Home దునియా కృతజ్ఞత

కృతజ్ఞత

Pigeon

 

ఒక అడవిలో ఒక సెలయేరు ఉంది. దప్పిక తీర్చుకోవటానికి, ఆ అడవిలోని జంతువులన్నీ సెలయేరు దగ్గరకు వచ్చి, చల్లని నీటిని తాగి చెట్ల నీడన విశ్రమించి, సేదదీరేవి. కాసేపు కబుర్లు చెప్పుకుని తిరిగి వాటి వాటి ఇళ్లకు వెళ్లేవి. ఒకనాటి మిట్ట మధ్యాహ్నం అడవి అంతా ఎండగా ఉంది. పక్షులు, జంతువులు అన్నీ సెలయేటి దగ్గరకు చేరి చల్లని నీటిని తాగి సేదదీరి కబుర్లు చెప్పుకుంటున్నాయి. కోతులు కిచకిచమంటూ పరస్పరం పలకరించుకున్నాయి. ఏనుగు ఘీంకారం చేసింది. చిలకలు కమ్మగా ఊసులు చెప్పుకుంటున్నాయి. కోకిలలు కుహుకుహూమంటున్నాయి.సెలయేటి దగ్గరకు చేరిన ఒక పావురం యేటిన నీటిని తాగుతోంది. ముక్కును నీటిలో ముంచి నీరు పీల్చుకుని మెడ ఎత్తి, ఆకాశం వేపు చూస్తూ, కడుపులోకి జార్చుకుంటుంది. అలా నాలుగు ఐదు సార్లు నీరు తాగి మెడ ఎత్తి కడుపులోకి జార్చుకుని పచ్చిక మీద విశ్రాంతి తీసుకుంటుంది ఆ పావురం.

అక్కడే ఉన్న ఒక నక్క ఇది గమనించింది. ముందు కాళ్లు ముడుచుకుని, మెడ దించి, నాలుకను గరిటలా చేసి నీరు తాగకుంగా మెడను దించటం, ఎత్తటం ఏమిటని ఎద్దేవా చేసింది. కారణం ఏమిటో చెప్పమని అడిగింది.
పావురం మౌనం వహించింది.
నక్కకు పట్టుదల పెరిగింది.
“జవాబు చెప్పాల్సిందే” అంటూ నిలదీసింది నక్క.
ఇదంతా చూస్తున్న మిగతా జంతువులు “పావురం జవాబు చెప్పాల్సిందే” అంటూ తీర్మానించాయి.
సమయస్ఫూర్తి గల ఆ పావురం ఇలా అంది.
“మనందరినీ ఆ భగవంతుడు పుట్టించాడు కదా”! అంది. జంతువులు అవునన్నాయి.
లేళ్లలాంటివి జంతువులకు తినటానికి పచ్చికనిచ్చాడు. చిలకలకు, కాకులకు, కోకిలలకు తినటానికి ధాన్యం, పురుగులను ఇచ్చాడు. అవునా అంది పావురం.
“అవును” అన్నాయి జంతువులు, పక్షులు ఏక కంఠంతో..
నక్క బావ లాంటి వారికి ఆహారంగా కుందేళ్లను, పులులకు లేళ్లను ఇచ్చాడు కదా”! అంది పావురం.
మళ్లీ జంతువులు, పక్షులు ‘అవును’ అని జవాబిచ్చాయి.
ఇందరికి ఇన్ని ఇచ్చి, మనలందరినీ పెంచి పోషిస్తున్న ఆ భగవంతుడికి కృతజ్ఞత చెప్పటం మన ధర్మం. అందుకే నేను నీరు తాగినప్పుడల్లా మెడ ఎత్తి ఆ భగవంతునికి కృతజ్ఞత ప్రకటించుకుంటున్నాను అని చెప్పింది పావురం.
జవాబు విన్న నక్కబావ సిగ్గుపడింది. పావురాన్ని ఆక్షేపించినందుకు క్షమాపణ చెప్పింది.
నీతి: మనలను పుట్టించిన ఆ భగవంతుడికి మనం అందరం కృతజ్ఞులమై ఉండాలి. సమయస్ఫూర్తి కలిగి ఉండాలి.

కూర చిదంబరం, 86393 38675