Home కామారెడ్డి మంత్రి పోచారం చొరవతో పేదల కల సాకారం

మంత్రి పోచారం చొరవతో పేదల కల సాకారం

House

బాన్సువాడ డివిజన్: పేదలకు ఇళ్ల స్థలాల కల సాకారమైంది. పదేళ్లు ఎదురు చూస్తున్న వారికి పట్టాలు చేతికందాయి. సొంతింటి కల నిజమౌతుందన్న ఆశ వారిలో కలుగుతోంది. గతవారం రోజుల క్రితం రాష్ట్ర మంత్రి పోచారం బాన్సువాడలో లబ్ధిదారులకు పట్టాలను అందజేశారు. వారందరికి స్థలాలు చూపించాలంటూ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. దాంతో రెవెన్యూ అధికారులు అదే పనిలో నిమగ్నమయ్యారు. చాలా రోజులుగా పేదలు కోరుకుంటున్న కోరికను పోచారం ఎట్టకేలకు తీర్చగలిగారు. ఇది వరకు నాలుగైదు దఫాలుగా ప్రభుత్వ ఇళ్ల స్థలాలను పంపిణీ చేసినప్పటికీ వాటిలో కొంతమేరకు అక్రమాలు జరగడంతో ఈ వ్యవహారం వివాదాస్పదంగా మారిం ది. అందుకు పోచారం పలు సందర్భాలుగా జరిగిన అక్రమాలపై విచారణ జరిపించారు. ప్రస్తుతం అందిస్తున్న ప్లాట్లలో కూడా ఎలాంటి తప్పులు దొర్లకుం డా ఉండేందుకు పక్కా ప్రణాళికతో జాబితాను రూపొందించారు. మంత్రి పోచారం స్వయంగా ప్లాట్ల పట్టాలను పంపిణీ చేశారు.

బాన్సువాడలో సంగమేశ్వర్ కాలనీతో పాటు బీడి వర్కర్స్ కాలనీ, తాడ్కోల్ రోడ్ ప్రాంతాలలో పట్టణ లబ్ధిదారులకు స్థలాలను మంజూరు చేశారు. దాదాపు 150 ఎకరాల స్థలాన్ని కొనుగోలు చేశారు. అట్టి స్థలంలో అన్ని ప్లాట్లు చేసి లబ్ధిదా రులకు అందించేందుకు ఏర్పాట్లు చేశారు. అందులో వంద గజాల చొప్పున ప్లాట్లు చేసి పట్టాలు మంజూరు చేస్తున్నారు.

ప్లాట్లు ఇచ్చారు అదే సంతోషం…
చాన్నాళ్ల నుండి జాగ కోసం తిరుగుతున్నా. గిప్పుడు నా చేతికి పట్టా వచ్చింది. పోచారం పటేల్ నాకు జాగిచ్చిండు సంతోషం. జాగిచ్చిన్రూ కాని గా డబుల్ రూం వస్తదా మాకు.. గది గూడిస్తే మాకు ప్లాటు కోసం తాను నాలుగైదు సార్లు దరఖాస్తులు పెట్టుకున్నానని, కాని తనకు ప్లాటు రాలేదని శ్యామల వాపోయింది. గా బాజిరెడ్డి ఉన్నప్పుడు పెట్టినా, గప్పుడిచ్చిన సట్టిపికెట్ చెల్లదన్నారు. గిప్పుడు పోచారం సార్ కొత్త సర్టిఫికెట్ ఇచ్చిండు. దీంతోటైనా మాకు నీడ దొరికింది. చాలా సంతోషంగా ఉంది.

డబుల్ రూం వస్తుందా మాకు
రాష్ట్ర ప్రభుత్వం డబుల్ బెడ్ రూం పథకం తమకు అందుతుందానని స్థలం పొందిన లబ్ధిదారురాలు ఆభిలాషిస్తోంది. ఇన్ని రోజులు ప్లాటు లేదనుకున్నాం, కాని గిప్పుడు ప్లాటొచ్చింది. గా ఇళ్లు గూడిస్తే బాగుండు. బతికినన్నీ రోజులు గండ్లనే పడి ఉంటుంటీ అంటూ శ్యామల కోరింది. మంత్రి డబుల్ మంజూరుకు చర్యలు తీసుకోవాలని వేడుకుంది.

నీళ్లు, రోడ్లేపిస్తే బాగుండూ
ప్లాట్లు ఇచ్చిన్రూ కాని గా రోడ్లు కూడా ఏపిస్తే బాగుండు. ఎందుకంటే చీకట్ల గీడ కట్టుకోని ఉండాలంటే కష్టం. అందుకని కరెంట్ సరఫరా చేస్తే ఏ బాధుండదు. గట్లనే రోడ్లు కూడా వేయించాలే. రోడ్లు లేక ముళ్లళ్ల నడుసుడైతలేదు. పోచారం సారేమో ప్లాటును కబ్జా చేసుకోమన్నడు. ఏమన్నా పనులు చేసుకుందామంటే గెట్లు గివి అడ్డొస్తున్నయి. బాగా సర్కార్ ముళ్లు కుచ్చుతున్నయి.

కరెంట్ కూడా కావాలే కదా
ప్లాట్లలో ఇళ్లు నిర్మించుకునేందుకు వీలుగా కొత్తగా ఏర్పడే కాలనీలో కరెంట్ సరఫరాను ఏర్పాటు చేయాలని లక్ష్మి కోరింది. ఊరికి దూరంగా ఉన్నందున రాత్రి వేళల్లో కరెంట్ లేకపోతే కష్టమైతది కాబట్టి విద్యుత్ సరఫరాను కల్పించాలని మంత్రిని వేడుకుంది.

ప్లాటు కోసం చాన్నాళ్లు తిరిగినా
ఇరువై ఏండ్ల నుండి కిరాయి ఇండ్లళ్ల ఉండి బతుకు ఎల్లదీసినం. ప్లాటిస్తే గింత గుడిసేసుకుంటమని అనుకున్నం. పోచారంకు మా బాధలు చెప్పినం. మాకు గీ ప్లాట్లిచ్చిండు. సాలు గిన్లనే గుడిసేసుకొని బతుకుతం. గా కిరాయి బాధ తప్పింది అంటూ బాగ్మమ్మ తెలిపింది.

సౌకర్యాలు ముందు కల్పించాలి
కొత్తగా ఇచ్చిన ప్లాట్లలోని గల్లీలో అన్ని రకాల సౌకర్యాలు కల్పించే విషయంలో ఎనుకముందు చేయొద్దు. వెంటనే నీళ్లు, కరెంట్,రోడ్లు, మురకికాలువలు కట్టించాలి. కనీసం గీ నాలుగు సౌకర్యాలున్నా గీడ ఇళ్లు కట్టుకోని ఉండడానికొస్తది అంటూ నాగలక్ష్మి కోరింది. అందుకోసం మంత్రి ఆ విధంగా ఏర్పాట్లు చేయాలంది.

అర్హులకు మాత్రమే ఇళ్ల స్థలాలు
బాన్సువాడ పట్టణంలో నిరుపేద కుటుంబాల్లోని ఇళ్లు లేని వారికే స్థలాలను మంజూరు చేశామని తహసీల్ధార్ గోపి నాయక్ తెలిపారు. ధరఖాస్తుదారులను స్వయంగా పరిశీలించిన పిమ్మటే అర్హులుగా గుర్తించడం జరిగిందని చెప్పారు. ఆనర్హులని తేలితే మంజూరు చేసినా వాటిని రద్దు చేస్తామన్నారు. నిజమైన లబ్ధిదారులకు జాగలు అందాలన్నదే మంత్రి ఉద్ధేశ్యమని అధికారి వివరించారు.

పైరవీలకు తావులేదు…మంత్రి పోచారం
ఇళ్ల స్థలాల మంజూరులో ఏలాంటి పైరవీలకు తావులేదని, అధికారుల నుండి పరిశీలన జరిగిన పిమ్మటే అర్హులుగా గుర్తించడం జరుగుతుందని పోచారం చెప్పారు. ఇళ్ల స్థలాల మంజూరులో అధికారులదే తుది నిర్ణయమన్నారు. బోగస్ లబ్ధిదారులు ఎవరైనా ప్లాటును తీసుకుంటే అందుకు అధికారులే బాధ్యత వహించాల్సి ఉంటుందని మంత్రి పేర్కొన్నారు.