Home ఎడిటోరియల్ ప్రాణమిత్రులు ఫార్మసిస్ట్‌లు

ప్రాణమిత్రులు ఫార్మసిస్ట్‌లు

  • 2017 సెప్టెంబర్ 25 : ప్రపంచ ఫార్మసిస్ట్‌ల దినం

Pharmacy

ఆరోగ్య సంరక్షణలో ఔషధాల పాత్ర అనితర పూరకం! అటువంటి ఔషధాలను ప్రయోగ దశ నుంచి ఉత్పత్తి, వినియోగం దాకా అన్ని అంశాలు చూసే, చేసే నిపుణులు ఫార్మసిస్ట్‌లు! మానవాళికి, జంతురాశికి ఆరోగ్య సంరక్షణలో, రోగ చికిత్సలో అవసరమైన ఔషధాలన్నిటిని సమకూర్చేది ఫార్మసిస్ట్ లే! ఫిజిషియన్ రోగికి ఔషధాలతో ప్రాణం పోస్తే; ఫార్మసిస్ట్‌లు ఆ ఔషధాలకే ప్రాణం పోసేస్తారు! అటువంటి ఫార్మసిస్ట్‌ను సమాజంలో ఒక సాంకేతిక నిపుణుడుగా, వైద్యకోవకు చెందిన ఒక వృత్తి నిపుణుడుగా కాకుండా కేవలం ఒక సహాయకుడుగా భావిస్తున్నరు. ప్రతివృత్తి నిపుణతకు ఒక దినోత్సవం జరుపుకొంటున్నరు. ఫార్మసిస్ట్‌లకు కూడా ఒక దినోత్సవం జరుపుకొంటేనే వారి ప్రాధాన్యత పదుగురికి తెలుస్తది; అని బాగ్దాదీ ఫార్మసిస్ట్ డాక్టర్ హలీల్ టికెనర్ చేసిన ప్రతిపాదన ఫలితమే ఈ ‘ఫార్మసిస్ట్ దినోత్సవం’! అంతర్జాతీయ ఫార్మస్యూటికల్ సమాఖ్య(ఎఫ్‌ఐపి)ఆవిర్భావదినం సెప్టెంబర్ 25ను ‘వరల్డ్ ఫార్మసిస్ట్స్ డే’ గా పాటించాలని నిర్ణయమై ఏడేండ్లుగా ఈ వేడుక జరుపుకొంటున్నాము. వైద్యశాస్త్రం (మెడిసిన్)లో అంతర్భాగం అయిన ఔషధ కల్పన శాస్త్రం (ఫార్మసి) కాలక్రమంలో ప్రత్యేకతను సంతరించుకొన్నది. ఫార్మసి నేడు పరిశోధన నుంచి ఆరోగ్య సంరక్షణ వరకు శాఖోపశాఖలుగా విస్తరించింది.
అయినప్పటికీ, సామాజిక రాజకీయ గుర్తింపులో వెనుక
పడినందున ఆరోగ్యశాఖలో ఫార్మసిస్ట్‌లు తీవ్ర వివక్ష ఎదు ర్కొంటున్నారు. ఇప్పుడిప్పుడే ప్రభుత్వాలు ఫార్మసిస్ట్ ప్రాధాన్యతను అవగతం చేసికొంటున్నయి. జాతీయ ఆరోగ్య విధానం – 2017 ఫార్మసిస్ట్‌లను మొదటిసారిగా ప్రస్తావించింది. ఇది ఒక శుభ పరిణామం. ఔషధాలే చికిత్సకు మూలాధారం. కనుక, ఔషధ వినియోగంలో ఔషధ సూక్ష్మాలు అన్ని తెలిసిన ఫార్మసిస్ట్‌ల పర్యవేక్షణ అవసరం. ఫార్మసిస్ట్‌లు ఔషధ కల్పన విశేషాంశాలతో పాటు, శరీర నిర్మాణం మొదలుకొని మిగతా అన్ని వైద్యశాస్త్ర ఉపాంశాలను, న్యాయశాస్త్ర, వ్యాపార గణాంక శాస్త్ర, ప్రబంధన శాస్త్ర, సాంఖ్యగా శాస్త్రాది అనువర్తితాంశాలను క్షుణ్ణంగా అధ్యయనం చేస్తరు.
ఆరోగ్యరంగ మానవ వనరుల నిపుణులు, ఆర్థిక వేత్తలు ఫార్మసిస్ట్‌ల ఆవశ్యకతను తక్కువ అంచనా వేసినందున అటు ఆరోగ్య రంగానికి ఇటు వ్యక్తిగతంగా ఫార్మసిస్ట్‌లకు చాలా నష్టం జరిగింది. ఫార్మసిస్ట్ దినోత్సవం సందర్భంగ ప్రభుత్వాల స్థాయిలో తీసికొనవలసిన కొన్ని కీలక విషయాలను ప్రస్తావన చేస్తున్నను.
జాతీయ మానవ హక్కుల కమీషన్ నిర్దేశించిన విధంగా అన్ని బోధన వైద్యశాలలు, సాధారణ వైద్యశాలలలో పూర్తిస్థాయి ఫార్మసీ విభాగాలను నెలకొల్పాలె. వార్డులలో, ఇంటెన్సివ్ కేర్ యూనిట్‌లలో ఫార్మసిస్ట్‌లను నియమించాలె. ఫార్మసిస్ట్‌ల హోదాను ఫార్మసి అధికారిగా మార్పు చేస్తూ, సబ్ అసిస్టెంట్ సివిల్ ఫార్మసిస్ట్, అసిస్టెంట్ సివిల్ ఫార్మసిస్ట్, డిప్యూటి సివిల్ ఫార్మసిస్ట్, సివిల్ ఫార్మసిస్ట్ అనే శ్రేణి (ర్యాంక్) కల్పించాలె. వీటితో పాటు బోధనా వైద్యశాలలలో అధ్యాపక హోదా అవసరం. ప్రజా ఆరోగ్య, వైద్య విద్య తదితర డైరెక్టరేట్‌లలో అడిషనల్ డైరెక్టర్ ఆఫ్ ఫార్మసి పదవి సృష్టించాలె. అజిత్ జైన్ స్టడీ గ్రూప్ ఆఫ్ హాస్పిటల్స్ సూచించిన విధంగా ప్రతి చిన్న వైద్యశాలకు కూడా ముగ్గురు ఫార్మసిస్ట్‌లను నియమించాలె. అన్ని ప్రైవేట్ హస్పిటల్స్‌లో ఫార్మసిస్ట్‌లను నియమించే విధంగా నిబంధనలు రూపొందించాలె. హాతీ కమిటీ సిఫార్సుల ప్రకారం ఎప్పటికప్పుడు ఆవశ్యక ఔషధాల జాబితాను సమీక్ష చేయాలె. ప్రతి రాష్ట్రం ప్రభుత్వ యాజమాన్యంలో ఒక ఔషధ ఉత్పత్తి పరిశ్రమను నెలకొల్పాలె. ఔషధ నియంత్రణ అధికారులకు యూనిఫాం ఉన్న భద్రతా సిబ్బందిని నియమించాలె. ఔషధ పరీక్షశాలలను ఆధునీకరణ చేయాలె.
ఫార్మసీ కళాశాలలను వైద్యశాలలు, పరిశ్రమలతో అనుసంధానం చేయాలె. జాతీయ ఆరోగ్య విధానం 2017లో ప్రకటించిన విధంగా సామాజిక ఆరోగ్య నిర్వహణ కోర్సులలో ఫార్మసిస్ట్‌లకు ప్రవేశాలు కల్పించాలె. ఫార్మసిస్ట్‌ల సేవలను అన్ని జాతీయ ఆరోగ్య కార్యక్రమాలలో సద్వినియోగం చేసికొవాలె. ఆవాస పాఠశాలలు, కళాశాలలు, హాస్టల్స్‌లో ఆరోగ్య పర్యవేక్షకులుగా ఫార్మసిస్ట్‌లను చేర్చుకోవాలె. ఆరోగ్య ఉపకేంద్రాలలో ఫార్మసిస్ట్‌లతో చికిత్సా సేవలు అందించాలె. జన్ ఔషధి, జీవన్ ధార ఔషధశాలల లక్ష్యం నెరవేరాలంటె రిజిస్టర్డ్ ఫార్మసిస్ట్‌లకే కేటాయించాలె.
ప్రభుత్వాలు ఫార్మసిస్ట్స్ డే సందర్భంగా నిరంతర ఫార్మసి విద్య, అవగాహన సదస్సులు నిర్వహించాలె. నిష్ణాతులైన, విశిష్ట సేవలు అందించిన ఫార్మసిస్ట్‌లను సత్కరించాలె.

– డాక్టర్ రాపోలు సత్యనారాయణ
ఇండియన్ ఫార్మస్యూటికల్ అసోసియేషన్
జీవితకాల సభ్యుడు, 9440163211