Home దునియా సంస్కృతి ముసుగులో హింసావినోదం!

సంస్కృతి ముసుగులో హింసావినోదం!

Bull-Fight

తమిళులు తాము ప్రత్యేకం అనే విషయాన్ని ప్రతిసారీ చాటుకుంటూనే ఉన్నారు. జాతీయభాషగా హిందీని స్వీకరించలేదు. పైగా తమిళ భాషను జాతీయ భాషగా, అందరూ నేర్చుకుని మాట్లాడాలని కూడా అభిప్రాయపడ్డారు. వారి ప్రాంతానికి, భాషకు, సంప్రదాయాలకు ఎక్కువ విలువ ఇచ్చుకోవడం వారికి సాధారణమే. అది జల్లికట్టు విషయంలో ఇంకోసారి తేటతెల్లమైంది. జల్లికట్టును కేవలం ఒక ఆటగా చూడలేదు. వారి సంప్రదాయం, సంస్కృతిలో భాగంగా చూశారు. జంతు ప్రేమికుల పిటీషన్ మీద దానిని సుప్రీం కోర్టు నిషేధించడంతో వారి మనోభావాలు దెబ్బతిన్నాయి. యువత ఏకమై చేపట్టిన జల్లి’కట్టు’లో తమిళుల పట్టు గట్టిగా రుజువైంది.

రాజకీయ పార్టీలు, నేతలు, సినిమా నటులు వెంట నడవవలసిన తప్పనిసరి పరిస్థితి వచ్చింది. అంత శక్తియుక్తులు, పోరాట పటిమ తమిళనాడు యువత చూపారు. రాజకీయ పార్టీలను ఈ అంశానికి దూరంగా ఉండమని శాసించారు. సామాజిక మాధ్యమాలు జల్లికట్టు నినాదంతో ఏకమయ్యేలా చేయగలిగారు.ఉద్యమంలో ఆడపిల్లలు కూడా భారీ ఎత్తున భాగస్వామ్యం తీసుకున్నారు. అయినా కూడా ఎక్కడా వారిని వేధించిన సంఘటనలు నమోదు కాలేదు. వారి నిబద్ధత, ప్రశాంతంగా పోరాటాన్ని నిర్వహించిన తీరు అందరినీ అబ్బుర పరిచింది. 2011 లో ప్రదర్శనకు, శిక్షణకు, పోటీలకు వాడకూడదని వెలువడిన జాబితాలో ఎద్దులు కూడా ఉండటంతో జల్లికట్టు వివాదాస్పదం అయింది.

గ్రామాల్లో ఇంటి సభ్యులుగా కలిసిపోయి ఉండే పశువులను క్రూరమైన ఆటల్లో హింసించడం సరైంది కాదనే నిబంధనలు వచ్చాయి. అయితే జంతువుల మీద క్రూరత్వం ప్రదర్శించే ఆటలు చాలానే ఉండగా కేవలం జల్లికట్టునే ఎందుకు నిషేధించాల్సి వచ్చిందనే మొండితనం కూడా ఉద్యమానికి కారణం. జల్లికట్టులో జంతువులు హింసకు గురవుతాయి లేదా ఆటలో మనుషులు చనిపోతారు. జల్లికట్టే కాకుండా ప్రపంచంలో చాలాచోట్ల జంతువులను హింసించే ఆటలు, వినోదాలు చాలానే ఉన్నాయి.

బేర్ అండ్ బుల్
ఇంగ్లండులో 1200 కాలంలో ఎలిజబెత్ కాలంలో బేర్ అండ్ బుల్ క్రీడ బాగా ప్రాచుర్యంలోకి వచ్చింది. ఎలిజబెత్ రాణి కూడా మధ్యాహ్నవేళ రక్తపాతంతో కూడిన ఈ వినోదాన్ని చూడటానికి కూర్చునేదట. ఈ క్రీడలో కుక్కలను భూమిలో పాతిపెట్టి ఎలుగుబంట్లకు ఎరగా వాడతారు. రాణి, ప్రజలు, ఫారిన్ అంబాసిడర్లు అందరూ ఈ ఆటతో వినోదం పొందేవారు. ఈ పోటీల్లో చాలా డబ్బు ఖర్చుపెట్టేవారు. బేర్ బైటింగ్, బుల్ బెయిటింగ్‌లను లండన్ ప్రాంతంలో బేర్ గార్డెన్‌లో నిర్వహిస్తారు.

పాకిస్తాన్ గ్రామాలలో జనం అంతా గుమికూడి ఎలుగుబంటి మీదకి శిక్షణ పొందిన కుక్కలను వదులుతారు. ఎలుగుబంటిని పట్టుకుని కుక్కల మధ్యకి వదిలే ముందే దాని పోరాటపటిమను నష్టపరుస్తారు. వాటి పళ్లు విరగ్గొడతారు. కండరాలు నొప్పి పెట్టేలా సూదులతో గుచ్చుతారు. వాటి పంజాలను తీసేస్తారు. దాని వంటి మీద విపరీతమైన గాయాలు చేస్తారు. అటువంటి ఎలుగుబంటిని కుక్కలు చంపేసి పీక్కు తింటాయి. దాన్ని చూసి జనం ఆనందిస్తారు. ఒక ఎలుగుబంటి చనిపోతే మరిన్ని ఎలుగుబంట్లను అదే మాదిరి చేసి బరిలోకి దింపుతారు.

చారియట్
రోమ్‌లో అతి పురాతనమైన ఆటలున్నాయి. అందులో ఒకటి చారియట్ రేస్. రథం ఆట. ఆ రథాన్ని నాలుగు గుర్రాలు లాగుతాయి. ఆ రేసు కోసం రెండు పొడవైన ట్రాక్‌లు, 180 డిగ్రీల మలుపులు ఉంటాయి. మల్లయోధుల ప్రదర్శనలు, బాక్సింగ్, రేసుల లాటివే అత్యంత ప్రమాదకరమైన ఆట ఇది. రేస్‌లో రథాలు ఒకదాన్నొకటి గుద్దేసుకుంటుంటాయి. రథం నడిపేవాళ్లు రథం నుంచి పడిపోతే గుర్రాలు అతన్ని ఈడ్చుకెళ్లిపోతాయి. లేదా గుర్రాలు తొక్కేసి చంపేస్తాయి. అయినా సరే రథాలు నడిపే ఈ రేస్‌లో పాల్గొనడానికి చాలామంది యువకులు ఉత్సాహం చూపిస్తారు. గుర్తింపు, బహుమానాల కోసం జీవితాల్ని పణంగా పెట్టేస్తారు.

రోమన్ బాక్సింగ్
గ్రీకులు అభివృద్ధి చేసిన బాక్సింగ్ కంటే ఇది విభిన్నమైంది. ఇది కూడా ఒక అథ్లెటిక్ షో లాటిది. పబ్లిక్‌కి పూర్తి వినోదాన్నిస్తుంది ఈ ఆట. జనం గుమిగూడి చూస్తారు. మామూలు బాక్సింగ్‌లో చేతులకు మెత్తటి తోలు కవర్లు కట్టుకుంటారు. వారిని వారు దెబ్బ తగలకుండా రక్షించుకుంటూ ఉంటారు. కాని ఈ బాక్సింగ్‌లో అరచేతులకు లోహపు ముక్కలతో చేసిన గ్లోవ్స్ వేసుకుంటారు. వీలైనంత ఎక్కువగా ఎదుటివారికి నొప్పి కలిగించవచ్చు. ఆ ఆటకే సమయ నియంత్రణ ఉండదు. ఎంతసేపైనా ఆట కొనసాగుతుంది. ఒకళ్లని ఒకళ్లు హింసించుకుంటూ గాయాలు, రక్తాలు కారుతూ ఆడుతుంటారు.

గ్లాడియేటర్
గ్లాడియేటరల్ ప్రదర్శనలు క్రీస్తు పూర్వం నుంచి చాలా ప్రాచుర్యంలో ఉన్నాయి. ఆయుధాలు ధరించిన ఇద్దరు వ్యక్తులు ఒకరిని ఒకరు చంపుకునేంతగా కొట్టుకుంటారు. దాని వలన వచ్చే పేరు కోసం ఈ ఆటకి సిద్ధపడతారు.గ్లాడియేటర్లు ముందుగా ఒక ప్రొఫెషనల్ ట్రెయినింగ్ స్కూలులో లూడూస్‌లాగా శిక్షణ పొందుతారు. దీనికోసం సమాజంలో బానిసలు, ముద్దాయిలు, యుద్ధ ఖైదీలు వంటి జనాభా నుంచి లూడూస్‌ను ఎంచుకునేవారు. క్రీస్తు శకం తర్వాత బానిసేతరులు, రిటైర్ అయిపోయిన సైనికులు, ఒక్కోసారి మహిళలు కూడా ఈ క్రీడలో పాల్గొనడం ఆరంభించారు.

మనుషుల్ని ఆటవికంగా చంపే ఆట
రోమ్‌లో నేరస్థులను జనం మధ్యలో చంపడానికి కూడా ఆటని మాధ్యమంగా తీసుకుంటారు. జనం మధ్యలో ఖాళీ ప్రదేశానికి తీసకొచ్చి శిలువ వేయడం, వారిని బతికుండగానే తగలబెట్టడం, కత్తితో పొడవడం లేదా క్రూర జంతువులను వారిపైకి వదిలి చంపడం, ఇలాటి శిక్షలు వేసేవాళ్లు. ఈ శిక్షలు కూడా వ్యక్తుల సామాజిక స్థితిబట్టి ఉంటుంది.

వెనేషియో
రోమ్‌లో క్రీస్తు పూర్వం నుంచి ఉన్న వినోదం ఇది. మొసళ్లు, హిప్పోపొటమస్, పులులు, సింహాలు, చిరుతపులులు లాటి క్రూర జంతువులను రిపబ్లిక్ డే రోజున పెరేడ్ చేయించేవారు. పక్షుల నుంచి జంతువుల వరకు అన్నీ ప్రదర్శనలో భాగమే. వాటికి శిక్షణ ఇచ్చి ప్రదర్శనలు చేయించేవారు. ఆ సమయంలో వాటిని వేటాడి చంపేవారు. దాన్ని వెనేషన్స్ అంటారు. ఈ వినోదం కోసం వేటగాళ్లు, జంతువులను పట్టేవాళ్లు, శిక్షణ ఇచ్చేవారు, షిప్పింగ్, సరఫరా చేసేవారికి ఎక్కువ పని దొరకడం మొదలూంది. ఈ ఆటలు వంద రోజులు జరిగేవి. 9000 పెంపుడు, క్రూర జంతువులను ఒకే ప్రదేశంలో వాటితో ఆటలు ఆడించి చంపేసేవారు.
రోమ్‌లో ఇంకో ఆట ఉండేది. రోమ్ రాజు ప్రోబస్, అడవిని తలపించేలా ఒక ప్రదేశంలో చెట్లు, పొదలు పెట్టించేవాడు. అందులో రకరకాల జంతువులను వదిలేవారు. ఆ జంతువులను మొదటిరోజు వేటాడి చంపి మాంసం ఇంటికి పట్టుకెళ్లేవారు. రెండోరోజు సింహాలు, ఎలుగుబంట్లను ప్రదర్శనకు పెట్టి చంపేవారు.

ఎద్దులతో ఆట
ఎద్దులతో పోటీ పడి ఆడే ఆట ప్రపంచంలో చాలాచోట్ల ఉంది. కాని చాలావరకు ఎద్దుని చంపేస్తారు. పోర్చుగల్‌లో కూడా ఎద్దులతో ఆట ఉంటుంది. కాని అక్కడ ఎద్దులు రక్తం చిందించవు. ఎద్దుని చంపరు. ఫ్రాన్స్‌లో 150 ఏళ్ల పురాతనమైన ఆట. ఐదురోజులు జరుపుకుంటారు. మెక్సికో సిటీలో ప్రపంచంలోనే అతి పెద్ద గ్రౌండ్ ఉంది. ఎద్దుని రెచ్చగొడుతూ దాంతో పోటీ పడతారు. పెరూ, ఎక్యుడర్‌లలో కూడా ఎద్దులతో ఆడతారు. అయితే ఒక తేడా ఉంది. పైన దేశాలలో ఆడేవారు చేతిలో ఆయుధాలతో ఎద్దులతో తలపడతారు. ఎద్దుల్ని చంపుతారు. కాని మనదేశంలో తమిళనాడులో జరిగే జల్లికట్టులో ఆయుధాలను చేతబట్టి ఎద్దులతో ఆడరు. పైగా ఎద్దుల్ని చంపరు.
స్పెయిన్‌లో ఎద్దులతో ఆటను 2010 లో బ్యాన్ చేశారు. కాని మళ్లీ ఆ తీర్పును వెనక్కి తీసుకున్నారు. దాన్ని సంప్రదాయాన్ని కాపాడే ఆటగా మళ్లీ అమలులోకి తెచ్చుకున్నారు.

కంబాలా
కర్నాటక గేదెల ఆట కంబాలా. దక్షిణ కన్నడ ప్రాంతంలో రైతులు ఆడతారు ఇది. సాధారణంగా గేదెలు ఎక్కువ వేగంగా పరిగెత్తవు. కాని కంబాలాలో గేదెలు 12 సెకండ్లలో 100 మీటర్లు పరిగెడతాయి. ఒక గేదెల జతను కట్టేస్తారు. వాటిని కర్రతో కొట్టి వదిలేస్తారు. మట్టి దారి ఉంటుంది. రెండిటిలో ఏది ముందుగా పరిగెడితే అది గెలిచినట్టు. రేసింగ్ దారి 120 నుంచి 160 మీటర్ల పొడవు, 8 నుంచి 12 మీటర్ల వెడల్పు ఉంటుంది. దారంతా బురదతో కూడుకుని ఉంటుంది. ఈ ఆట రాత్రంతా జరుగుతుంది. పెద్ద ఎత్తున జనం పోగయి ఈ ఆటను ఆనందిస్తారు. ఈ ఆటను శివుని కొడుకైన మంజునాథ దేవుడికి అంకితం ఇస్తారు. ఈ ఆటను రాజకుటుంబాల ఆటగా(రాయల్ స్పోర్ట్) చెప్తారు. గెలిచిన గేదెకి బంగారు మెడల్, ట్రోఫీలు ఇస్తారు. ఈ ఆటను 2014 లో సుప్రీమ్ కోర్టు బ్యాన్ చేసింది. కాని ఇప్పుడు జల్లికట్టు కోసం తమిళనాడు ఉద్యమం లేవదీసింది. కోర్టు జల్లికట్టు మీద ఉన్న బ్యాన్ మీద స్టే విధించింది. కాని అందులో కంబాలా గురించి ఏం చెప్పలేదు. అందుకే వీరు ఆందోళన చేస్తున్నారు. ఇంకో హియరింగ్ జనవరి 30న ఉంది కాబట్టి వేచి ఉన్నారు.

గ్రే హౌండ్ కుక్కల రేసింగ్
ఈ రేసింగ్ రెండు రకాలుగా జరుగుతుంది. ఒకటి ట్రాక్ రేసింగ్. దాన్లో వాటికి కుందేలు లాటి జంతువు ఆశ చూపి పరిగెత్తిస్తారు. ఇంకోటి పూర్తిగా గ్యాంబ్లింగ్. చుట్టూతా పబ్లిక్ పోగయి ఉంటారు. చాలా దేశాల్లో ఈ రేసింగ్ వినోదం కోసం జరుగుతుంది. కాని ఆస్ట్రేలియా, ఐర్లాండ్, మాకావు, మెక్సికో, స్పెయిన్, యుకె, అమెరికాల్లో ఇది జూద పరిశ్రమ. 2016లో ఆస్ట్రేలియా ప్రభుత్వం ఈ ఆటను బ్యాన్ చేసింది. గ్రేహౌండ్ కుక్కలు నాలుగు నుంచి ఆరేళ్ల వరకు రేసులో పాల్గొనగలవు. రిటైర్ అయిన కుక్కలను ఇళ్లలో పెంపకానికి ఉంచుకుంటారు. అమెరికాలో ఏడాదికి 12000 రిటైర్ అయిన గ్రేహౌండ్స్ కుక్కలను చంపుతారు. ఈ ఆట 1980 నుంచి వివాదాస్పదంగానే ఉంది. జంతు సంరక్షణ సంస్థలు గొడవ చేస్తూనే ఉన్నాయి.

ఫాక్స్ హంటింగ్
నక్కలు ట్రాక్ మీద పరిగెడుతుంటే వాటి వెనక గుర్రాల మీద వెంబడించి వాటిని వేటాడి చంపే ఆట ఇంగ్లండుది. 2005 వరకు జరిగింది. తర్వాత ఈ ఆటను చట్టవిరుద్ధం చేశారు. స్కాట్‌లాండ్‌లో 2002లో బ్యాన్ చేశారు. నార్త్ ఐర్లండ్‌లో, ఆస్ట్రేలియా, కెనడా, ఫ్రాన్స్, ఇటలీ, అమెరికాల్లో ఇది చట్టబద్ధమైన ఆటగానే ఉంది. యుకెలో ఈ ఆట వివాదాస్పదం.

పీజియన్ షూటింగ్
మొనాకో, ఇంకా హవానాలో జరిగే పక్షి రెక్కను కాల్చే ఒక రకమైన పోటీ ఇది. వాస్తవానికి ప్రపంచంలో చాలాచోట్ల ఈ ఆట జరగుతుంది. పావురాన్ని పంజరంలో పెట్టి కాల్చడం ఒకవిధం. షూటర్ రెడీగా ఉన్నప్పుడు పంజరంలో పెట్టిన పావురం కోసం పంజరం తలుపు దానంతట అది తెరుచుకునేట్టు చేస్తారు. దాంతో పావురం బయటకు వస్తుంది. అప్పుడు కాలుస్తారు. విడిగా పావురం రెక్కలను కాల్చడం ఇంకో విధం. దాన్ని కొలంబెయిర్ అంటారు.ఆ పద్ధతిలో ఒక వ్యక్తి పావురాన్ని పైకెగరేస్తాడు. అప్పుడు కాలుస్తారు. ఈ ఆట కూడా జూదమే. ఈ ఆటలో గెలిచిన వారికి 50,000 అమెరికన్ డాలర్లు బహుమానంగా ఇస్తారు.

జల్లికట్టు: తమిళనాడులో సంక్రాంతి సంబరాల్లో భాగంగా జల్లికట్టును నిర్వహిస్తారు. కంగాయమ్ అనే జాతి ఎద్దును జనంలోకి విడుస్తారు. ఆ ఎద్దులను మచ్చిక చేసుకోవడానికి యువత ప్రయత్నిస్తారు. కొమ్ములు పట్టుకుని దాని దూకుడు ఆపాలని ప్రయత్నిస్తారు. ఒక్కోసారి ఎద్దు కొమ్ములతో పొడిచేస్తుంది. ప్రాణాలు పోయే ప్రమాదం చాలా సాధారణం. మధురైకి దగ్గరలో అలంగనల్లూరు దగ్గర పోటీలు ముఖ్యమైనవి. ఈ ఆటకు 3500 ఏళ్ల చరిత్ర ఉంది. జల్లికట్టులో విజేతలైన యువకులను అమ్మాయిలు భర్తలుగా ఎంచుకునేవారట. 

కోడి పందాలు: కోడి పందాలకు 6000 ఏళ్ల చరిత్ర ఉంది. మొదటగా పర్షియాలో జరిగాయి. క్యూబాలో కోడి పందాలు చాలా ఎక్కువగా జరుగుతాయి. వందేళ్ల నుంచి మెక్సికన్లు కోడి పందేలు ఆడుతున్నారు. పెరూలో ఇసుక నేల మీద కోడి పందేలు నిర్వహిస్తారు.  బ్రెజిల్‌లో 1934 లో కోడిపందేలను నిషేధించారు. తెలుగుదేశంలో కేతన కవి, నారాయణ కవి కోడి పందేల గురించి రాశారు. తూర్పు గోదావరి జిల్లాల్లో కోడిపందేలు విరివిగా ఆడతారు. డేగ, కాకి, నెమలి, పర్ల, చవల, సేతువ, కొక్కిరాయి, పచ్చకాకి, రసంగి, కౌజు, మైల, ఎరుపు గౌడు, తెలుపు గౌడు అనే రకాల పందెం కోళ్లు ఉంటాయి. పందాలు నాలుగు రకాలుగా ఉంటాయి. ఎత్తుడు దించుడు పందెం, చూపుడు పందెం, ముసుగు పందెం, డింకీ పందెం. ఎత్తుడు దింపుడు పందాలకు గిరాకీ ఎక్కువ.