Home అంతర్జాతీయ వార్తలు ‘ శక్తిమంతమైన వ్యక్తి మోడీ ’

‘ శక్తిమంతమైన వ్యక్తి మోడీ ’

PM Narendra Modi is Powerful Man

న్యూయార్క్ : భారత ప్రధాని నరేంద్రమోడీ మరో అరుదైన గౌరవాన్ని సాధించారు. ప్రపంచ వ్యాప్తంగా అత్యంత శక్తిమంతమైన వ్యక్తుల జాబితాలో టాప్ టెన్‌లో ఆయన స్థానం సాధించారు. ప్రముఖ మ్యాగజైన్ ఫొర్బ్స్ విడుదల చేసిన జాబితాలో ఆయన 9వ స్థానంలో నిలిచారు. 2018 సంవత్సరానికి ఫొర్బ్స్ ప్రపంచంలో అత్యంత శక్తిమంతమైన వ్యక్తుల జాబితాను విడుదల చేసింది. ప్రపంచ జనాభాలో 75 మంది అత్యంత శక్తిమంతమైన వారిగా ఈ జాబితాలో నిలిచారు. మోడీ 9వ స్థానం సంపాదించగా, ఫేస్‌బుక్ సిఇఒ మార్క్ జుకర్‌బర్గ్ 13వ స్థానంలో, యుకె ప్రధాని థెరిసామే 14వ స్థానంలో నిలిచారు. అవినీతిని నిర్మూలించేందుకు 2016లో ప్రధాని మోడీ తీసుకున్న పెద్దనోట్ల రద్దు నిర్ణయాన్ని ఫొర్బ్స్ పత్రిక ప్రస్తావించింది. చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ తొలిసారిగా మొదటి స్థానంలో నిలిచారు. రష్యా అధ్యక్షుడు వ్లాదిమర్ పుతిన్ రెండో స్థానంలో ఉన్నారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మూడో స్థానంలో, జర్మనీ ఛాన్సలర్ ఏంజెలా మెర్కెల్ నాల్గో స్థానంలో, అమెజాన్ అధినేత జెఫ్ బెజోస్ ఐదో స్థానంలో, పోప్ ఫ్రాన్సిస్ ఆరో స్థానంలో, మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకులు బిల్‌గేట్స్ ఏడో స్థానంలో , సౌదీ అరేబియా యువరాజు మహ్మద్ బిన్ సల్మాన్ అల్‌సాద్ ఎనిమిదో స్థానంలో, ఆల్ఫాబెట్ సిఇఒ లారీ పేజ్ పదో స్థానంలో నిలిచారు. భారత్‌కు చెందిన ప్రముఖ వ్యాపారవేత్త ముకేశ్ అంబానీ 32వ స్థానంలో నిలిచారు. భారత సంతతికి చెందిన సత్య నాదేళ్ల 40వ స్థానంలో నిలిచారు. ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయెల్ మెక్రాన్ 12వ స్థానంలో ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్న 36వ స్థానంలో, కెనడా ప్రధాని జస్టిస్ ట్రూడో 57 స్థానంలో ఉగ్రవాద సంస్థ ఇస్లామిక్ స్టేట్ అధినేత అబు బకర్ అల్ బగ్దాది 73వ స్థానంలో నిలిచారు.

PM Narendra Modi is Powerful Man