Home జాతీయ వార్తలు మహదవకాశం ప్రజలు మావెంటే

మహదవకాశం ప్రజలు మావెంటే

Narendra-modi-image

ప్రధాని పదవి కోసం తహతహలాడుతున్నారు
అవిశ్వాస తీర్మానంపై చర్చకు సమాధానమిస్తూ కాంగ్రెస్‌కు చురకలంటించిన ప్రధాని మోడీ 

న్యూఢిల్లీ : ప్రజల కోసం పనిచేస్తూ వెళ్లే ప్రభుత్వానికి, పనినే ప్రాతిపదికగా చేసుకుని వెళ్లే ప్రభుత్వానికి అవిశ్వాస తీర్మానం కూడా ఒక సదవకాశమేనని ప్రధాని నరేంద్ర మోడీ తెలిపారు. ఇలాంటి దశలోనే ప్రజల్లో ప్రభుత్వం పట్ల ఎంతటి విశ్వా సం ఉందనేది తెలిసి వస్తుందని తెలిపారు. లోక్‌సభలో శుక్రవారం తమ ప్రభుత్వంపై తెలుగుదేశం పార్టీ ప్రతిపాదించిన అవిశ్వాస తీర్మానంపై చర్చ సుదీర్ఘంగా జరిగిన తరువాత ప్రధాని మోడీ సమాధానమిచ్చారు. ప్రతిపక్షాలు వెలిబచ్చిన అన్ని అం శాలను ప్రస్తావిస్తూ ప్రత్యేకించి కాంగ్రెస్ అధ్యక్షు లు రాహుల్ గాంధీ చేసిన ఆరోపణలను తిప్పికొట్టేందుకు యత్నించారు. తమ ప్రభుత్వ ఘనతను సభ ద్వారా తెలియచేసుకునేందుకు ఇప్పటివరకూ ఒక మంచి అవకాశం దక్కలేదని, ఈ లోటు ఇప్పు డు తీరినట్లు అయిందన్నారు. తమ బలం ఎంతో, సభలో విశ్వాసం ఎంతో తెలియ చేసుకోవడానికి ఇది మంచి అవకాశంగా భావిస్తున్నామని తెలిపా రు. దేశంలో వికాస్‌కి వ్యతిరేకంగా కొందరి మది లో ఎంత భావన ఉందనేది ప్రతిపక్షాల విమర్శలలో వెల్లడైంది. అలాంటివారందరి నిజస్వరూపం ఇప్పుడు వెలుగులోకి వచ్చింది. అవిశ్వాస తీర్మానం ఎందుకు వచ్చింది? సంఖ్యాబలం లేనప్పుడు అవిశ్వాసం ఎందుకు తెచ్చారు? ఇదే అందరినీ తొలిచివేసే ప్రశ్న. అవిశ్వాస తీర్మానం వస్తే భూకంపం వస్తుందన్నారు? ఏదీ ఆ భూకంపం? అని మోడీ ప్రశ్నించారు. వారి అహంకార పూరిత ధోరణే దీనికి ప్రేరేపించిందని తెలిపారు. ప్రధాని సీట్లో కూర్చోవాలనే తపన ్ర, పధాని కావాలనే ఆరాటంతో ఉన్నవారే ఆత్రుతతో ఈ చర్యకు దిగారని విమర్శించారు. ఒక్క మోడీని దింపేందుకు ఇంత మంది సిద్ధం అవుతున్నారు. ప్రధాని ప్రసంగానికి అడుగడుక్కీ టిడిపి ఎంపీలు అడ్డుతగిలారు. ఆయన ప్రసంగం చేస్తున్నంతసేపూ వారి నినాదాలు సాగాయి. విభజన హమీలు అమలు చేయాలని డిమాండ్ చేస్తూ , . వి వాంట్ జస్టిస్ అంటూ నినాదాలకు దిగారు. ప్రతిపక్షాలకు ప్రత్యేకించి కాంగ్రెస్‌కు దేనిపైనా నమ్మకం లేదు. వారికి ఈ వ్యవస్థపై విశ్వాసం లేదు, ప్రజాస్వామ్యంపై విశ్వాసం లేదు, ఆర్థిక చర్యలపై సరైన వాదన లేదు, రిజర్వ్ బ్యాంక్‌పై విశ్వాసం లేదు. చివరికి వారిపై వారికి కూడా విశ్వాసం లేదు. ఈ విధంగా విశ్వాస హీనులు వారి ప్రవృత్తికి అనుగుణంగానే అవిశ్వాసానికి దిగారని, అయినా ప్రజల కోసం పనిచేసే ప్రభుత్వానికి ఇటువంటి అవిశ్వాసాలు తమను తాము బలోపేతం చేసుకునే అవకాశంగా నిలుస్తాయని తెలిపారు. ప్రభుత్వం చేపట్టే ప్రతి పనిని కాంగ్రెస్ విమర్శిస్తూ ఉంది. అయితే వారి విమర్శలలో నిజం లేదని వెల్లడైంది. దేశానికి, ప్రపంచానికి, ప్రపంచ ఆర్థిక సంస్థలకు ఈ ప్రభుత్వంపై , ఈ వ్యవస్థపై విశ్సాం ఉంది. తమది విశ్వాసంతో కూడుకున్న ప్రభుత్వం అని, అందుకే అన్ని విధాలుగా విశ్వాసం చూరగొంటోందని, చూరగొంటూనే ఉంటుందని విశ్వాసం వ్యక్తం చేశారు.

సీటును కౌగిలించుకోవాలనుకున్నారు
ప్రధాని పదవిని కౌగిలించుకోవాలనే తపన కొందరిలో చాలా వరకూ ఉందని సభాముఖంగానే స్పష్టం అయిందని ప్రధాని మోడీ చమత్కరించారు. రాహుల్ వచ్చి సభలో తనను కౌగిలించుకున్నంత పనిచేయడంపై ఆయన స్పందించారు. కొందరికి ప్రధాని కావాలనే తొందర ఎక్కువగా ఉన్నట్లుందని, అలాంటివారికి తాను ఎప్పుడు కుర్చీలో నుంచి లేచి నిలబడుతాడు? ఎప్పుడొచ్చి తాము కూర్చోవాలనే తొందర ఎక్కువగా ఉన్నట్లుంది. ఎందుకీ తొందర. ఏదీ ఏమైనా ఈ కుర్చీలో ఎవరు కూర్చోవాలనేది ఖరారు చేసేది ప్రజలు . వారి తీర్పు వరకూ అయినా వేచి చూడాలి కదా? అని ప్రశ్నించారు. తమ ప్రభుత్వం సబ్‌కా సాథ్, సబ్‌కా వికాస్ నినాదంతో వచ్చిందని, ఈ విధంగానే సాగుతోందని తెలిపారు.

కండ్లలో కళ్లు పెట్టి చూడలేను ఎందుకంటే ?
రాహుల్ పదేపదే కండ్లల్లో కండ్లు పెట్టి చూడవెందుకు అనడాన్ని ప్రస్తావిస్తూ ఎందరో దేశ ప్రముఖులు నిస్వార్థ మహానుభావులు వీరి కళ్లల్లో కళ్లు పెట్టి చూసినందుకు చివరికి వారి కండ్లల్లోనే నిప్పులు గుమ్మరించారని పేర్కొన్న ప్రధాని కాంగ్రెస్ పటేల్, సుభాష్ చంద్రబోస్ , మెరార్జీ దేశాయ్, సర్దార్ చరణ్‌సింగ్, చంద్రశేఖర్ , జయప్రకాశ్ నారాయణ్ , చివరికి మొన్న మొన్న ప్రణబ్ ముఖర్జీ వంటి ఎందరో ప్రముఖులకు అన్యాయం చేసిందన్నారు. తాను చౌకీదారును, ఈ దేశ ప్రజల సంక్షేమానికి పాటుపడే చౌకీదారును అని తెలిపారు. ఈ పార్టీ నేత చివరికి కళ్లలో కళ్లు పెట్టి చూడటమే కాకుండా చివరికి కళ్లు కొట్టి కూడా చూపి నెట్ ద్వారా వైరల్‌గా ప్రచారం పొందారని చమత్కరించారు. ప్రతిపక్ష నేత తరచూ రాఫెల్ డీల్ గురించి మాట్లాడారని, ఇందులో తప్పిదాలు జరిగాయని చెప్పారని, అయితే ఈ ఒప్పందం 2008 నాటి ఫ్రాన్స్, భారత్ రహస్య అంశాల గోప్యత పరిధిలోకి వస్తుందని తెలిపిందని ఈ విషయాన్ని తాజాగా ఫ్రాన్స్ కూడా తెలిపిందని ప్రధాని తెలిపారు. సర్జికల్ దాడులను కాంగ్రెస్ నేత జుమ్లా దాడులుగా పేర్కొన్నారని , ఈ పార్టీల వారు తనను ఎంతైనా తిట్టొచ్చవచ్చునని అయితే వీర జవాన్లను దేశం కోసం ప్రాణాలు లెక్కచేయకుండా దూసుకువెళ్లిన వారిని నిందించడం తగదని ప్రధాని హితవు పలికారు. భద్రతా విషయంలో ప్రతిపక్షాలు తప్పుడు ప్రచారానికి దిగి దేశ ప్రయోజనాలను దెబ్బతీస్తున్నారని , రాఫెల్ డీల్ పూర్తి పారదర్శకతతో ఉందని తెలిపారు. తమ హయాంలో ఆర్థిక వ్యవస్థ బలోపేతం అయిందన్నారు.