Home జాతీయ వార్తలు మాకు మిషెల్‌,ఖత్రోచీ మామల్లేరు

మాకు మిషెల్‌,ఖత్రోచీ మామల్లేరు

PM Modi arrives at Sonia Gandhi constituency Raebareli

రాయ్‌బరేలీ : తమకు ఖత్రోచీ మామలు, క్రిస్టియన్ మిషెల్‌ల అవసరం లేదని ప్రధాని నరేంద్ర మోడీ చెప్పారు. యుపిలో సోనియా గాంధీ సొంత నియోజకరవర్గం రాయ్‌బరేలీలో ఆదివారం ఆయన సుడిగాలి పర్యటన జరిపారు. ఈ సందర్భంగా గత కాంగ్రెస్ ప్రభుత్వాల హయాంలో కుదిరిన రక్షణ ఒప్పందాలపై విరుచుకుపడ్డారు. బిజెపి ప్రభుత్వపు రక్షణ ఒప్పందాలలో దళారీలు, మధ్యవర్తుల ప్రమేయం లేదని స్పష్టం చేశారు. వీటిలో ఖత్రోచీ మామలు, మిషెల్‌ల ప్రమేయం లేదన్నారు. దీనితో కాంగ్రెస్ వారు ఉడుక్కుంటున్నారు. వారికి నిద్రపట్టడం లేదు. ఇక చేసేది లేక నిస్పృహతో అబద్ధాలకు దిగుతున్నారని విమర్శించారు. వారికి నిజాలు చెప్పే ధైర్యం లేదు. మంచి గ్రహించే స్థాయి లేదన్నారు. రాఫెల్‌పై సుప్రీంకోర్టు తీర్పును ఈ సందర్భంగా ప్రధాని ప్రస్తావించారు. కాంగ్రెస్ నేతలకు చివరికి న్యాయవ్యవస్థపై కూడా నమ్మకం లేదని, న్యాయవ్యవస్థ పట్ల అపనమ్మకాలు కల్గించే పరిస్థితిని తీసుకువస్తున్నారని మండిపడ్డారు. రాఫెల్ డీల్‌పై సుప్రీంకోర్టు తీర్పు తరువాత దీనిపై ప్రధాని బహిరంగ స్పందన ఇదే. అంతేకాకుండా మూడు రాష్ట్రాలలో బిజెపి పరాజయం తరువాత సోనియా గాంధీ సొంత నియోజకవర్గాన్ని ఎంచుకుని బహిరంగ సభలో పాల్గొనడం కూడా ఇదే మొదటిసారి. ఈ సందర్భంగా ఆయన రక్షణ రంగంలో ఒప్పందాలను గతంతో ఇప్పటితో పోలుస్తూ మాట్లాడారు.

దేశ రక్షణ బలగాలు పటిష్టం కావడం, వారికి సాధనాసంపత్తి సమకూరడం ఇష్టం లేని శక్తులతో కాంగ్రెస్ పార్టీ కుమ్మక్కు అవుతోందని తీవ్రస్థాయిలో ఆరోపించారు. దేశం ముందు రెండు విభిన్న కోణాలు ఆవిష్కృతమయ్యాయి. ఓ వైపు ప్రభుత్వ ం అన్ని స్థాయిలలో సైనిక బలగాలను పటిష్టం చేసేందుకు అన్నివిధాలుగా ప్రయత్నిస్తోంది. మరో వైపు దుష్ట శక్తులు కొన్ని దేశాన్ని అన్ని కోణాల నుంచి దెబ్బతీసే విధంగా వ్యవహరిస్తున్నాయని తెలిపారు. ప్రజలు అన్నింటినీ గమనిస్తూ ఉన్నారని, ప్రత్యేకించి దేశాన్ని దెబ్బతీసే దుష్టశక్తులకు కాంగ్రెస్ సహకరిస్తున్న వైనాన్ని గ్రహిస్తున్నారని ఆయన అన్నారు. దేశాన్ని ఏదో విధంగా దెబ్బతీయాలని కొన్ని శక్తులు యత్నిస్తున్నాయని తెలిపారు. ప్రధాని మోడీ తమ ప్రసంగంలో రామచరిత మానస్‌లోని ద్విపదలను ప్రస్తావించారు. కొందరు ఝాటా మాటలనే నమ్ముతారు. వాటినే ఇతరులకు అంటగడుతూ ఉంటారనే నైజాన్ని తెలిపారు. ప్రభుత్వంపై విమర్శలకు దిగుతున్న వారికి రక్షణ మంత్రిత్వశాఖ, రక్షణ మంత్రి, భారతీయ వైమానిక దళాధికారులు , ఫ్రాన్స్ ప్రభుత్వం వంటి వారిపై నమ్మకం లేదు.

వీరిని వారు అబద్ధాల పుట్టలుగా భావిస్తారు. చివరికి ఈ భావన తప్పని ఇప్పుడు అత్యున్నత న్యాయస్థానం రాఫెల్ విషయంలో తేల్చేసిందని, అయినా ఈ తీర్పు కూడా వారి దృష్టిలో ఒక అబద్ధంగా తోస్తోందని వ్యాఖ్యానించారు. ప్రధాని మోడీ 50 నిమిషాల ప్రసంగంలో దాదాపు అరగంట సేపు కేవలం రాఫెల్ డీల్‌పైనే మాట్లాడారు. గత రక్షణ ఒప్పందాలు అవినీతి కళంకితాలు అని , ఇందుకు పలు ఉదాహరణలు ఉన్నాయని, ఇటువంటి ఒప్పందాలకు సంబంధించి కాం గ్రెస్ వారి వ్యవహారాలన్నీ ఖత్రోచీ మామల సొంతం బాపతుగా మారాయని చమత్కరించారు. రాజీవ్ గాంధీ ప్రభు త్వ హయాంలో తలెత్తిన బోఫోర్స్ కుంభకోణంలో ఖత్రో చీ మధ్యవర్తిగా ఉన్నారని, అధికారంలోని వారికి భారీస్థాయి ముడుపులు ముట్టినట్లుగా అభియోగాలు ఉ న్నా యి. నిందితులను రక్షించేందుకు లాయర్లను కోర్టుకు పం పించిన ఘనత కాంగ్రెస్ వారిదే అన్నారు. ఏ వ్యవస్థపైనా కాంగ్రెస్‌కు నమ్మకం లేదని, చివరికి అంతా సవ్యం గా ఉందని తెలియచేసిన న్యాయవ్యవస్థను అపనమ్మకాల పాలు చేసే యత్నాలకు దిగుతున్నారని విమర్శించారు.
దేశానికి ఆధునిక యుద్ధ విమానాలు అవసరం
కార్గిల్ ఘర్షణ తరువాత దేశానికి భద్రతాపరంగా అనివార్యంగా అధునాతన యుద్ధ విమానాల అవసరం ఏర్పడింది. కాంగ్రెస్ వారు పది సంవత్సరాలు పాలించినా ఈ దశలోనూ ఎయిర్‌ఫోర్స్ పాటవం పెంచుకునేందుకు అనుమతి ఇవ్వలేదని ప్రధాని మోడీ విమర్శించారు. ఈ విధంగా కాంగ్రెస్ పాలకులు ఎందుకు వ్యవహరించారు? ఎవరి ఒత్తిడితో ఈ విధంగా చేశారనేది తేలాల్సి ఉందన్నారు. జవాన్లకు కనీసం బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ల అవసరాన్ని తీర్చేందుకు కూడా కాంగ్రెస్ ప్రభుత్వాలు ముందుకు రాలేదని, 2009లో భారతీయ సైనికాధికారులు బలగాలకు 1.86 లక్షల ఈ రక్షణ కవచాల అవసరాన్ని ప్రభుత్వానికి తెలియచేశాయి. అయితే ఐదేళ్ల యుపిఎ 2 పాలనలో వీటిని కొనుగోలు చేయలేదని గుర్తు చేశారు. దేశంలో వ్యవసాయ సంక్షోభానికి కాంగ్రెస్ పార్టీ విధానాలే కారణం అని ప్రధాని మోడీ విమర్శించారు. కాంగ్రెస్ సుదీర్ఘకాలం అధికారంలో కొనసాగినా స్వామినాథన్ కమిటీ నివేదికను అమలు చేయలేదని, రైతాంగం గోడును పట్టించుకోలేదని పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ జవాన్ల గురించి కానీ రైతుల గురించి కానీ ఏనాడూ పట్టించుకోలేదని అన్నారు. స్వామినాథన్ నివేదికను ఎందుకు అమలు చేయలేదనే ప్రశ్నకు కాంగ్రెస్ వద్ద సరైన సమాధానం లేదన్నారు.

PM Modi arrives at Sonia Gandhi constituency Raebareli