Search
Wednesday 26 September 2018
  • :
  • :

ప్లాస్టిక్‌పై నిషేధమేది?

Plastic consumption increases day by day

మన తెలంగాణ/చింతపల్లి : ప్లాస్టిక్ వాడకం రోజురోజుకు పెరిగిపోతుంది. ప్లాస్టిక్ ప్రమాదమని తెలిసినా ప్రతి ఒక్కరూ ప్లాస్టిక్ కవర్లు, బ్యాగులనే వాడుతున్నారు. ప్లాస్టిక్ వాడకంతో పర్యావరణం దెబ్బతినడంతోపాటు వాతావరణం కలుషితమవుతంది. తీవ్ర దుష్పరిణామాలు ఎదురయ్యే ప్లాస్టిక్ వాడకాన్ని నిషేధించాలని అత్యున్నతన్యాయస్థానం ఆదేషించినా దాన్ని అమలు చేయడంలో అధికార యంత్రాంగం శ్రద్ధ వహించడంలేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. ప్లాస్టిక్ వాడకం ప్రమాద స్థాయిని మించిపోవడంతో పర్యావరణవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గ్రామాల్లో ప్లాస్టిక్ నిషేధాన్ని పంచాయతీలు పక్కాగా అమలు చేయాల్సి ఉన్నా ఎవరూ దీని గురించి పట్టించుకోవడంలేదు. ప్రస్తుతం షాపుల్లో ఏ వస్తువు కొన్నా ప్లాస్టిక్ కవర్లలోనే సరుకలును ఇస్తున్నారు. కూరగాయలు తదితర వస్తువులు సైతం ప్లాస్టిక్ కవర్లలోనే తీసుకెళ్తున్నారు. ప్రజలు కూడా షాపులకు వెళ్లినా, మార్కెట్‌లకు వెళ్లినా సంచులు తీసుకపోవడం పూర్తిగా మానివేశారు. అన్ని వస్తువులను ప్లాస్టిక్ కవర్లలోనే తీసుకొస్తున్నారు. మరో పక్క పెళ్లీళ్లు, విందు లు, శుభకార్యాలకు గతంలో ఇస్తారాకులను వాడేవారు. కానీ ఇప్పుడు దానికి పూర్తిగా భిన్నంగా ప్లాస్టిక్ ప్లేట్‌లు, గ్లాసుల వాడకం పరిపాటిగా మారింది. ప్లాస్టిక్ వాడకం ఎంత ప్రమాదకరమైనదో ప్రజలకు అవగాహన కల్పించడంలో ప్రభుత్వాలు విఫలమవుతున్నాయి అని చెప్పవచ్చు. కొన్ని స్వచ్ఛంద సంస్థలు ప్లాస్టిక్ నిషేధంపై ప్రజలకు అవగాహన కల్పిస్తున్నా దాని ప్రభావం ఎక్కడా కనిపించడం లేదు.

అమలుకు నోచుకోని నిషేధం
ప్లాస్టిక్ వినియోగం విపరీతంగా పెరిగిపోతున్నా నిషేధించడంలో ప్రభుత్వాలు విఫలమవుతున్నాయి. ప్రజలు ప్లాస్టిక్ వినియోగానికి అలవాటుపడడంతో ప్లాస్టిక్ కవర్లు, గ్లాసులు, పేట్లు విరివిగా వాడుతున్నారు. నిషేధాన్ని కచ్చితంగా అమలు చేయాలనే చిత్తశుద్ధి ప్రభుత్వాలకు ఉంటే ప్లాస్టిక్ కవర్లను, వస్తువులను తయారు చేసే కంపెనీలకు అనుమతులు ఇవ్వకూడదు. ప్రభుత్వాలు వాటిపై ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో యథేచ్ఛగా ప్లాస్టిక్ వస్తువులు తయారు చేసి మార్కెట్‌లోకి వదులుతున్నారు. ప్రజలు సైతం వాటిని ఇష్టానుసారంగా వాడుతున్నారు.

కలుషితమవుతున్న వాతావరణం
చాలా ప్లాస్టిక్ వస్తువులను వాడిన అనంతరం వాటిని రోడ్డు పక్కన, చెత్తకుండీల్లో పడవేయడంతో వాటిపై ఈగలు, దోమలు చేరి ప్రజలకు రోగాలను కలుగజేస్తున్నాయి. దీనితో పాటు వాతావరణం కలుషితమవుతుంది. ఇకనైనా అధికారులు ప్లాస్టిక్ నిషాధంపై చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని మండల ప్రజలు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.

Comments

comments