Home ఎడిటోరియల్ ఫార్మా డి విద్యార్థుల ఆందోళన

ఫార్మా డి విద్యార్థుల ఆందోళన

edit

వరంగల్ లో 2018 జనవరి 27 న ప్రారంభమైన డాక్టర్ ఆఫ్ ఫార్మసీ (ఫార్మా డి) పట్టభద్రులు, విద్యార్థుల సాదాసీదా ప్రదర్శన క్రమంగా ఉద్యమ రూపం తాల్చి స్పష్టమైన ఆశ్వాసన లభించే దాక కొనసాగింది. ప్రభుత్వ పక్షాన హనుమకొండ ఎంఎల్‌ఎ దాస్యం వినయ భాస్కర్ ఇచ్చిన హామీతో 2018 మార్చ్ 9 నాడు ఆందోళన విరమించుకొన్నరు. ఈ నడుమ వారు ఎక్కని కడప లేదు; కలువని అధికారి లేడు. స్పందించిన చాలా మంది సామాజిక కార్యకర్తలు, రాజకీయ నాయకులు ఉద్యమ వేదికను సందర్శించి సంఘీభావం ప్రకటించిండ్రు. ఇప్పుడు వీధి కెక్కినది ఫార్మా డి విద్యార్థులు మాత్రమే అయినా; మిగతా ఫార్మసీ పట్టభద్రులు, విద్యార్థుల మానసిక స్థితి కూడా అచ్చం ఇదే విధంగా ఉన్నది. ఒక నాడు తెలంగాణ ప్రాదేశిక పరిధిలో నాలుగు డి ప్లొమా ఇన్ ఫార్మసీ (డి ఫార్మ్) కళాశాలలు, ఒక్కొక్క బ్యాచిలర్ ఆఫ్ ఫార్మసీ (బి ఫార్మ్)/ మాస్టర్ ఆఫ్ ఫార్మసీ (ఎం ఫార్మ్) కళాశాల మాత్రమే ఉండగా, రెండు దశాబ్దాలుగా వాటి సంఖ్య ఊహాతీతంగ పెరిగి పోయింది. ఫార్మసీ మానవ వనరుల లభ్యతలో మనం అగ్ర భాగాన ఉన్నం. రాష్ట్రంలో 26 డి ఫార్మ్, 141 బి ఫార్మ్, 106 ఎం ఫార్మ్, 59 ఫార్మా డి కళాశాలలకు ఫార్మసీ కౌన్సిల్ ఆఫ్ ఇం డియా అనుమతి ఉన్నది. అనుబంధ ఫార్మసీ కళాశాలలు ఉన్న దాదాపు అన్ని విశ్వవిద్యాలయాలలో డాక్టర్ ఆఫ్ ఫిలాసఫి (పిహెచ్ డి) పరిశోధనలు జరుగుతున్నాయి. ఫార్మసీ విద్యతో పాటు, ఫార్మసీ పరిశ్రమకు కూడా భారతదేశంలో మన రాష్ట్రం అగ్రభాగాన నిలిచింది. హెల్త్ ప్రొఫెషన్స్ (ఆరోగ్య వృత్తులు) లో ఫార్మసీ (భేషజి) కీలకమైనది. ఇది మెడిసిన్ (వైద్య శాస్త్రం)లో అంతర్భాగం. ఔషధ ఉత్పత్తి నుంచి వినియోగం వరకు అన్ని దశలు ఫార్మసిస్ట్ పరిధిలోని అంశాలు. చట్ట నియంత్రణలో సాగే వృత్తి ఫార్మసి! ఔషధం ఎక్కడ ఉంటె రిజిస్టర్డ్ ఫార్మసిస్ట్ అక్కడ ఉండవలసిందే! అంతర్జాతీయంగ ‘ఫార్మస్యూటికల్ కేర్’ భావన పటిష్టంగ అమలు జరుగుతున్నది. ఫిసిషియన్‌లు వ్యాధి నిర్ధారణ చేస్తే, ఫార్మసిస్ట్ లు ఔషధ ఎంపిక చేస్తరు. స్వాతంత్య్రానికి కొంత పూర్వమే ఫార్మసీ వృత్తి, విద్య ఒక రూపాన్ని సంతరించుకొన్నయి. రాంనాథ్ చోప్డా నేతృత్వంలోని డ్రగ్స్ ఎంక్వైరీ కమిటీ (1931) ఔషధ వితరణ ఫార్మసిస్ట్‌ల ద్వారా జరగాలని, ఫార్మసీ విద్య డిప్లొమా బాచెలర్ స్థాయిలో ఉండాలని, ఫార్మసీ కౌన్సిల్ ఏర్పాటు చేయాలని సూచించింది. మొదటి ఫార్మసిస్ట్ నియామకం 1941లో ముంబయి కింగ్ ఎడ్వర్డ్ మెమోరియల్ హాస్పిటల్ లో జరిగింది. అప్పటికి అంతటా కాంపౌండర్ లు ఔషధ వితరణ చేసే వారు. ఫార్మసీ చట్టం స్వాతంత్య్రానంతరం 1948లో వచ్చింది. ఫార్మసీ చట్టం సెక్షన్ 42 రిజిస్టర్డ్ ఫార్మసిస్ట్‌లు మాత్రమే ఫార్మసీ వృత్తి నిర్వహించాలని నిర్దేశిస్తున్నది. ఫార్మసీ పట్టభద్రులు పరిశ్రమ, డ్రగ్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ వైపు మొగ్గు చూపి, హాస్పిటల్, కమ్యూనిటి ఫార్మసీ లలో చేయుటకు సుముఖత కనపరచనందువలన, ఫార్మసీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (పిసిఐ) అప్పటి దాకా ఉన్న కాంపౌండర్ లను, ఔషధ శాలల నిర్వాహకులను ఫార్మసీ కౌన్సిల్ లో అనుభవం ప్రాతిపదికన రిజిస్ట్రేషన్ పొందుటకు అనుమతి ఇచ్చి ఫార్మసిస్ట్ హోదా కట్ట బెట్టింది. చట్టం వచ్చినా హాస్పిటల్ లలో 70, కమ్యూనిటీలో 80వ దశాబ్ది వరకు పాత ధోరణి కొనసాగింది. అప్పుడు చివరి దశలో ఉద్యోగాలలో చేరిన వారు నిన్న మొన్నటి దాక పదవిలో ఉండగా, కొందరు కమ్యూనిటీ ఫార్మసిస్ట్ లుగ ఇంకా వృత్తిలో కొనసాగుతున్నరు. పిసిఐ 1953లో డి ఫార్మ్ ను కనీస అర్హతగ నిర్ణయించి ఎడ్యుకేషన్ రెగ్యులేషన్స్ ప్రకటించింది. ఎంసిఐ మాత్రం ఇండియన్ మెడికల్ కౌన్సిల్ చట్టం 1956 సవరణ చేయించుకొని మెడిసిన్ లో డిప్లొమా, లైసెన్సియేట్ కోర్స్ లన్నిటిని రద్దు పరచి, బాచెలర్ ఆఫ్ మెడిసిన్ అండ్ బాచెలర్ ఆఫ్ సర్జరి (ఎంబి బిఎస్) డిగ్రీ ని కనీస అర్హతగా ప్రకటించింది. ఫార్మసీ కౌన్సిల్‌లో రిజిస్ట్రేషన్ పొందాలంటే డిప్లొమా కనీస అర్హత. డి ఫార్మ్, బి ఫార్మ్‌లతో పాటు; 2008 సవరణ ప్రకారం ఫార్మా డి చేరింది. ఫార్మసిస్ట్ లకు ఎక్సిట్ ఎక్సామ్ పెట్టే తీర్మానాన్ని పిసిఐ తాజాగా ప్రభుత్వానికి పంపింది. నేడు ఫార్మసిస్ట్‌లు తమ రంగాల పరంగా హాస్పిటల్, క్లినికల్, కమ్యూనిటీ, పబ్లిక్ హెల్త్ ఫార్మసిస్ట్‌లుగా రాణిస్తున్నారు. మెడికల్ సూపర్ స్పెషాలిస్ట్‌లవలె భవిష్యత్తులో ఫార్మసీ సూపర్ స్పెషాలిస్ట్‌లను కూడా చూడ నున్నము. అయినప్పటికీ, వ్యవస్థలో ఫార్మసీ వెనుకబాటుతనం ఇంకా కొనసాగుతున్నది. ప్రభుత్వ శాఖలు ఫార్మసీ ఉన్నత అర్హతలను తమ నియామక నిబంధనలలో చేర్చుకొన లేదు. సెక్షన్ 10 ప్రకారం ఫార్మసీ విద్య నియంత్రణ అధికారం పిసిఐ ది. కాగా, 1986లో ఏర్పడిన ఆల్ ఇండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్ (ఏఐసిటిఇ) కి ఫార్మసీ కళాశాలల అనుమతి భాగస్వామ్యం లభించింది. ఈ ద్వంద యాజమాన్యం కూడా ఫార్మసీ కౌన్సిల్ ఆత్మాభిమానానికి కొంత విఘాతం కలిగించింది. భాటియా, హాతి, బజాజ్, లెంటిన్, వైద్యనాథన్ కమిటీలు హాస్పిటల్ ఫార్మసీ విభాగాల మెరుగుదలకు పలు సూచనలు చేసినయి. దార్శనికుడు డాక్టర్ బి డి మిగ్లాని 1963లో ‘ఇండియన్ హాస్పిటల్ ఫార్మసిస్ట్స్ అసోసియేషన్’ (ఐహెచ్ పిఏ) ఏర్పాటు చేసిండు. దరిమిలా ఇండియన్ ఫార్మస్యూటికల్ అసోసియేషన్ (ఐపిఏ) హాస్పిటల్ ఫార్మసీ డివిషన్ ఏర్పాటు చేసింది. మిగ్లాని చొరవతో ఎం ఫార్మ్ హాస్పిటల్ ఫార్మసీ కోర్స్ ప్రారంభ మైంది. అజిత్ ప్రసాద్ జైన్ అధ్యక్షతన ఏర్పాటు చేసిన ‘స్టడి గ్రూప్ ఆన్ హాస్పిటల్స్’ చిన్న హాస్పిటల్ కు కూడా కనీసం ముగ్గురు ఫార్మసిస్ట్‌లు ఉండాలని 1966లోనే సిఫార్స్ చేసింది. ఆరోగ్య సంరక్షణ బృందానికి ఔషధాలు అత్యంత ఆవశ్యకాలు. కనుక, ఆరోగ్య బృందంలో ఫార్మసిస్ట్ తప్పనిసరి అని ప్రపంచ ఆరోగ్య సంస్థ కన్సల్టేటివ్ గ్రూప్ 1988లో స్పష్టం చేసింది.
జాతీయ మానవ హక్కుల కమిషన్ అన్ని వైద్యశాలలలో ఉన్నత విద్యార్హతలున్న ఫార్మసిస్ట్‌లతో హాస్పిటల్ ఫార్మసీ విభాగాలు ఏర్పరచాలని 1999లో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు నిర్దేశాలు జారీ చేసింది. నేషనల్ నాలెడ్జ్ కమిషన్ (2005) ఉపాంగమైన ‘వర్కింగ్ గ్రూప్ ఆన్ మెడికల్ ఎడ్యుకేషన్’ స్నేహ భార్గవ అధ్యక్షతన తన నివేదికలో ఫార్మసీ విద్యను విస్తృతంగ అందించి అన్ని హాస్పిటల్స్‌లో ఫార్మసిస్ట్ ల విజ్ఞానాన్ని పూర్తి స్థాయిలో వినియోగించుకోవాలని పేర్కొన్నది. విదేశీ మెడికల్ టూరిస్ట్‌లను ఆకర్షించటానికి నిబంధనల ననుసరించి కొన్ని కార్పొరేట్ హాస్పిటల్స్, గత కొంత కాలంగా, ఉన్నత విద్యార్హతలు ఉన్న ఫార్మసిస్ట్‌లను నియమించు కొంటున్నయి. కాని, అభివృద్ధి చెందిన దేశాలలోవలె హాస్పిటల్ ఫార్మసీ విభాగాలు అనేది మన దేశంలో ఒక మృగతృష్ణ అయిపోయింది.బ్రిటిష్ నమూనా బి ఫార్మ్/ ఎం ఫార్మ్‌లు పటిష్టంగానే ఉన్నప్పటికీ, అందరు ఆదర్శంగా భావిస్తున్న ఉత్తర అమెరికా వైద్యవిద్య వ్యవస్థలోని ఫార్మ్ డి ప్రోగ్రాంను దేశంలో 2008లో పరిచయం చేశారు. హాస్పిటల్ సేవలకు తగిన రీతిలో దీని రూపకల్పన జరిగింది. ఇది ఎం ఫార్మ్‌కు సమానం. దీని నిడివి 6 సంవత్సరాలు, చివరి 1 సంవత్సరం అభ్యాస శిక్షణ కలుపుకొని. ఫార్మ్ డి పైన పిహెచ్ డి సూపర్ స్పెషాలిటీ టాట్ కోర్స్‌లు ప్రవేశ పెట్టాలని యోచిస్తున్నది. డిప్లొమా (డి ఫార్మ్) అర్హతతో ఉద్యోగాలలో ఉన్న వారి విజ్ఞానాన్ని, నైపుణ్యాన్ని పెంచటానికి 2014లో బి ఫార్మ్ ప్రాక్టిస్ అనే బ్రిడ్జ్ కోర్స్‌ను రూపొందించింది. ఫార్మసీ ప్రాక్టిస్ రెగ్యులేషన్స్ (పిపిఆర్) 2015 ప్రకటించింది.మెడికల్ కౌన్సిల్, ఫార్మసీ కౌన్సిల్ రెండూ చట్టబద్దమైన సమానస్థాయి సంస్థలే! కాని మెడికల్ కౌన్సిల్‌కు ఉన్న సీనియారిటీ, వైద్య శాఖలో మెడికల్ ప్రాక్టీషనర్ ల నిర్ణయాధికార స్థానం, వృత్తి సంఘమైన ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (ఐఎంఎ) క్రియాశీలత్వం మెడికల్ కమ్యూనిటీ ఏకస్వామ్యాన్ని పటిష్ట పరచినయి. ఫార్మసీ కౌన్సిల్ లో మెడికల్ కౌన్సిల్, మెడికల్ డిపార్ట్‌మెంట్ అధికారులకు ప్రాతినిధ్యం ఉండగా; మెడికల్ కౌన్సిల్ లో ఫార్మసీ కౌన్సిల్, డ్రగ్ కంట్రోల్ అధికారులకు స్థానం లేదు. ఈ లోపం పూడ్చటానికి చట్టానికి సవరణ అవసరం ఉన్నది. ఫార్మసీ రంగంలో ఎన్ని ఆవిష్కరణలు జరిగినా, ఫార్మసిస్ట్‌లు ఉన్నత విద్యావంతులు అయినా ఫార్మసిస్ట్‌లను వృత్తి నిపుణులుగా కాక సహాయకులుగానే మెడికల్ ప్రాక్టీషనర్ లు భావిస్తున్నరు. ఫార్మసిస్ట్‌ల విజ్ఞానాన్ని, ఫార్మసీ కౌన్సిల్ నిర్ణయాలను, ఫార్మసీ చట్టాలను కూడా మెడికల్ కౌన్సిల్ తేలికగా తీసికొంటున్న ఉదంతాలే ఎక్కువ. మెడికల్ కౌన్సిల్ తనిఖీలలో వైద్య కళాశాలలకు అనుబంధంగ ఉన్న బోధనా వైద్యశాలలలో హాస్పిటల్ ఫార్మసీ విభాగాలను నెలకొల్పకున్నా పట్టించుకోదు. ఫార్మసీ అండ్ తెరప్యూటిక్ కమిటి ఊసే ఉండదు. మెడికల్ సూపరింటెండెంట్, నర్సింగ్ సూపరింటెండెంట్ వలె ఫార్మసీ సూపరింటెండెంట్ కూడా ఉండవలెననే ఇంగితం ఉండదు. రూరల్ హెల్త్ సెంటర్ (ఆర్ హెచ్ సి) లలో ఫార్మసిస్ట్ పోస్ట్ కనపడదు. ఫార్మకాలజీ, మరి కొన్ని నాన్ క్లినికల్ పోస్ట్ గ్రాడుయేట్ శాఖలలో సీట్ లు భర్తీ కాక ఏర్పడుతున్న అధ్యాపకుల కొరత తీర్చటానికి, ప్రత్యామ్నాయంగ మాస్టర్ ఆఫ్ సైన్స్ (ఎం ఎస్ సి) మెడికల్ కోర్స్ లను ప్రవేశ పెట్టింది ఎంసిఐ. ఎం ఫార్మ్, పిహెచ్ డి ఫార్మకాలజి పట్టభద్రులను నేరుగా మెడికల్ కాలెజ్ లో ఫార్మకాలజి అధ్యాపకులుగ నియమించుకోవచ్చు. కాని, వారి నిబంధనలలో ఆ మాట చేర్చరు. ఎం ఎస్ సి మెడికల్ కోర్స్‌లు, పబ్లిక్ హెల్త్, ఫూడ్ అండ్ నూట్రిషన్ ల పూర్వార్హతలో బి ఫార్మ్ ఉండదు. మెడికల్ కౌన్సిల్ లో ఫార్మసిస్ట్ ప్రతినిధులకు చట్టబద్దంగ స్థానం కల్పించవలసిన అగత్యం ఉన్నది. ఇంక, ఐఎంఎ ను చూస్తే, అది ఒక వృత్తి సంఘం. కాని, ఔషధ వితరణ ఫార్మసిస్ట్‌ల చేతుల మీద జరిపించాలన్న చట్టం పట్ల గౌరవం ఉండది. తాము ఏర్పాటు చేసే శిబిరాలలో సాటి వృత్తి సంఘమైన ఇండియన్ ఫార్మస్యూటికల్ అసోసియేషన్ (ఐపిఎ) ను కలుపుకొని పోవలెనన్న ఔచిత్యం ఉండది.
ఇంతకూ, ఫార్మసిస్ట్ లకు సరియైన స్థానం లేకపోతె ఏమైతది? విచక్షణారహిత ఔషధ వినియోగం వలన మూత్రపిండాలు, కాలేయం చెడిపోడం, చాలా ప్రాణాంతక దుష్పరిణామాలు కలుగుతున్నయి; ఆంటి బయోటిక్ రెసిస్టెన్స్ ఏర్పడుతున్నది. ఇంటెన్సివ్ కేర్ యూనిట్‌లలో ఫార్మసిస్ట్‌లు లేనందువలన ఔషధ సంబంధ విఘాతాలు వాటిల్లుతున్నయి. మెడికల్ ప్రిస్క్రిప్షన్ శిలా శాసనం కాదు. దానిని సమీక్ష చేసే అధికారం ఫార్మసిస్ట్ లది. వ్యాధికి ఔషధానికి, ఔషధానికి ఔషధానికి, ఖాద్య పదార్థాలకు ఔషధానికి, పానీయాలకు ఔషధానికి, ల్యాబ్ పరీక్ష ఫలితాలు ఔషధానికి గల అంతర చర్యలు, ఔషధానికి రాగల పార్శ్వ ప్రభావాలు, ఔషధ మాత్రా ప్రమాణం, ఔషధ ప్రయోగ మార్గం వంటి విషయాలలో మదింపు చేయగల విజ్ఞానం ఫార్మసిస్ట్‌లది. క్లయెంట్ లకు, నర్స్ లకు, ఫిసిషియన్ లకు ఔషధ సమాచార సలహాదారులు ఫార్మసిస్ట్‌లు. ఔషధ చికిత్స ద్వారా ఆశించిన ఫలితం రావలెనంటె ఫార్మసిస్ట్ ప్రమేయం అవసరం. ఇన్ పేషంట్‌లకు చికిత్స భాగస్వామ్యం, విషహరణ, డ్రగ్ థీరపి మానిటరింగ్, పోషణ వంటి సేవలు అందిస్తరు. సాధారణ వ్యాధుల చికిత్స, దీర్ఘవ్యాధి చికిత్స నిర్వహణ ఫార్మసిస్ట్‌లు స్వతంత్రంగ చేయగలరు.మెడికల్ అండ్ హెల్త్ డైరెక్టరేట్ లో ఫార్మసీ డైరెక్టర్ పదవి అవసరం. నిజామ్‌స్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్, కాళోజీ ఆరోగ్య విశ్వవిద్యాలయం పరిధిలోని అన్ని బోధనా వైద్యశాలలలో ఫార్మసీ డిపార్ట్‌మెంట్‌లను వెంటనే ప్రారంభించాలె. ఫార్మసీ సేవల విభాగానికి అధిపతిగ ‘ఫార్మసీ సూపరింటెండెంట్’ పదవి ఏర్పరచాలె. ఉన్నత విద్యార్హతలను నియామక నిబంధనలలో చేర్చాలె. డి ఫార్మ్, బి ఫార్మ్, ఎం ఫార్మ్/ ఫార్మా డి, పిహెచ్ డి అర్హతల వారీగా క్లినికల్ డెమాన్స్‌ట్రేటర్, ట్యూటర్, అసిస్టెంట్ ప్రొఫెసర్ ఆపై బోధనా హోదాలను కల్పించాలె. ఎపోతెకరీ లకు ఇచ్చిన విధంగ ఫార్మసిస్ట్ లకు సర్జన్ రాంక్ సంప్రదాయాన్ని పునరుద్ధరించాలె. అన్ని హాస్పిటల్స్ లో ‘డ్రగ్ ఇన్‌ఫర్మేషన్ సెంటర్స్’ ఏర్పాటు చేయాలె. వార్డ్‌లు, ఆపరేషన్ థియేటర్, లేబర్ రూంల నుంచి ఐసియు ల వరకు ఔషధ వినియోగం జరిగే అన్ని చోట్లా ఫార్మసిస్ట్ లను నియమించాలె. జిల్లా కేంద్ర వైద్యశాలలు, ప్రాంత వైద్యశాలలు, సమాజ ఆరోగ్య కేంద్రాలు అన్నింటిలో ఉన్నత విద్యార్హతలు ఉన్న ఫార్మసిస్ట్ లకు తగిన పోస్ట్ లు సృష్టించాలె. రాత్రింబగలు నడిచే ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో ముగ్గురు, మిగతా వాటిలో ఇద్దరు ఫార్మసిస్ట్ లను నియమించాలె. ఫార్మసిస్ట్ ల నైపుణ్యాభివృద్ధికి వృత్యంతర శిక్షణ ఇప్పించాలె. విశ్వవిద్యాలయ ఫార్మసీ కళాశాలలలో బి ఫార్మ్ ప్రాక్టిస్ బ్రిడ్జ్ కోర్స్‌ను వెంటనే ప్రారంభించి డి ఫార్మ్ వారిని దశల వారీగ స్టడీ లీవ్ పై ఉన్నత విద్యావంతులను చేయాలె. కమ్యూనిటి హెల్త్ కోర్స్‌లో ఫార్మసిస్ట్ లకు కోటా కల్పించాలె. ఎఐసిటిఇ సిఫార్స్ చేసిన విధంగ ఫార్మసిస్ట్ లకు అంద చేయాలె. ప్రైవేట్ అలోపతి మెడికల్ కేర్ ఎస్టాబ్లిష్‌మెంట్స్ నిబంధనలలో 24 గంటలు ఫార్మసిస్ట్ లు అందుబాటు ఉండే విధంగా సవరణ చేయాలె. ఫార్మా సిటిలో ప్రభుత్వ రంగ ఔషధ పరిశ్రమను నెలకొల్పాలె. తద్వారా ఫార్మసిస్ట్ లకు ఉపాధి, ప్రజలకు నాణ్యమైన ఔషధ చికిత్స అందచేయ వచ్చు.

డా. రాపోలు సత్యనారాయణ
9440163211