Home జాతీయ వార్తలు సత్తా చూపుతాం

సత్తా చూపుతాం

ఎటువంటి భద్రతాపరమైన సవాల్‌నైనా ఎదుర్కొనే శక్తి ఉంది

2022 కల్లా నవభారత్

ప్రేమతోనే కశ్మీర్ సమస్యను పరిష్కరిస్తాం

సత్ఫలితాలిచ్చిన నోట్ల రద్దు

ట్రిపుల్ తలాక్‌పై మహిళల పోరాటం భేష్ : ఎర్రకోటపైనుంచి ప్రధాని మోడీ

Modi

న్యూఢిల్లీ: సముద్రం లేదా సరిహద్దులకు సంబంధించిన ఎలాంటి భద్రతా పరమైన సవాలునైనా ఎదుర్కొనే సత్తా భారతదేశానికి ఉందని ప్రధాని నరేంద్ర మోడీ మంగళవారం విశ్వాసం వ్యక్తం చేశారు. చైనాతో డోక్లాం వద్ద సైనిక ప్రతిష్టంభన నెలకొన్న ప్రస్తుత తరుణంలో ఆయన ఇలాంటి ప్రకటన చేయడం ప్రాధాన్యతను సంతరించుకుంది. దేశ 71వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలకు ఆయన తనదైన శైలిలో కుర్తా, చుడీదార్ పైజామా, రాజస్తాన్  తలపాగా ధరించి హాజరయ్యారు. కృష్ణుడి వేషధారణతో హాజరైన స్కూలు పిల్లలు సహా ఇక్కడ గుమిగూడిన వేలాది మందిని, దేశవ్యాప్తంగా టివి సెట్ల ముందు ఆసీనులైన కోట్లాది మంది ప్రజలను ఉద్దేశించి ఇక్కడ చారిత్రక ఎర్రకోటపై నుండి ఆయన ఉద్వేగంగా ప్రసంగించారు. దేశ ప్రజలందరికీ ఆయన ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు. తన 56 నిమిషాల ప్రసంగంలో దేశంలోని పలు సమస్యలపై ప్రధాని సూటిగా మాట్లాడారు. చైనాని లేదా రెండు నెలల నుండి కొనసాగుతోన్న డోక్లాం సంక్షోభాన్ని నేరుగా ప్రస్తావించకుండా తమ ప్రభుత్వానికి దేశ భద్రతే ప్రధానమని ఆయన స్పష్టం చేశారు. దేశ సరిహద్దులను సమర్థవంతంగా కాపాడేందుకు సైన్యాన్ని మోహరించామని ఆయన చెప్పారు. ఎల్‌ఒసి వెంట ఉగ్రవాద స్థావరాలపై గతేడాది చేసిన సర్జికల్ దాడుల గురించి ప్రధాని ఈ సందర్భంగా ప్రస్తావించారు. ఈ దాడుల ద్వారా ప్రపంచం భారతదేశ భద్రతా దళాల సత్తాని గ్రహించిందని ఆయన అన్నారు. ‘దేశానికి భద్రతా పరమైన సవాళ్లు ఎదురైనపుడు మన త్రివిధ దళాలు సత్తా చాటాయి. మన వీర జవాన్లు త్యాగాలకు వెనుకాడలేదు’ అని భద్రతా దళాల సేవలను ప్రధాని కొనియాడారు. వామపక్ష తీవ్రవాదం, ఉగ్రవాదం, అక్రమ చొరబాట్లు లాంటి దేశానికి ఎదురయ్యే ఎలాంటి సవాళ్లను త్రివిధ దళాలు ఎల్లప్పుడూ వీరోచితంగా ఎదుర్కొన్నాయని, త్యాగాలకు వెనుకడుగు వేయలేదని ఆయన గుర్తు చేశారు. ఉగ్రవాదంపై పోరులో ఇతర దేశాల నుండి భారత్‌కు మద్దతు ఉందని ఆయన చెప్పారు. భద్రతా దళాలు ప్రత్యేకించి వామపక్ష తీవ్రవాదం ప్రబలంగా ఉండే ప్రాంతాల్లో చేసిన పోరాటాల వల్ల పెడతోవ పట్టిన చాలా మంది యువకులు లొంగిపోయారని ఆయన గుర్తు చేశారు. అలాంటి యువత ప్రధాన స్రవంతిలోకి వచ్చే విధంగా ప్రోత్సహిస్తున్నామని ఆయన చెప్పారు. రక్షణ సిబ్బందికి ఒకే ర్యాంకు…ఒకే పెన్షన్ పథకం అమలు గురించి ఆయన ఈ సందర్భంగా ప్రస్తావించారు. మరోవైపు 125 కోట్ల మంది భారతీయుల సమిష్టి కృషితో 2022 కల్లా ఒక సురక్షితమైన, సౌభాగ్యవంతమైన, సమర్థవంతమైన నవ భారతావనిని నిర్మించాలని లక్షంగా పెట్టుకున్నట్లు మోడీ ఈ సందర్భంగా చెప్పారు.
ఆలింగనంతోనే కశ్మీర్ సమస్యకు పరిష్కారం : తిట్లతోనూ, తూటాలతోనూ కశ్మీరీల సమస్య పరిష్కారం కాదని, వారిని ఆలింగనం చేసుకోవడం ద్వారానే అది సాధ్యమవుతుందని ప్రధాని మోడీ స్వాతంత్య్ర దినోత్సవ సందర్భాన అన్నారు. కశ్మీర్ లోయలో పెచ్చరిల్లుతున్న హింస నేపథ్యంలో ఆయన ఇలా చెప్పడం ప్రాధాన్యతను సంతరించుకుంది. కొంతమంది వేర్పాటువాదులు జమ్ముకశ్మీర్‌లో సమస్యలను సృష్టించడానికి అనేక కుయుక్తులు పన్నుతున్నారు. కానీ, కశ్మీర్‌ని తిరిగి స్వర్గధామం చేయడానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆయన అన్నారు. ఉగ్రవాదాన్ని అణచివేసే విషయంలో మెతక వైఖరిని అవలంబించేది లేదని ఆయన స్పష్టం చేశారు.
నోట్ల రద్దు తర్వాత రూ.1.75 లక్షల కోట్ల జమ : పెద్ద నోట్ల రద్దు, వస్తు, సేవల పన్ను (జిఎస్‌టి) అమలు, నల్లధనంపై ఉక్కుపాదం లాంటి తమ ప్రభుత్వం అమలు చేసిన ఆర్థిక సంస్కరణలను ప్రధాని తన ప్రసంగంలో ప్రస్తావించారు. దేశాన్ని, దేశంలోని పేదలను దోచుకున్న అక్రమార్కులు నేడు ప్రశాంతంగా నిద్రపోలేకపోతున్నారని, అలాంటి వారిపై కఠిన చర్యలు ఇకపై కూడా కొనసాగుతాయని ఆయన హెచ్చరించారు. నోట్ల రద్దు తర్వాత బ్యాంకుల్లో రూ.1.75 లక్షల కోట్లు జమయ్యాయని ఆయన చెప్పారు. ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టిన దాదాపు 18 లక్షల మందికి పైగా వ్యక్తుల వివరాలను ప్రభుత్వం నిశితంగా పరిశీలిస్తోందని ఆయన ఈ సందర్భంగా వెల్లడించారు. లెక్కల్లో చూపని సుమారు రూ.3 లక్షల కోట్లు బ్యాంకింగ్ వ్యవస్థలోకి చేరేందుకు రూ.500, రూ.1000 నోట్ల రద్దు దోహదపడిందని ఆయన చెప్పారు. ఇటీవల కాలంలో దేశంలోని పలు రాష్ట్రాల్లో సంభవిస్తున్న వరదలు, యుపిలో చిన్నారుల మరణాలపైనా ఆయన మాట్లాడారు. బాధిత కుటుంబాలకు యావద్దేశం అండగా నిలుస్తుందని ఆయన భరోసా ఇచ్చారు.
ట్రిపుల్ తలాక్‌పై మహిళల పోరాటం భేష్
ముస్లిం మతంలోని ట్రిపుల్ తలాక్ ఆచారానికి వ్యతిరేకంగా మహిళలు చేస్తున్న పోరాటాన్ని ప్రధాని కొనియాడారు. ముస్లిం మహిళలు తమ హక్కులను సాధించేందుకు చేస్తున్న ఈ ప్రయత్నంలో యావత్ భారతదేశం వారికి అండగా ఉంటుందని ఆయన హామీ ఇచ్చారు. ట్రిపుల్ తలాక్ ఆచారం వల్ల దయనీయమైన జీవితాన్ని గడపాల్సి వచ్చిన మహిళలు నేడు దానికి వ్యతిరేకంగా ఉద్యమాన్ని ప్రారంభించారు. వారి ఉద్యమం దేశవ్యాప్తంగా తలాక్ ఆచారానికి వ్యతిరేకమైన వాతావరణాన్ని సృష్టించిందని ప్రధాని చెప్పారు. ట్రిపుల్ తలాక్ అచారానికి వ్యతిరేకమని కేంద్రం గతంలో స్పష్టం చేసింది. ఇదే అంశంపై సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం విచారణ చేపట్టిన సంగతి తెలిసిందే.
విశ్వాసం పేరుతో హింస తగదు
మతం పేరుతోనూ, విశ్వాసాల పేరుతోనూ హింసకు పాల్పడే వారిపై మోడీ మండిపడ్డారు. హింస ఆమోదయోగ్యం కాదని, కులతత్వం, మతతత్వం అనేవి దేశానికి విషం లాంటివని ఆయన వ్యాఖ్యానించారు. ఇవి దేశ అభ్యున్నతికి ఏ రకంగానూ దోహదం చేయవని ఆయన స్పష్టం చేశారు. ఇటీవల కాలంలో దేశంలోని పలు ప్రాంతాల్లో గోసంరక్షకుల పేరిట దాడులు, హత్యలు జరుగుతున్న నేపథ్యంలో ప్రధాని వ్యాఖ్యలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. శాంతి, సామరస్యలతో మెలగాలని ఆయన పిలుపునిచ్చారు. స్వాతంత్య్ర పోరాటంలో క్విట్ ఇండియా నినాదాన్ని అనుసరించిన విధంగా ఇపుడు కనెక్ట్ ఇండియా నినాదంతో ముందుకు సాగాలని ఆయన కోరారు. భారతదేశం మహాత్మాగాంధీ, బుద్దుడు లాంటి మహానుభాభవులు నడయాడిన నేల అని, ప్రతి ఒక్కరినీ అభివృద్ధి పథంలో నడిపించడమే భారతదేశ సంస్కృతి అని ఆయన చెప్పారు. అందువల్ల విశ్వాసం పేరుతో హింసకు పాల్పడటం సరికాదని ఆయన అన్నారు.