Home బిజినెస్ 20న ఆర్థిక శాఖ కార్యదర్శులతో ప్రధాని భేటీ

20న ఆర్థిక శాఖ కార్యదర్శులతో ప్రధాని భేటీ

Narendra-Modi

న్యూఢిల్లీ: వచ్చే నెల కేంద్ర బడ్జెట్‌ను సమర్పించనున్న నేపథ్యంలో దేశ వృద్ధి రేటును పెంచడంతో పాటు ఉపాధి కల్పనను మరింత పెంచడానికి అవసరమైన రోడ్‌మ్యాప్‌ను రూపొందించడంపై చర్చించడం కోసం ప్రధాని నరేంద్ర మోడీ ఈ నెల 20న ఆర్థిక శాఖ కింద పని చేసే ఐదు విభాగాల కార్యదర్శులతో ఈ నెల 20న సమావేశం కానున్నట్లు అధికార వర్గాలు తెలియజేశాయి. ఈ భేటీ కారణంగా ఆ రోజు జరగాల్సిన జిఎస్‌టి కౌన్సిల్ సమావేశాన్ని మరుసటి రోజుకు వాయిదా వేయాల్సి వచ్చింది. ఈ సమావేశంలో కౌన్సిల్ భారీ సంస్థలకోసం ఎలక్ట్రానిక్ ఇన్‌వాయిస్ సదుపాయాన్ని ప్రవేశపెట్టడం లాంటి పలు నిర్ణయాలను తీసుకునే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇదే కాకుండా జాతీయ యాంటీ ప్రాఫిటీరింగ్ అథారిటీ రెండేళ్ల కాలపరిమితిని పొడిగించడంపై కూడా కొత్త ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అధ్యక్షతన జరిగే ఈ సమావేశంలో నిర్ణయం తీసుకోవచ్చని భావిస్తున్నారు.

ఈ అథారిటీ రెండేళ్ల గడువు ఈ నవంబర్‌తో ముగుస్తుంది. 201819 ఆర్థిక సంవత్సరంలో దేశ జిడిపి వృద్ధి అయిదేళ్ల కనిష్ట స్థాయి అయిన 6.8 శాతానికి పడిపోవడం తెలిసిందే. లోక్‌సభ ఎన్నికల సందర్భంగా ప్రజలకు ఎన్నో హామీలతో రెండోసారి తిరిగి అధికారంలోకి వచ్చిన మోడీ నేతృత్వంలోని ఎన్‌డిఎ ప్రభుత్వానికి ఇది ఎంతో ఆందోళన కలిగిస్తోంది. అదే సమయంలో దేశంలో నిరుద్యోగిత కూడా గతంలో ఎన్నడూ లేనంతగా పెరిగినట్లు ప్రభుత్వ అధీనంలోని గణాంకాల ఏజన్సీ ప్రకటించడం తెలిసిందే. ఈ నేపథ్యంలో నూతన ఆర్థిక మంత్రిగా బాధ్యతుల చేపట్టిన నిర్మలా సీతారామన్ వచ్చే నెల 5న లోక్‌సభలో పూర్తి స్థాయి బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్న విషయం తెలిసింది. ఆర్థిక శాఖ అధికారులు ఈ బడ్జెట్‌కు తుది మెరుగులు దిద్దబోయే తరుణంలో ప్రధాని ఆర్థిక శాఖకు చెందిన కార్యదర్శులందరితోను సమావేశం కావడం ప్రాధాన్యతను సంతరించుకుంది.

PM Modi likely to meet finance ministry officials on June 20