్పత్తిలో సుస్థిరపరచి అభివృద్ధికి పాటుపడుతుందో స్పష్టం చేయ వలసిన గురుతర బాధ్యత కూడా ప్రభుత్వంపై ఉంది. ‘ఫార్మా సిటీ’ పేరుతో ఊహాచిత్రాలను విడుదల చేయడంతో పర్యావరణం ఒక్క సా రిగా ఉలిక్కిపడింది. ముచ్చర్ల ప్రాంతమంతా అటవీ, పేదల కిచ్చిన అసైన్డ్ భూములతో కూడుకుంది. ఇక్కడి నుంచి నల్లమల అడవులకు దారి ఉంది. అందువల్ల ఫార్మాసిటీతో వన్యప్రాణులకు, జీవవైవిధ్యానికి, గిరిజన ప్రజలకు కాలుష్యం ముప్పు పెద్ద ఎత్తున ఏర్పడుతుంది. ఇబ్రహీంపట్నం చెరువుకు కూడా తీవ్రమైన హాని కలుగుతుంది. ఇప్పటికే ఫిరంగి నాలా అక్రమణలకు గురి కావడంతో ఈ చెరువుకు నీరు రావడం లేదు. నలభై వేల ఎకరాల సాగుకు నీరందించే ఈ చెరువు ఫార్మాసిటీతో పూర్తిగా ఎండిపోయే ప్రమాదముంది. అప్పటి పటాన్‌చెరువు తరహాలో ఉద్యమం మొదలు కాక తప్పని పరిస్థితి తల ఎత్తుతుంది. పటాన్‌చెరువు కాలుష్య ఉద్యమం కంటె ముందు సరూర్‌నగర్, నాచారం ప్రాంతాలలో ప్రజలు పెద్ద ఎత్తున నిరసన ఆందోళనలు నిర్వహించారు. 1984 డిసెంబర్‌లో భోపాల్‌లో యూనియన్ కార్భైడ్ గ్యాస్ లీక్‌తో దేశ ప్రజలు అప్రమత్తమయ్యారు. 1985 మార్చిలో ‘సిరీస్ కెమికల్ ఫ్యాక్టరీ’ కాలుష్యంతో సరూర్‌నగర్ ప్రాంత ప్రజలు హైదరాబాద్ నగరాన్ని మేల్కొలిపారు. వ్యర్థ పదార్థాలను ఆరు బయట నిల్వ ఉంచడంతో ప్రమాదకరమైన విషపదార్థాలు భూమి లోకి ఇంకి, ఉపరితలంలో రెండు కిలోమీటర్ల దూరం కాలుష్యం వ్యాపించింది. కంపెనీ యాజమాన్యంతో భేటీ అయిన ఉస్మానియా విశ్వవిద్యాలయం సైన్స్ విభాగం విద్యార్థులు ఒకేరోజున 50 వేల గాలన్ల వ్యర్థజలం సూర్యరశ్మి వల్ల ఎలా అవిరవుతుందని ప్రశ్నిం చింది. రసాయనిక వ్యర్థ జలాలను రాత్రిపూట పంపుల ద్వారా బయటికి పంపడం, ట్యాంకులలో నింపి రోడ్ల మీద వదలడంతో ఆ ప్రాంతమంతా కాలుష్యంతో నిండిపోయింది. దీంతో స్థానిక ప్రజ లు సంఘంగా ఏర్పడి న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. న్యాయ మూర్తి వెంటనే నిపుణల కమిటీని నియమించి నివేదికకు ఆదేశిం చారు. నిపుణుల సంఘం పరిశీలనకు ముందే కంపెనీ యాజమా న్యం ఏదో కారణంతో ఫార్మా పరిశ్రమను తాత్కాలికంగా మూసి వేసింది. ఆ తర్వాత 1986లో నాచారంలో కాలుష్య వ్యతిరేక ఉద్య మం మొదలయింది. ఇక్కడి పారిశ్రామిక ప్రాంతంలో వందలాది రసాయన, సారాయి తయారీ, ఎముకల పరిశ్రమలుండేవి. వీటి లో దక్కన్ ప్రైవేట్ లిమిటెడ్, లక్ష్మీస్టార్చ్ పరిశ్రమలు ప్రధానమైనవి. నాచారంలోని భూగర్భ జలాలు అత్యధికంగా నైట్రేట్ కలిగి కనీసా వసరాలకు పనికిరాకుండా పోయాయి. సరూర్‌నగర్ ఆందోళన లను స్ఫూర్తిగా తీసుకున్న నాచారం ప్రజలు ఏకమై, ఒక సంస్థగా ఏర్పడి కాలుష్యంపై యుద్ధానికి నడుం బిగించారు. దీని ఫలితంగా 1986 ఏప్రిల్ 14న ‘సిటిజెన్స్ ఎగైనెస్ట్ పొల్యూషన్’ సంస్థ ఏర్ప డింది. ఉమ్మడి రాష్ర్టంలోని చిన్న చిన్న కాలుష్య వ్యతిరేక సంస్థల న్నింటికీ ఈ సంస్థ అండగా నిలిచింది. మే 16న కాలుష్య నియం త్రణ బోర్డు ముందు నిర్వహించిన ధర్నా ఫలితంగా నాచారం నుం చి ఉప్పల్ వరకు పైపులైన్ ద్వారా కాలుష్య పదార్థాలను పంపి, అక్కడ ట్రీట్‌మెంట్ చేసి మూసీలో వదలాలని నిపుణుల కమిటీ సూచించడం, అప్పటికప్పుడే రాష్ర్ట ప్రభుత్వం అందుకోసం రూ.45 లక్షలు మంజారు చేయడం జరిగింది.
‘పరిశ్రమలకు వ్యతిరేకం కాదు, కాలుష్యానికి వ్యతిరేకం’ అనే నినాదంతో 1986 ఆగస్టులో పటాన్‌చెరువు కాలుష్యంపై ఉద్యమం ప్రారంభమైంది. పటాన్‌చెరువులోని 250 పరిశ్రమలకుగానూ 50 కర్మాగారాలు అత్యధికంగా వెదజల్లిన వ్యర్థ రసాయానలతో అక్కడి గాలి, నీరు, నేల పూర్తిగా కలుషితమయ్యాయి. వ్యర్థాలు కలిసి నక్క వాగు పూర్తిగా రసాయనాలతో నిండిపోయింది. ఈ వాగు చుట్టూ ఉన్న 14 గ్రామాల్లో తీవ్ర సంక్షోభం తల ఎత్తి అలజడికి దారి తీసింది. ఆ గ్రామ ప్రజలు నన్ను, డాక్టర్ కిషన్‌రావును కలిసి పరిస్థితిని వివరించారు. కాలుష్య నియంత్రణ బోర్డు ముందు నిరసన ఆందోళనలను నిర్వహించాము. ఛలో అసెంబ్లీ కార్యక్ర మాలు చేపట్టాము. కవాడిగూడలో గల కాలుష్య నియంత్రణ బోర్డు ముందు నిరసన కార్యక్రమం చేపట్టిన సమయంలో బోర్డు సమావేశం కూడా జరుగుతుండడం లాభించింది. బోర్డు చైర్మన్‌గా ఉన్న ఐఎఎస్ అధికారి నటరాజన్ మా డిమాండ్లకు సానుకూలం గా స్పందించారు. ఆ సమావేశంలో చర్చించారు. అలాగే ఆగస్టు 16, 1986న ఐదు వేల మందితో ‘ఛలో అసెంబ్లీ’ నిర్వహించి, అప్పటి ముఖ్యమంత్రి ఎన్టీరామారావును కలిశాము. ఆయనతో నాకున్న అనుబంధం కూడా కలిసివచ్చింది. ఆయన కాలుష్య సమస్యలను పూర్తిగా అవగతం చేసుకుని వెంటనే 22 కాలుష్య కారక పరిశ్రమల మూసివేతకు 133 సిఆర్‌పిసి ప్రకారం ఉత్తర్వు లు జారీ చేశారు. కోర్టు నోటీసులు అందుకున్న పరిశ్రమల యజ మానులు ఈ ఉత్తర్వులను సవాలు చేశారు. నీటి (1974), గాలి (1981) తదితర చట్టాలను పురస్కరించుకుని ప్రత్యేకంగా ఏర్పడ్డ బోర్డులు ఉండగా, 133 సిఆర్‌పిసి ప్రకారం డివిజన్ మేజిస్ట్రేట్ తమపై అధికారం చలాయించే ఆస్కారం లేదని హైకోర్టు ముందు యజమానులు వాదనలు వినిపించారు.వారిని తప్పుబడుతూ కాలుష్య నివారణకు చర్యలు చేపట్టాల్సిందేనని 1987లో హైకోర్టు స్పష్టం చేసింది. దీంతో ఆయా పరిశ్రమలు కామన్ ట్రీట్‌మెంట్ ప్లాంట్ ఏర్పాటు చేసుకునే చర్యలు చేపట్టాయి. 1997 నుంచి ఇప్పటివరకు సుమారు 30 వరకు వచ్చిన సుప్రీంకోర్టు ఆదేశాలన్నీ చరిత్రాత్మకమైనవే. తెలంగాణ రాష్ర్ట ప్రభుత్వం వీటన్నింటినీ పరిగణలోకి తీసుకుని ‘ఫార్మసిటీ’కి రూపకల్పన చేసినప్పుడే ప్రజల ఆదరణ పొందగలుగుతుంది.
కాలుష్య నియంత్రణ బోర్డు ఏర్పడకముందే ఐడిపిఎల్ పరిశ్ర మ స్థాపించబడింది. బల్క్ డ్రగ్స్ తక్కువ ధరకు అందించడం దాని ప్రధాన లక్ష్యం. పరిశోధన, హెల్ప్ యూనిట్ తదితరమైనవి 990 ఎకరాలలో ఏర్పాటు చేశారు. కానీ, ఈ పరిశ్రమను నెలకొల్పిన ప్రాంతమే అభ్యంతరకరమైనది. కాలుష్య కారక పరిశ్రమలపై ఉద్యమం ప్రారంభానికి ముందే ఐడిపిఎల్ సిక్‌గా మారింది. కొత్తగా ఫార్మా కర్మాగారాలను నెలకొల్పే ప్రతి పారిశ్రామికవేత్త ఐడిపిఎల్ పూర్వాపరాలను పరిగణలోకి తీసుకోవాలి. ఏ మందుల తయారీ పరిశ్రమనైనా ప్రారంభించే ముందు తాము తయారుచే యబోతున్న మందుల వివరాలను ప్రభుత్వానికి తెలియజేయాలి. ఈ జాబితాలు తర్వాత కాలంలో మారిపోతున్నాయి. ఎందుకంటే ప్రారంభంలో ఆ జాబితా ప్రకారం తాము తయారుచేసే మందుల కు మార్కెట్లో గిరాకీ లేకపోవడంతో కొత్త ఉత్పత్తులను ఎంచుకుం టున్నారు. ఇందులో వాడే ముడి పదార్ధాల రసాయనాలు భిన్నం గా ఉంటాయి. పాత ఉత్పత్తుల వివరాల మీదనే కొత్త ఉత్పత్తులను కొనసాగిస్తున్నారు. కొత్తవాటికి సంబంధించిన వివరాలు కాలుష్య నియంత్రణ బోర్డుకుగానీ, ప్రభుత్వానికిగానీ తెలియజేడయం లేదు. ఈ విధంగా ప్రభుత్వం కళ్లకు గంతలు కట్టి కాలుష్యాన్ని యధేచ్చగా విడుదల చేస్తున్నారు. దీనిపై నిఘా అవసరం. ప్రజలు పరిపూర్ణమైన పర్యావరణ వాతావరణంలో జీవించే హక్కు కలిగి వుండేలా ప్రభుత్వాలు గట్టి చర్యలు తీసుకోగలిగినప్పుడే ఎలాంటి పరిశ్రమలు నెలకొల్పినా ఇబ్బంది ఉండదు. ఇదే విషయాన్ని ఇటీవల ఐక్యరాజ్య సమితి తన ఎజెండాలో స్పష్టం చేసింది. వేగవంతమైన నూతన ఆవిష్కరణతో కూడిన మౌలిక వసతుల కల్పన, సమ్మిళిత సుస్థిర పారిశ్రామికీకరణకు దోహదపడుతుందని ఆ ఎజెండా పేర్కొంది. దీన్ని గమనంలోకి తీసుకోవాలి.