Home జాతీయ వార్తలు ఏకబిగిన ఏడు కి.మీ నడక

ఏకబిగిన ఏడు కి.మీ నడక

PM Modi walking in Atal's procession was a surprise

వాజ్‌పేయీ పార్థివ దేహం వెంట ప్రధాని మోడీ
విస్తుపోయిన బిజెపి నేతలు, శ్రేణులు
డేగ కళ్లతో కాపలాకాచిన భద్రతా సిబ్బంది

న్యూఢిల్లీ: మాజీ ప్రధాని వాజ్‌పేయీ అంతిమయాత్ర సందర్భంగా ప్రధాని మోడీ ఏడు కిలోమీటర్లు కాలినడక సాగించడం అందరినీ ఆశ్చర్యపర్చింది. ప్రోటోకాల్‌ను పక్కనపెట్టి ఆయన ఇతరులతో పాటు నడక సాగించడంతో నేతలంతా విస్తుపొయ్యారు. లక్షలాది జనం, మధ్యలో ప్రధాని, ఎందరో ప్రముఖులు. చాలా దూరం వరకూ, అనేక గంటల పాటు సాగిన అంతిమ యాత్ర ఘట్టం భద్రతా సిబ్బందికి సవాలుగానే మారింది. శుక్రవారం దేశ రాజధానిలోని దీన్ దయాళ్ ఉపాధ్యాయ్ మార్గ్‌లోని బిజెపి ప్రధాన కార్యాలయంలో వాజ్‌పేయీ భౌతిక కాయాన్ని ఉంచారు. కొన్ని గంటల పాటు అశేష జనం ఆయన అంతిమసందర్శనకు తరలివచ్చారు. తరువాత అక్కడి నుంచి రాష్ట్రీయ స్మృతీ స్థల్‌కు వేలాది ప్రజల నడుమ అంతిమయాత్ర సాగింది. ఈ దశలో ప్రధాని మోడీ భద్రతా వలయం కూడా విస్తుపోయేలా చేశారు. తన నిర్ణీత కారులో కూర్చొకుండా ఆయన కాలినడకన కదిలారు. దీనితో ఆయన చుట్టూ ఉన్న పలువురు నేతలు కంగుతిన్నారు. నెమ్మదిగా అడుగులో అడుగు వేస్తూ అంతిమ స్థలి వద్దకు ఆయన పయనం సాగింది. ఆయనకు రక్షణ వలయంగా ఉండే అత్యంత సునిశిత ప్రత్యేక రక్షణ బృందం (ఎస్‌పిజి) ఈ దశలో ఓ క్షణం దిక్కు తోచని స్థితిలో పడ్డా వెంటనే తేరుకుంది. పోలీసు ఉన్నతాధికారులకు వెంటనే ప్రధాని మోడీ కాలి నడకన వస్తున్నట్లు తెలిపింది. బిజెపి అధ్యక్షులు అమిత్ షా, పలువురు కేంద్ర మంత్రులు, వివిధ రాష్ట్రాల సిఎంలు ఈ అంతిమయాత్రలో కాలినడకన సాగారు.

దేవేంద్ర ఫడ్నవిస్, విజయ్ రూపానీ, శివరాజ్‌చౌహాన్, యోగిఆదిత్యానాథ్‌లు ఈ దారిలో నెమ్మదిగా సాగుతూ పార్థివదేహం ఉంచిన శకటం వెంట మౌనచిత్తులై నడిచారు. ‘ఇంతకు ముందెప్పుడూ ఏ ప్రధాని కూడా ఈ విధంగా ఏడు కిలోమీటర్లు ప్రజల ఊరేగింపులో నడవలేదు. అప్పటికే వివిఐపిల భద్రతకు అన్ని చర్యలూ తీసుకున్నాం. అయితే ప్రధాని కాలినడక గురించి తెలిసిన తరువాత మరింత కట్టుదిట్టమైన ఏర్పాట్లకు కొంచెం కంగారు పడాల్సి వచ్చింది. ఏర్పాట్లకు కొంచెం సమయమే ఉండటంతో ఇబ్బందే అయింది. ఎందరు వివిఐపిలు నడిచి వస్తున్నారనేది సమాచారం లేదు. అయితే దీనికి తాము ముందుగానే సిద్ధపడ్డాం. కానీ ప్రధాని కాలినడక గురించి చివరి క్షణం వరకూ మాకు తెలియదు. దీనితో విస్తుపొయ్యాం’ అని భద్రతా ఏర్పాట్ల పర్యవేక్షణలో ఉన్న ఓ అధికారి తెలిపారు. సాధారణంగా ప్రోటోకాల్ మేరకు దేశ ప్రధాని వాహనంలో వెళ్లే సమయంలో ఈ ప్రాంతాన్ని దిగ్బంధిస్తారు. ట్రాఫిక్ నిలిచిపోతుంది. మార్గం రెండు వైపులా సాయుధ పోలీసు అధికారులు నిలిచి ఉంటారు. ఎవరిని ప్రధాని వాహన శ్రేణికి అడ్డు రానివ్వరు. ప్రధాని వాహనం వెళ్లిపోయిన తరువాతనే ట్రాఫిక్ కదులుతుంది. అయితే అత్యంత జన సమ్మర్థం ఉండే పాత ఢిల్లీలోని దర్యాగంజ్ మీదుగానే అంతిమమాత్ర సాగడం, ప్రధాని కాలినడకతో అమలు కాలేని ప్రోటోకాల్ సవాళ్లు అనేకం తలెత్తాయి. ప్రధాని కాలినడక గురించి పార్టీ కార్యాలయంలో ఉన్న ప్రముఖ నేతలు కూడా ఆశ్చర్యపోయారు. అంతిమయాత్రలో అమిత్ షా ప్రజల వెంబడి కాలినడకన వెళ్లుతారని, మరికొందరు ఆయనను అనుసరిస్తారని తొలుత అంతా భావించారు. ప్రధాని కేవలం గౌరవసూచకంగా కొద్ది మీటర్లో ఓ ఫర్లాంగో నడుస్తారని తరువాత అంతిమ క్రియల స్థలానికి కారులో వెళ్లుతారని అనుకున్నామని బిజెపి నేత ఒకరు చెప్పారు.

ఇరువైపులా ఇళ్లపై డేగకన్ను
ప్రధాని కాలనడక సాగించిన దారిలో రెండు వైపులా ఉండే పలు భనవాల వెంబడి సాయుధ భద్రతా బలగాలు క్షణాల వ్యవధిలో వచ్చినిలిచారు. రెండు వైపులా ఉండే ఇళ్లను భద్రతా సిబ్బంది హుటాహుటిన క్షుణ్ణంగా పరిశీలించడం, ఇంట్లోని వారిపై ఆరాలు తీయడంతో ఈ ప్రాంతం అంతా ఓ క్షణం హడావిడి నెలకొంది. ఇళ్ల పై కప్పులపై సాయుధ బలగాల వారు మఫ్టీలో నిలిచారు. ఇక యాత్రలో సాగుతోన్న వివిఐపిల భద్రతకు భద్రతా వలయాన్ని జాగ్రత్తగా నిశితంగా ఖరారు చేసుకోవడం, భద్రతతో హడావిడి లేకుండానే అన్ని విధాలుగా భద్రత కల్పించడం ఢిల్లీ పోలీసులకు ఒక సవాలుగానే మారింది. అదనపు భద్రతా ఏర్పాట్లు చేయడం పెద్ద సమస్య కాలేదని, అయితే అప్పటికప్పుడు ఎస్‌పిజి, ఇతర కీలక భద్రతా విభాగాలతో సమన్వయం కావడం, దారి పొడుగునా ఉండే ఇళ్ల వద్ద నిలబడి భద్రతను పటిష్టం చేయడం, నిఘాను తీవ్రతరం చేయడం, అన్నింటికీ మించి స్థానికులు, అంతిమ యాత్రలో పాల్గొనేందుకు వచ్చిన వారు ఏదో జరుగుఉన్నదనే ఆందోళనలకు గురి కాకుండా చేయడం పలు చిక్కులను తెచ్చిపెట్టాయని ఓ అధికారి తెలిపారు. బిజెపి కార్యాలయం, అంత్యక్రియల స్థలం దరిదాపుల్లోని వ్యాపార సంస్థలను అన్నింటిని మూసివేయించారు. ఇక ప్రధాన రోడ్ల వైపు వచ్చే పలు సందులు, ప్రత్యామ్నాయ రోడ్ల నుంచి వాహనాలు రాకుండా నిలిపివేశారు. ప్రధాన రాదారికి ఇరువైపులా ఉండే అన్ని ఇళ్లను క్షుణ్ణంగా పరిశీలించి, తమ బలగాలు ఇంటిపై కప్పుపై నిలిచి ఉండేలా చేశామని ఢిల్లీ పోలీసు కమిషనర్ అమూల్యా పట్నాయక్ చెప్పారు. అంతిమ వేదిక వద్దకు ప్రదర్శన చేరేవరకూ వివిధ భద్రతా సంస్థలు సమన్వయంతో వ్యవహరించి ప్రధాని చుట్టూ బహుళ భద్రతా వలయాలుగా ఏర్పడినట్లు వివరించారు. అంత్యక్రియలు ముగిసే వరకూ దాదాపు 3వేల మంది పోలీసు సిబ్బంది విధులలో ఉన్నారు. ఇక పోలీసు జాగిలాలు, ఢిల్లీ పోలీసు జాగ్వార్ బైక్ పెట్రోలింగ్ దళాల గస్తీ సాగింది. ఎందరో నేతలు, కేంద్ర మంత్రులు, దేశ ప్రధాని రెండు మూడు గంటల పాటు కాలినడకన నిర్ణీత బాటలో సాగడం, అందులోనూ ప్రధాని ఉన్నట్లుండి నడకకు దిగడం భద్రతా ఏర్పాట్లకు సవాలే అని రిటైర్డ్ ఐపిఎస్ అమోద్ కాంత్ తెలిపారు.