Home జగిత్యాల ‘ప్లాస్టిక్’ నియంత్రణపై ప్రత్యేక పోరు: కమిషనర్

‘ప్లాస్టిక్’ నియంత్రణపై ప్రత్యేక పోరు: కమిషనర్

Plastic carry bags Banned From on June 1 in jagtial

 

జగిత్యాల: వాతావరణ కాలుష్యంతో పాటూ పర్యావరణాన్ని నాశనం చేసే ప్రాణాంతక ప్లాస్టిక్ నియంత్రణ కోసం కోరుట్ల మున్సిపల్ పక్షాన ప్రత్యేక సమరం నిర్వహించనున్నట్లు కమిషనర్ మహమ్మద్ అయాజ్ పేర్కొన్నారు. ఈ మేరకు శుక్రవారం పట్టణంలోని పలు మార్కెట్ ప్రాంతాల్లో దాడులు నిర్వహించిన అనంతరం సాయంత్రం కోరుట్ల బల్దియా కార్యాలయంలో ఆయన విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ… పట్టణ ప్రజలు, వ్యాపారస్తులు ప్లాస్టిక్ వాడకం నియంత్రణలో విధిగా సహకరించాలని కోరారు. పర్యావరణ పరిరక్షణలో భాగంగా ప్లాస్టిక్ వేస్టేజి ద్వారా చెట్లు, పలు రకాల ప్రాణులు మృత్యువాత పడుతున్నాయని కమిషనర్ పేర్కొన్నారు. ప్రభుత్వ నిబంధనల మేరకు పట్టణ పరిధిలో జూన్ 1వ తేదీ నుండి ప్లాస్టిక్ క్యారీబ్యాగ్‌ల వాడకం నిషేధిస్తున్నామని, మున్సిపల్ సాలీడ్ వేస్ట్ మేనేజ్‌మెంట్ రూల్స్ 2016, పర్యావరణ పరిరక్షణ శాఖ ప్రభుత్వ ఉత్తర్వు నెం.25 ప్రకారం కోరుట్ల పట్టణంలో ప్లాస్టిక్ కవర్ల వాడకాన్ని పూర్తిగా నిషేధిస్తున్నట్లు అయాజ్ ప్రకటించారు.

ఒకవేళ నిషేధిత ప్లాస్టిక్ కవర్లు వాడినచో 500 రూపాయల నుండి 50,000 రూపాయల వరకు జరిమానా విధించడంతో పాటూ చట్టరీత్యా చర్యలు తీసుకుంటామన్నారు. ప్లాస్టిక్ కవర్లు విక్రయించే వ్యాపారస్తులపై ప్రత్యేక దాడులు నిర్వహించి కేసులు నమోదు చేసి చట్ట ప్రకారం వారి లైసెన్సులను రద్దు చేయడంతో పాటూ దుకాణాలను సీజ్ చేసే అవకాశాలు కూడా ఉన్నాయని కమిషనర్ హెచ్చరించారు. ఈ విషయంలో పట్టణంలోని వ్యాపారులు, ప్రజలు విధిగా తమకు సహకరించాలని, ప్లాస్టిక్ వాడకాన్ని నియంత్రించక పోతే ముందుతరాల వారు తీవ్ర అనారోగ్య సమస్యలతో పాటూ ప్రకృతి సిద్ధమైన నీటి వనరులు కోల్పోయే ప్రమాదం ఉందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. జూన్ 1వ తేదీ నుండి మున్సిపల్ సిబ్బంది పట్టణంలోని మార్కెట్ ప్రాంతాలు, దుకాణాలు తదితర వ్యాపార వాణిజ్య సముదాయాల్లో దాడులు నిర్వహిస్తామని, ఇందుకు అందరూ సహకరించాలని కమిషనర్ అయాజ్ కోరారు. ఆయన వెంట సానిటరీ ఇన్స్‌పెక్టర్ రాజయ్య తదితరులున్నారు.

Plastic carry bags Banned From on June 1 in jagtial