Home జాతీయ వార్తలు కాంగ్రెస్ నాయకుల పాపమే ఇది: ప్రధాని మోడీ

కాంగ్రెస్ నాయకుల పాపమే ఇది: ప్రధాని మోడీ

PM Modiహనుమాన్‌గఢ్(రాజస్థాన్): ఇటీవలే భారత ప్రభుత్వం శంకుస్థాపన చేసిన కర్తార్‌పూర్ కారిడార్ విషయంలో గత కాంగ్రెస్ ప్రభుత్వాల నిర్లక్ష్య వైఖరిని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తప్పుపట్టారు. 70 ఏళ్ల క్రితమే ఈ పని ఎందుకు చేయలేకపోయారో కాంగ్రెస్ పార్టీ నాయకులు సమాధానం ఇవ్వాలని ఆయన డిమాండు చేశారు. రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా మంగళవారం ఇక్కడ ఒక ప్రచార సభలో ప్రధాని మాట్లాడుతూ అప్పటి కాంగ్రెస్ నాయకులకు దూరదృష్టి, నిశిత పరిశీలన కొరవడినందు వల్లే స్వాతంత్య్రానంతరం కర్తార్‌పూర్ పాకిస్తాన్ పరమైందని అన్నారు. సిక్కుల ఆధ్యాత్మిక గురువు గురు నానక్ దేవ్ అంతిమ శ్వాస విడిచిన ప్రదేశమైన పాకిస్తాన్‌లోని కర్తార్‌పూర్‌లోగల గురుద్వారా దర్బార్ సాహిబ్‌కు, భారత్‌లోని గురుదాస్ పూర్ జిల్లాలోగల డేరా బాబా నానక్ క్షేత్రానికి మధ్య కారిడార్‌ను నిర్మించేందుకు భారత, పాకిస్తాన్ ప్రభుత్వాలు అంగీకరించి ఇటీవలే శంకుస్థాపన కూడా నిర్వహించాయి.

గురు నానక్ దేవ్ ప్రాముఖ్యాన్ని గురించి కాని సిక్కుల మనోభావాల పట్ల గౌరవం కాని అప్పటి కాంగ్రెస్ నాయకులు లేకపోవడం వల్లే కర్తార్‌పూర్ పాకిస్తాన్‌లో ఉండవలసి వచ్చిందని ప్రధాని మోడి వ్యాఖ్యానించారు. కర్తార్‌పూర్ కారిడార్‌ను సాకారం చేసిన ఘనత తమదేనని, కాంగ్రెస్ తప్పులను సరిచేయడమే తన లక్షమని ఆయన అన్నారు. ఐదేళ్ల క్రితం వరకు అవినీతి, కుంభకోణాల గురించే పత్రికల్లో పతాక శీర్షికలు ఉండేవి. గడచిన ఐదేళ్లలో అటువంటి వార్తలేవైనా మీరు చూశారా? అని ఆయన ప్రజలను ప్రశ్నించారు.

రైతుల సమస్యలను ప్రస్తావిస్తూ రైతులను శక్తి ప్రదాతలుగా చూడాలన్నదే తమ ప్రభుత్వ ఆశయమని మోడీ అన్నారు. రైతులు సోలార్ ప్యానళ్లు, బిందు సేద్యం వంటి ఆధునిక వ్యవసాయ పద్ధతులను పాటించాలని ఆయన సూచించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీని పరోక్షంగా ప్రస్తావిస్తూ, వారసుడికి(రాహుల్‌కు మోడీ పెట్టిన పేరు) పచ్చి మిరపకాయకు ఎండు మిరపకాయకు తేడా తెలియదు. పచ్చి మిర్చి కన్నా ఎండు మిర్చికే ఎక్కువ ధర పలుకుతోందని మీరు చెబితే రైతులు ఇక ఎండు మిర్చినే పండించాలని అతను సలహా ఇస్తాడు, అంటూ చెణుకులు విసిరారు.

Cong Leaders dont respect Guru Nanak, PM Modi Slams Cong leaders for Kartarpur Going to Pakistan