Home జాతీయ వార్తలు మరో వెన్నుపోటు

మరో వెన్నుపోటు

 

ఎన్‌టి రామారావు దృష్టశక్తిగా వర్ణించిన కాంగ్రెస్‌తో చంద్రబాబు స్నేహం
ఓటమి భయంతో ఆయన వణుకుతున్నారు
నల్లచొక్కాతో మాకు దిష్టి తీశారు
గోబ్యాక్ నినాదాలతో మోడీ తిరిగి ప్రధాని కావాలంటున్నారు
అమరావతి నుంచి పోలవరం వరకు ఆస్తులు పెంచుకోడానికి ఎపి సిఎం ప్రయత్నిస్తున్నారు
గుంటూరు సభలో ప్రధాని మోడీ సునిశిత విమర్శ

అమరావతి: ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆంధ్రప్రదేశ్ పర్యటనలో భాగంగా రాష్ట్ర ము ఖ్యమంత్రి, టిడిపి అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు విమర్శల వర్షం కురిపించారు. ఆదివారం గుంటూరులో బిజెపి ఏర్పాటు చేసిన ప్రజా చైతన్య సభలో మోడీ ప్రసంగించారు. అధికారం కోసం ఎవరితోనైనా జతకట్టే చంద్రబాబుకు వచ్చే ఎన్నికలకు ఓటమి భయం పట్టుకుందన్నారు. ఎన్నికల్లో ఒకసారి గెలిస్తే, మరోసారి గెలిచిన చరిత్ర చంద్రబాబుకు లేదని అన్నారు. మహాకూటమిది అపవిత్ర కలయికగా మోడీ అభివర్ణించారు. రాజకీయ స్వార్థం కోసమే చంద్రబాబు మహా కూటమి అంటూ తిరుగుతున్నారని మండిపడ్డారు. మహా కల్తీ కూటమిలో చంద్రబాబు చేరారని, ఎన్‌టిఆర్‌ను అవమానించిన బద్ధ శత్రువు కాంగ్రెస్‌తో పొత్తు ఎలా పెట్టుకుంటారని నిలదీశారు. ఒకప్పుడు కాంగ్రెస్‌ను దుష్టులుగా ఎన్‌టిఆర్ అభివర్ణించారని, అలాంటి వాళ్లతో చంద్రబాబు స్నేహం చేస్తున్నారని అన్నారు. చంద్రబాబు చర్యలను చూసి ఎన్‌టిఆర్ ఆత్మ తప్పకుండా క్షోభిస్తూ ఉండి ఉంటుందన్నారు. చంద్రబాబు నిజ స్వరూపాన్ని బయట పెట్టేందుకే ఇక్కడికి వచ్చానని, తన కుమారుడిని రాజకీయాల్లో అందలం ఎక్కించాలని చూస్తున్నారని అన్నారు. తనకన్నా సీనియర్ అని చెప్పుకుంటున్న చంద్రబాబు తన సీనియార్టీతో ఏం సాధించారో అర్థం కావడం లేదన్నారు. ఆంధ్రలో తండ్రీ, కొడుకుల రాజకీయం త్వరలోనే అంతం కాబోతుందని చంద్రబాబు, లోకేష్‌ను ఉద్దేశించి అన్నారు. రాష్ట్రంలో అభివృద్ధి మానేసి, తన కుమారుడిని రాజకీయాల్లో పైకి తీసుకు రావాలని చంద్రబాబు తహతహలాడుతున్నారని మోడీ దుయ్యబట్టారు. ఏ విధంగా ఆయన తన ఆస్తులను పెంచుకున్నారో అందరికీ తెలుసని, మీతో మాట్లాడుతున్న ఈ చౌకీదార్ చంద్రబాబుకు నిద్ర లేకుండా చేశారని అన్నారు. ‘రోజూ చంద్రబాబు నిద్రలేని రాత్రులు గడుపుతున్నారు. రాష్ట్ర అభివృద్ధి కోసం కేంద్రం ఇచ్చిన ప్రతి పైసా లెక్క అడుగుతున్నాం. దీంతో వణికిపోతున్నారు. కేంద్రం ఇచ్చిన నిధుల గురించి తాము లెక్కలు అడిగే సరికి చెప్పలేక ఆయన భయపడుతున్నారు. గతంలో చంద్రబాబు ఎవరికీ లెక్కలు చెప్పేవారు కాదు. ఏపీకి ఇవ్వాల్సిన దానికంటే ఎక్కువే ఇచ్చాం. ప్రత్యేక హోదా కన్నా ప్రత్యేక ప్యాకేజీ ద్వారా ఎక్కువ నిధులనే ఏపీకి ఇవ్వడం జరిగింది. అయితే వాటిని సద్వినియోగం చేసుకోవడంలో చంద్రబాబు విఫలం అయ్యారు. కేంద్రం నుంచి వివిధ మంత్రిత్వ శాఖల ద్వారా ఏపీకి సుమారు రూ.3లక్షల కోట్ల ప్రాజెక్టులు ఇచ్చాం’ అని మోడీ వ్యాఖ్యానించారు. 2016 సెప్టెంబర్ నుంచి ఎపికి ప్రత్యేక ప్యాకేజీ అమలు చేస్తున్నామని, ప్రత్యేక ప్యాకేజీ అమలుపై చంద్రబాబు కేంద్ర ఆర్థిక మంత్రికి ధన్యవాదాలు చెప్పారని, ప్యాకేజీపై శాసనసభలో అభినందిస్తూ తీర్మానం చేశారని మోడీ గుర్తు చేశారు. ప్యాకేజీని వినియోగించుకోవడంలో ఆయన విఫలమయ్యారని అన్నారు. విభజన చట్టంలోని అన్ని అంశాలను అమలు చేస్తూ వచ్చామని, అందులో భాగంగానే ఐఐటి తిరుపతి, సెంట్రల్ వర్సిటీ, ఎయిమ్స్ వంటి సంస్థలు ఇక్కడికి వచ్చాయన్నారు. కేంద్ర నిధులతో విశాఖ-చెన్నై కారిడార్ పనులు జరుగుతున్నాయని, రాష్ట్రంలో మూడు విమానాశ్రయాల విస్తరణ, నిర్మాణ పనులు చేపడుతున్నామన్నారు. ఎపిలో చేపట్టిన 8 పెద్ద ప్రాజెక్టుల్లో 6 ప్రాజెక్ట్ పనులు మొదలయ్యాయని మోడీ పేర్కొన్నారు.
అమరావతి టు పోలవరం వరకు ఆస్తులు
నాకు ఆస్తులు పెంచుకోవడం తెలియదని చంద్రబాబు అన్నారని, అది నిజమేనని అన్నారు. కానీ అమరావతి నుంచి పోలవరం వరకూ తన ఆస్తులు పెంచుకోవడం కోసం చంద్రబాబు ప్రయత్నిస్తున్నారని మోడీ ఆక్షేపించారు. సొంత ఆస్తులు పెంచుకునే ఆశ నాకు లేదు. కేవలం దేశ సంపదను పెంచడం కోసమే ప్రజలు నన్ను ఎన్నుకున్నారన్నారు. ఎప్పుడైనా ఒక ముఖ్యమంత్రి వాస్తవాల్ని వదిలిపెట్టి అసత్యాలు మాట్లాడుతున్నారంటే అతడు ప్రజల మద్దతు కోల్పోయాడని అర్థమని, తన తప్పులు కప్పిపుచ్చుకోవడానికి ఆ వ్యక్తి ఏదో పెద్ద తప్పు చేశారనే అర్థం ధ్వనిస్తుందన్నారు. ఏపీని విభజించిన సమయంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. అప్పుడు కాంగ్రెస్ తన స్వలాభం కోసమే విభజన చేసింది. అలాంటి ఆ పార్టీతో చంద్రబాబు జత కట్టారని మండిపడ్డారు.
ఔను… చంద్రబాబుతో వీటిల్లో పోటీ పడలేను
నా కంటే సీనియర్ అని చంద్రబాబు చెప్పుకుంటున్నాని, అవును, కొత్త కూటములు జత కట్టడంలో ఆయన సీనియర్ అని మోడీ ఎద్దేవా చేశారు. ‘ఎన్నికల్లో ఓడిపోవడంలో మీరు సీనియర్. ఆంధ్రుల కలలను నీరుగార్చడంలో మీరు సీనియర్. ఆ విషయంలో నేను ఆయనతో పోటీ పడలేను’ అంటూ వ్యంగ్య బాణాలను సంధించారు. అంతకు ముందు ప్రధాని నరేంద్ర మోడీ సభా స్థలి నుంచే రిమోట్ కంట్రోల్ ద్వారా రూ.7,000 కోట్ల కేంద్ర ప్రభుత్వ నిధులతో ఓఎన్‌జిసి, ప్రెటోలియం శాఖ అనుబంధ సంస్థ చేపట్టిన రెండు ప్రాజెక్టులను జాతికి అంకితం ఇచ్చారు. మరో రూ.2,280 కోట్లతో బిపిసిఎల్ సంస్థ కృష్ణపట్నం పోర్టులో కోస్టల్ టర్మినల్ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశారు.
చంద్రబాబు ‘నల్ల చొక్కా’ నిరసనపై మోడీ సెటైర్లు
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నల్ల చొక్కా ధరించడంపై ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సెటైర్లు గుప్పించారు. తమకు దిష్టి తగలకుండా ఉండేందుకే ఆయన నల్ల చొక్కా వేసుకుని నిరసన తెలిపారన్నారు. టిడిపి నేతల నల్ల చొక్కాలు, నల్లజెండాలు, బెలూన్లు, మోడీ గో బ్యాక్ నినాదాలపైనా మోడీ స్పందించారు. ‘టిడిపి వాళ్లు నల్ల బెలూన్లు ఎగరేసి మాకు దిష్టి తీశారు. మోడీ గో బ్యాక్ అంటూ నినాదాలు చేశారు. ఇది మాకు శుభ సూచకం. ఢిల్లీ వెళ్లి మళ్లీ అధికార పీఠంపై కూర్చోమని గో బ్యాక్ అంటున్నారు. రానున్న ఎన్నికల్లో మళ్లీ మేమే అధికారంలోకి వస్తామని టిడిపి నేతలు చెబుతున్నారు. ఈ సందర్భంగా టిడిపికి ధన్యవాదాలు చెబుతున్నాను. ఈసారి కూడా అధికారం మాదే’ అని మోడీ వ్యాఖ్యానించారు.
మోడీ తెలుగు పలుకులు
‘అక్షర క్రమంలోనే కాకుండా అన్ని రంగాల్లో.. అంశాల్లో అగ్రగాములైన ఆంధ్ర ప్రజలకు శుభాకాంక్షలు. పద్మభూషణ్, దళిత రత్నం, కవి కోకిల గుర్రం జాషువా జన్మించిన గుంటూరు జిల్లా ప్రజలకు నమస్కారం. మహా కవి తిక్కన జన్మించిన గుంటూరు ప్రజలకు నమస్కారం’ అని ప్రధాని నరేంద్ర మోడీ గుంటూరులో ఆదివారం ఏర్పాటు చేసిన బిజెపి ప్రజా చైతన్య సభలో తెలుగు మాటలతో తన ప్రసంగాన్ని ఆరంభించారు, అనంతరం హిందీలో తన ప్రసంగాన్ని కొనసాగించారు. అలాగే వావిలాల గోపాలకృష్ణయ్య, డాక్టర్ నాయుడమ్మను కూడా ప్రధాని ప్రస్తావించారు. ప్రధాని హిందీ ప్రసంగాన్ని బిజెపి ఎంపి జివిఎస్ నర్సింహారావు తెలుగులోకి అనువదించారు.

 PM Narendra Modi Criticisms to AP CM Chandra babu