Home తాజా వార్తలు ప్రధాని నరేంద్రమోదీ వరంగల్‌కు రాక?

ప్రధాని నరేంద్రమోదీ వరంగల్‌కు రాక?

MODIఫిబ్రవరి 13న వచ్చే అవకాశం?
పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు

వరంగల్ ప్రతినిధి : ప్రధాన మంత్రి నరేంద్రమోదీ వచ్చే నెలలో జిల్లాలో పర్యటించనున్నట్లు సమాచారం. ప్రధాని పర్యటనకు సంబంధించి అధికారికంగా ఇంకా ఖరారుకానప్పటికీ వచ్చే నెల 13వ తేదీన జిల్లాకు రానున్నట్లు డిప్యూటీ సిఎం కడియం శ్రీహరి బుధవారం హైదరాబాద్‌లో మేడారం జాతర పోస్టర్ ఆవిష్కరణ సందర్భంగా వెల్లడించినట్లు తెలిసింది. ప్రధాని పర్యటనలో జిల్లాలో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన టెక్స్‌టైల్ పార్కు, కాళోజీ హెల్త్ యూనివర్సిటీ, ట్రైబల్ యూనివర్సిటీలకు శంకుస్థాపన చేయనున్నట్లు సమాచారం. ఈ సమయంలో తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకొని అమలు చేస్తున్న మిషన్ కాకతీయ పథకంలో భాగంగా నిర్మించిన పైలాన్ ఆవిష్కరించే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఇప్పటికే ఈ పైలాన్ ఏడాది కాలంగా ఆవిష్కరణకు నోచుకోలేదు. ఆఘమేఘాల మీద ఈ పైలాన్ నిర్మించినప్పటికీ ఆవిష్కరణకు నోచుకోకపోవడం పట్ల విమర్శలు వెల్లువెత్తుతున్న విషయం తెలిసిందే. రాష్ట్రంలో అమలు చేస్తున్న పథకాలకు కేంద్రం నుంచి నిధులు ఆశిస్తున్న నేపథ్యంలో ప్రాముఖ్యత ఉన్న ఈ ప్రాజెక్టులను మోదీ చేతుల మీదుగా ప్రారంభింప చేయడం వల్ల సానుకూల ఫలితాలొస్తాయని భావిస్తున్నట్లు సమాచారం. ఇదిలా ఉండగా ఈ నెల మొదటి వారంలో సిఎం కెసిఆర్ జిల్లాలో మూడు రోజుల పాటు పర్యటించి ఈ పథకాలకు సంబంధించిన పురోగతిని సమీక్షించారు. వచ్చే నెలలో స్వయంగా తాను హాజరై ఈ పథకాలకు శంకుస్థాపన చేస్తానని హామీ సైతం ఇచ్చారు. త్వరలో గ్రేటర్ వరంగల్ ఎన్నికలు రానున్న నేపథ్యంలో, సిఎం హామీ ఇచ్చిన మేరకు వచ్చే నెల రెండవ వారంలో ఆయన పర్యటన తప్పకుండా ఉంటుందనే అంచనాతో ఉన్నారు. ఈ నేపథ్యంలో ఈ కార్యక్రమానికి ప్రధాని హాజరయ్యే అవకాశాలున్నట్లు భావిస్తున్నారు. వచ్చే నెల 17వ తేదీ నుంచి జిల్లాలో మేడారం జాతర ఉన్నందున తదుపరి వీలుకాకపోవచ్చు. మార్చి లేదా ఏప్రిల్‌లో ఎన్నికలు నిర్వహించే అవకాశం ఉన్నందున ఫిబ్రవరి రెండవ వారంలో ఈ కార్యక్రమాలకు శంకుస్థాపన చేసే అవకాశం ఉందని భావిస్తున్నారు. ప్రధాని జిల్లాలో పర్యటిస్తే మరి కొన్ని వరాలు వచ్చే అవకాశం లేకపోలేదంటున్నారు.