Home జాతీయ వార్తలు గత పాలకుల పాపం ప్రాజెక్టులకు శాపం

గత పాలకుల పాపం ప్రాజెక్టులకు శాపం

యుపి సభలో ప్రధాని విమర్శలు

Shedding Crocodile Tears for Farmers said by Modi

మీర్జాపూర్ : గత ప్రభుత్వాలు ప్రజలను పట్టించుకోలేదని, అభివృద్ధి పనులను సకాలంలో పూర్తి చేయలేదని ప్రధాని నరేంద్ర మోడీ విమర్శించారు. ఉత్తరప్రదేశ్‌లో రెండు రోజుల పర్యటనకు వచ్చిన ప్రధాని ఆదివారం ఇక్కడ ఒక సభలో మాట్లాడారు. అప్పటి ప్రభుత్వాల నిర్వాకంతో ప్రజల సమస్యలు అపరిష్కృతంగా మిగిలిపోయినట్లు తెలిపారు. నిర్ణీత సమయంలో పథకాల అమలు జరగకపోవడంతో వెనుకబాటుతనం వీడకుండా ఉందన్నారు. మీర్జాపూర్ వైద్య కళాశాలకు శంకుస్థాపన తరువాత జరిగిన బహిరంగ సభలో ప్రధాని మాట్లాడారు. ఇప్పుడు ప్రతిపక్షాలు రైతాంగం పట్ల మొసలి కన్నీళ్లు పెడుతున్నాయని, అయితే వారు అధికారంలో ఉన్నప్పుడు సాగునీటి పథకాలను ఎందుకు అసంపూర్తిగా ఉంచారని నిలదీశారు. ప్రతిపక్షాలు అధికారంలో ఉన్న కాలంలో దేశవ్యాప్తంగా ఇరిగేషన్ ప్రాజెక్టులు అడుగు ముందుకు పడకుండా ఉన్నాయని ఆరోపించారు. రైతుల ప్రస్తుత దుస్థితికి సాగునీటి పథకాలు సకాలంలో పూర్తి కాకపోవడమే కారణం అన్నారు.

గత రెండు రోజులుగా తనకు రాష్ట్రంలో పలు అభివృద్ధి ప్రాజెక్టుల ప్రారంభోత్సవాలకు అవకాశం దక్కిందని, వీటిని ప్రజలకు అంకితం చేయడం సంతోషకర పరిణామం అని తెలిపారు. కొన్ని ప్రాజెక్టులు పూర్తయ్యాయి. కొన్నింటిని ప్రవేశపెట్టామని, కొన్ని శంకుస్థాపనలు, కొన్ని ఆవిష్కరణలు జరిగాయని వివరించారు. ప్రతిపక్షాలు అధికారంలో ఉన్నప్పుడు సకాలంలో ప్రాజెక్టులను పూర్తి చేయలేకపోవడం ప్రజల పట్ల వాటికున్న నిర్లక్ష్యానికి అద్దం పడుతుందని తెలిపారు. బన్సాగర్ కాలువ నిర్మాణం ప్రతిష్టాత్మక పథకం అని, దీనివల్ల ఈ ప్రాంతంలో సాగుకు ఎంతో మేలు జరుగుతుందన్నారు. ఈ ప్రాజెక్టు ఇప్పటిది కాదని, దీనిని ఎప్పుడో పూర్తి చేయాల్సి ఉందని, అయితే గత పాలకులు పట్టించుకోకపోవడంతో రెండు దశాబ్దాల క్రితమే పూర్తి కావల్సిన ప్రాజెక్టు ఇంకా పెండింగ్‌లో ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. యుపిలో బిజెపి ప్రభుత్వాన్ని ప్రధాని ప్రశంసించారు. యోగి ఆదిత్యానాథ్ సిఎం అయిన తరువాత యుపి తూర్పు ప్రాంతానికి ఇతోధిక ప్రాధాన్యత ఇవ్వడం జరిగిందని, దీనితో ఈ ప్రాంతం సర్వతోముఖాభివృద్ధికి వీలేర్పడిందని కొనియాడారు.