Home జాతీయ వార్తలు నాలుగో పారిశ్రామిక విప్లవం

నాలుగో పారిశ్రామిక విప్లవం

 Pm modi says fourth industrial revolution

ఉద్యోగ స్థితిగతులను మార్చి వేస్తుంది, ప్రధాని మోడీ వెల్లడి, 4వ ఐఆర్ కేంద్రం ప్రారంభోత్సవం

న్యూఢిల్లీ : సాంకేతిక ప్రగతితో  ఉద్యోగావకాశాలు దెబ్బతింటాయనే భయాందోళనలు తగవని ప్రధాని నరేంద్ర మోడీ చెప్పారు. దేశంలో 4వ పారిశ్రామిక విప్లవం ఉద్యోగ స్థితిని మార్చివేస్తుందని, అత్యధిక అవకాశాలు కల్పిస్తుందని ప్రధాని భరోసా ఇచ్చారు. గురువారం ఆయన ఇక్కడ ఫోర్త్ ఇండస్ట్రియల్ రెవల్యూషన్ కేంద్రాన్ని ప్రారంభించిన సందర్భంగా మాట్లాడారు. సరికొత్త పారిశ్రామిక విప్లవంతో ప్రయోజనాలు చేకూరే విధంగా విధాన మార్పులకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. భారతదేశం పరిశోధనా ఆచరణల అంతర్జాతీయ వేదిక అయ్యేందుకు అన్ని అవకాశాలు ఉన్నాయని ఆశాభావం వ్యక్తం చేశారు. మన వైవిధ్యత, జనాభాపరమైన సామర్థత, శరవేగపు మార్కెట్ స్థాయి, డిజిటల్ మౌలిక వ్యవస్థ ఇవన్నీ కూడా భారత్‌కు పెట్టని కోటలుగా ఉంటాయని అన్నారు. ఇంతకు ముందటి పారిశ్రామిక విప్లవాలు దేశంతో సంబంధం లేకుండా సాగాయని అన్నారు. అయితే ఇన్‌ఫర్మేషన్ టెక్నాలజీ, ప్రతిభాయుత, సృజనాత్మకతల మేళవింపుల యువశక్తి బలీయంగా ఉన్న భారతదేశం 4వ పారిశ్రామిక విప్లవానికి అత్యద్భుత తోడ్పాటును అందిస్తుందని తెలిపారు.

తొలి, ద్వితీయ పారిశ్రామిక విప్లవాల దశలో భారతదేశం స్వాతంత్య్ర దేశంగా లేదని, ఇక మూడవ పారిశ్రామిక విప్లవం సంభవించినప్పుడు భారతదేశం పలు సవాళ్లతో కొట్టుమిట్టాడిందని గుర్తు చేశారు. అప్పుడప్పుడే సంతరించుకున్న స్వాతంత్య్రంతో తలెత్తిన సవాళ్లు కోకొల్లలుగా నిలిచాయని అన్నారు. మారుతున్న కాలంలతో పాటు భారతదేశం సరికొత్త శక్తిని సంతరించుకుందని తెలిపారు. కృత్రిమ మేధస్సు, కంప్యూటర్లపై పట్టు, విషయపరిజ్ఞానం,డిజిటల్ పరిజ్ఞానం వినిమయపు బ్లాక్‌ఛెయిన్ టెక్నాలజీ, సమాచార భద్రతకు సంబంధించిన బిగ్‌డాటా సామర్థం వంటివి భారతదేశాన్ని అత్యున్నత శిఖరాల వైపు తీసుకువెళ్లాయని ప్రధాని తెలిపారు. ప్రధాని మోడీ ఈ సందర్భంగా తమ ప్రభుత్వం సాధించిన విజయాలను తెలిపారు. దేశంలో దాదాపు 50 కోట్ల మంది భారతీయులు మొబైల్ ఫోన్లు వాడుతున్నారని, ఈ విధంగా దేశ టెలీఫోన్ల సామర్థం 93 శాతానికి పెరిగిందని తెలిపారు. ప్రపంచంలోనే అతి పెద్ద మొబైల్ డాటా వినిమయ దేశంగా ఇప్పుడు భారతదేశం నిలిచిందని, అంతేకాకుండా అతి తక్కువ డాటా ఛార్జీలు ఉన్నాయని, కేవలం నాలుగేళ్లలోనే మొబైల్ డాటా వినిమయం 30 శాం పెరిగిందని తెలిపారు. 120 మంది భారతీయులకు ఆధార్ కార్డులు ఉన్నాయని, దేశవ్యాప్తంగా రెండున్నర లక్షల గ్రామ పంచాయతీలను ఆప్టిక్ ఫైబర్‌తో అనుసంధానం చేసే ప్రక్రియ త్వరలోనే పూర్తవుతుందని ప్రకటించారు. 2014లో కేవలం 59 గ్రామ పంచాయతీలకే ఆప్టిక్ ఫైబర్ సౌకర్యం ఉండేదని, అది ఇప్పుడు లక్షకు పైగా పంచాయతీలకు విస్తరించిందని తెలిపారు. వైవిధ్యభరిత సాంకేతికతల మధ్య సరైన సమన్వయ దశలో నాలుగో ఇండస్ట్రీయల్ రెవల్యూషన్ ఘట్టం ఆవిష్కృతం అవుతోందని ప్రధాని తెలిపారు. శాన్ ఫ్రాన్సిస్కో, టోక్యో, బీజింగ్‌లు అపరిమిత భవిష్య అవకాశాలకు ద్వారాలు తెరిచిన దశలో భారతదేశం పారిశ్రామిక విప్లవం దిశలో ఒక వేదికను ఏర్పాటు చేస్తోందని, దీని ద్వారా ఉద్యోగ ఉపాధి అవకాశాలకు మార్గం ఏర్పడుతుందని తెలిపారు.

Pm modi says fourth industrial revolution