Home జాతీయ వార్తలు అర్బన్ నక్సల్ కు కాంగ్రెస్ అండ

అర్బన్ నక్సల్ కు కాంగ్రెస్ అండ

PM Modi Questions Congress Support For Urban Maoists

జగదల్పూరు : కాంగ్రెస్ పార్టీ అర్బన్ మావోయిస్టులకు మద్దతు ఇస్తోందని ప్రధాని నరేంద్ర మోడీ ఆరోపించారు. ఛత్తీస్‌గఢ్ ఎన్నికల సభలో శుక్రవారం ఆయన ఈ తీవ్ర విమర్శలకు దిగారు. అర్బన్ మావోయిస్టులకు కాంగ్రెస్ సహకరిస్తోందని, ఈ అర్బన్ మావోయిస్టులు తమ కార్యకలాపాలతో పేద ఆదివాసీ యువత జీవితాలను ఛిన్నాభిన్నం చేస్తున్నారని నిందించారు. ఛత్తీస్‌గఢ్ అసెంబ్లీ ఎన్నికల తొలి ప్రచారసభలో ఆయన ఇక్కడ పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ వారు ఆదివాసీల జీవితాలతో ఆడుకుంటున్నారని విమర్శించారు. ఈ కాంగ్రెస్ పార్టీ ఎందుకు ఈ విధంగా వ్యవహరిస్తుందో అర్థం కావడం లేదు. వారికి ఆదివాసీలంటే ఎగతాళిగా ఉంది. తాను ఈశాన్య భారతంలో ఒక సభకు వెళ్లాను. అక్కడి సాంప్రదాయ రీతిలో ఆదివాసీల తలపాగా ధరించాను. అయితే కాంగ్రెస్ వారు దీనిని అపహాస్యం చేశారని మోడీ విమర్శించారు. ఈ విధంగా చేయడం ఆదివాసీ సంస్కృతిని అవమానించడం కాదా? అని ప్రశ్నించారు. కాంగ్రెస్ ధోరణి ఏ విధంగా ఉంటుందనేది ఇటువంటి పలు ఉదాహరణలతో తెలుసుకోవచ్చునన్నారు.

సుభిక్ష ఛత్తీస్‌గఢ్ మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి కల అని, దీనిని నిజం చేసేంతవరకూ తాను విశ్రమించేదిలేదని ప్రధాని హామీ ఇచ్చారు. నక్సల్స్ ప్రభావిత బస్తర్ ప్రాంత అభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వాలు ఏమీ చేయలేదని ప్రధాని విమర్శించారు. తరచూ వారు నక్సల్స్ సమస్యతో తాము ఏమీ చేయలేకపొయ్యామని చెప్పడం ఆనవాయితీగా పెట్టుకున్నారని, ఈ విధంగా సాకులు చెప్పి బాధ్యతను విస్మరించడం కాంగ్రెస్‌కు వెన్న తో పెట్టిన విద్య అని విమర్శించారు. అడవులలో ఉండే క్షేత్రస్థాయి నక్సలైట్లకు పట్టణాలలోప్రచారకర్తలుగా వ్యవహరించే మావోయిస్టులు అర్బన్ మావోయిస్టులుగా చలామణి అవుతున్నారని, వారు నగరాలలో ఎసి నివాసాలలో ఉంటూ, శుభ్రంగా కన్పిస్తూ ఉంటారని, వారి పిల్లలు విదేశాలలో చదువుతూ ఉంటారని, అయితే నక్సల్స్ ప్రభావిత ప్రాంతాలలోని ఆదివాసీ పిల్లలపై రిమోట్ కంట్రోలుకు పాల్పడుతూ ఉంటారని ఆరోపించారు. ఇటువంటి మావోయిస్టులకు కాంగ్రెస్ ఎందుకు మద్దతు ఇస్తోందని తాను ప్రశ్నిస్తున్నానని, ఇటువంటి వారిపై ప్రభుత్వం చర్యలకు దిగితే, బస్తర్‌కు వచ్చి నక్సలిజానికి వ్యతిరేకంగా మాట్లాడితే కాంగ్రెస్ వారు ఎందుకు గోల చేస్తుంటారని నిలదీశారు.
నక్సల్స్ దుష్టబుద్థి రాక్షసులు
పేదల బతుకులను అతలాకుతలం చేస్తున్న నక్సలైట్లకు మానవత లేదని, వారు వక్రబుద్ధి రాకాసురులు అని తీవ్రస్థాయి ఆరోపణలకు దిగారు. కాంగ్రెస్ ప్రభుత్వాలు చాలా కాలం పెత్తనం సాగించాయని, అయితే బస్తర్ వెనుకబాటుతనం రూపుమాపేందుకు వారు ఏమీ చేయలేకపొయ్యారని ప్రధాని విమర్శించారు. బతుకులను దెబ్బతీసిన వారిని క్షమిస్తారా? అని తాను ప్రజలను ప్రశ్నిస్తున్నానని చెప్పారు. కుటిలులు ఎప్పుడూ ఛత్తీస్‌గఢ్‌లో గెలవలేరని, బస్తర్ ప్రాంతంలోని అన్ని స్థానాలలో బిజెపివిజయం సాధించేలా ఓటర్లు స్పందించాలని తాను విజ్ఞప్తి చేస్తున్నానని చెప్పారు. ఈ ప్రాంతంలో బిజెపి కాకుండా ఇతరులెవ్వరైనా గెలిస్తే అది బస్తర్ కలలను కల్లలు చేస్తుందని స్ప ష్టం చేశారు. బస్తర్ ప్రాంతాన్ని తాను తప్ప ఏ ఇతర ప్రధా ని సందర్శించలేదని, కేవలం ఉత్తి చేతులతో రాలేదని, పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రకటించి వెళ్లానని తెలిపారు. ఈ ప్రాంతంలో నిరుద్యోగం, ఆకలి, పేదరికం నిర్మూ లనకు తాము కష్టపడి పనిచేస్తున్నామని చెప్పారు. రెండో తుది విడత ఈ నెల 20న నిర్వహిస్తారు. 90 మంది సభ్యుల రాష్ట్ర అసెంబ్లీలో మరోసారి బిజెపికి పట్టం కోసం తొలి విడత ప్రచారం శనివారంతో ముగుస్తుంది. ఎన్నికల సభకు ముందు ప్రధాని మోడీ దూరదర్శన్ కెమెరామెన్ అచ్యుతానంద్ సాహుకు నివాళులు అర్పించారు. దంతేవాడ జిల్లాలో నక్సలైట్ల దాడిలో విధుల నిర్వహణకు వెళ్లిన కెమెరామెన్, ఇద్దరు జవాన్లు మృతి చెందారు.

PM Modi Questions Congress Support For Urban Maoists

Telangana News