Home లైఫ్ స్టైల్ ప్లాస్టిక్‌ను తరిమేద్దాం..!

ప్లాస్టిక్‌ను తరిమేద్దాం..!

Plastic environment can be harmful

పాత చీరలతో కొత్త సంచీలు 
ఈ శ్రావణంలో అందరూ ప్లాస్టిక్ బదులు ఇలాంటి సంచులను వాడాలని ఆమె కోరుతోంది. సంస్థలో నాతో పాటు మీరుకూడా వచ్చి ప్లాస్టిక్ మీద యుద్ధాన్ని ఆరంభిద్దాం. మీరంతా కూడితే నేను ఈ పనిలో విజయం సాధిస్తాను. కొంతమంది మేము చీరలిస్తే మాకేమి ఇస్తారని అడుగుతున్నారు. ఈ బ్యాగుల వల్ల కొంతమందికి ఉపాధి దొరుకుతోందనేదాన్ని మీరు తెలుసుకోండి. ఇప్పటికే స్వచ్ఛందంగా కొన్ని సంస్థలు చీరలు ఇస్తున్నాయి. పాత చీరలు ఇవ్వాలనుకునేవారు ముందుకు రావాలి. ‘రైజింగ్ ఈవ్స్’ పేరుతో ఫేస్‌బుక్‌ను కూడా నిర్వహిస్తున్నాం. వివరాలకోసం 8179836318 నంబర్‌ను సంప్రదించండి.

ప్లాస్టిక్ వాడొద్దు…పర్యావరణానికి హాని జరుగుతుంది … ప్లాస్టిక్ మీద నిషేధం విధించారు.. ఇలా ఈ మధ్య కాలంలో మనం చాలా సార్లు వింటున్నాం. ఈ విషయం మీద ప్రజలలో ఎంత అవగాహన వచ్చిందో ఏమో గాని హైదరాబాద్ లో నివాసముంటున్న శోభ తన వంతు సాయంగా పాత కాటన్, సిల్క్ చీరలతో సంచీలు కుట్టి తన వంతుగా ప్రకృతిని కాపాడుతోంది. వినియోగదారులకీ భారం తగ్గిస్తోంది. కేవలం కొద్ది సంచీలతో ‘రైజింగ్ ఈవ్స్’ అనే సంస్థను ప్రారంభించి ఇప్పుడు వారానికి 5వేల దాకా ఆర్డర్లు అందుకుంటోంది. తనతో పాటు మరికొంత మంది మహిళలకు ఉపాధి కల్పిస్తోంది. పాతబట్టల మీద మంచి ఎంబ్రాయిడరీ, పెయింటింగ్ వర్క్ చేసి వాటిని అందమైన బ్యాగ్‌గా మారుస్తోన్న శోభతో సకుటుంబం ముచ్చటించింది.

ఇంటర్ పూర్తిచేసిన శోభ తర్వాత టైలరింగ్, పెయింటింగ్, ఎంబ్రాయిడరీ వర్క్ చేస్తూ , బ్యూటీషియన్ కోర్స్ లో డిప్లొమా పూర్తిచేసి ఇంటిదగ్గరే పార్లర్ కూడా మొదలుపెట్టింది. ఒక చిన్న ఆలోచనతో ప్రపంచాన్ని మార్చవచ్చు అన్నట్లుగా ఆమె జీవితంలో ఒక సంఘటన రుజువు చేసింది.

ఒకసారి ఆరోగ్యం బాగోలేదని తన ఫ్యామిలీ డాక్టర్‌ను కలిసింది. ఆ డాక్టర్, శోభకు వాతావరణ కాలుష్యం, ప్రజల జీవితాలలో ప్లాస్టిక్ రాక, వాటి వల్ల ఎదురవుతున్న అనర్థాల గురించి మాటల సందర్భంలో వివరించారు. ప్లాస్టిక్ వల్ల ప్రపంచానికి ఇంత నష్టం ఉందని తెలుసుకుంది. పేపరు బ్యాగులు తయారు చేద్దామని నిర్ణయించుకున్నారు. అయితే వీటివల్ల మళ్లీ పర్యావరణానికి ఇబ్బంది అని గ్రహించి పాత చీరలతో బ్యాగులను కుట్టి మిత్రురాలికి చూపించింది. చాలా బాగుందని అందరూ మెచ్చుకున్నారు. ఈవిడ కుట్టిన బ్యాగులు మెచ్చుకుని 200 బ్యాగులకు ఆర్డర్ ఇచ్చారు. ఇన్ని బ్యాగులు శోభ ఒక్కతే కుట్టలేరు మరికొంత మంది సహాయం కావాలి అని ఆలోచించి ఇంట్లో పనిమనిషి, స్లమ్ ఏరియాలో ఉండే మరికొందరితో మాట్లాడి(వారికి కూడా ఉపాధి దొరుకుతుందనే ఉద్దేశ్యంతో) 200 బ్యాగులను కొద్ది రోజులలోనే కుట్టి ఇచ్చేశారు.

ఈ ఆర్డరుతో మరింతగా ప్లాస్టిక్ క్యారీబ్యాగ్ లను పూర్తిగా నిర్ములించాలనే ఆలోచనతో మరింత మార్కెటింగ్ చేయడం మొదలుపెట్టింది. కూరగాయలు, పండ్ల మార్కెట్ ప్రాంతాలలో అక్కడ ఉన్న కొంతమందికి అవగాహన కల్పించారు. మొదటగా వినియోగదారులు ఏ మాత్రం ఆసక్తి చూపించకపోయేసరికి ఉచితంగా బ్యాగులు పంపిణి చేశారు. రాను రాను ప్రజలలోను అవగాహన పెరుగుతుండడం వల్ల ఆర్డర్లు కూడా పెరిగాయి.

ఈ పాత చీరలతో బ్యాగులను తయారుచేయడానికి ఒక పద్ధతిని ఉపయోగిస్తారు. చీరలను సావ్ లాన్ వేసి కొన్ని గంటల పాటు నానబెడతారు. తరువాత వాషింగ్ మెషిన్‌లో వాష్ పౌడర్ తో ఉతుకుతారు. వాటిని శుభ్రంగా ఉతికి ఎండలో ఆరబెడతారు. ఆరిన బట్టలను సంచీల పరిమాణాన్ని బట్టి ముక్కలుగా కత్తిరించి బ్యాగులు తయారుచేస్తారు. మొదటగా కొద్ది ఆర్డర్లుతో ప్రారంభమైన ఈ ‘రైజింగ్ ఈవ్స్’ ఇప్పుడు ప్రతి వారం దాదాపు 5 వేల బ్యాగులను తయారు చేస్తోంది. ఈ సంస్థలో 10 మంది మహిళలు ఉపాధి పొందుతున్నారు. ఇవి ఎక్కువ రోజులు మన్నుతున్నాయి కాబట్టి వినియోగదారులు ఎక్కువగా ఇవి కొనటానికే మద్దతు ఇస్తున్నారు. ఇలా పర్యావరణానికి హానిలేని పనులు చేస్తూ జనజీవనానికి ఎంతో మెరుగైన ఫలితాలు కనిపిస్తాయి.