Home కలం మతలబు తెలిసిన మహాకవి

మతలబు తెలిసిన మహాకవి

Untitled-1

తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిన సందర్భంలో 1956 నుండి ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ అధికార పాలసీవల్ల అణచివేతకు, విస్మరణకు గురైన తెలంగాణ భాషా. సంస్కృతులను తిరిగి పునర్నిర్వచించుకోవల్సి ఉన్నది. నిజాం పాలనకాలంలో ఒక వెలుగు వెలిగి తెలంగాణ భాష, సంగీత సంప్రదాయాలకు ప్రాణప్రదంగా నిలిచిన తత్వకవిత, అందులో విశిష్టమైన పాత్ర పోషించిన రచయిత, వరకవి సిద్ధప్ప. నిజాం కాలంలోనే ఆయన రచయితగా ప్రముఖుడు . ఆ రోజులలోనే 24 పుస్తకాలుపైగా వెలువరించారు. సురవరం వెలువరించిన గోల్కొండ కవుల సంచికలో ఆయన ఆనాటి సమాజానికి చిరపరిచితుడు. 1913 లో సిద్ధిపేట జిల్లా గుండా రెడ్డిపల్లి గ్రామంలో పేద కుమ్మరి కులంలో జన్మించారు. నిరక్షరాస్యునిగా కవిత రాయడం నేర్చి అటు తర్వాత తెలుగు, ఉర్దూ నేర్చుకుని ఉపాధ్యాయ ఉద్యోగంలో చేరారు.
ఆయన సమకాలంగా తత్వకవితా సంప్రదాయంలో చాలా ప్రభావశీలమైన పాత్ర పోషించిన జొన్న ఎల్లదాసు, రామసింహకవివంటి వారివలే వరకవి సిద్ధప్ప ప్రభావం ఆనాటి తెలంగాణ సమాజంపై ఎంతో ఉన్నది.. ఏడవ నిజాంపాలకుడైన మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ కాలం నాటి సంప్రదాయ సామాజిక రంగాన్ని ప్రశ్నించే కవితను రాసిన రచయిత ఆయన. తన కాలపు తిరుగుబాటు భావాలను తన రచనలో పలికించిన కవులలో ఆయన ఒకరు., తొలుత తిరుగుబాటు కవిగా, సంస్కరణశీలిగా మొదలైన ఆయన పయనం జాతీయ వాదిగా స్థిరపడింది. 1940ల నాటికి జాతీయ వాదిగా మారారు. ఆ కాలంలోనే సెక్యులరిజం ప్రతిపాదికగా కవిత వెలువరించారు. ఆయన 1900-1950 వరకు ( ఆయన బాల్యంలో మీర్ మహబూబ్ అలీఖాన్ పాలనకు స్వల్పకాలం) మీర్ ఉస్మాన్ అలీఖాన్ పాలనలో జరిగిన పరిణామాలలో క్రియాశీల భాగస్వామి, ప్రత్యక్ష సాక్షి. ఆనాటి సాహిత్య, సామాజిక, ఆధ్యాత్మిక రంగాలలో ప్రత్యక్షంగా పాల్గొన్నారు. సామాజిక నేపథ్యం చాలా సామాన్యమైంది. స్వయంకృషితో అక్షరాలు నేర్పి కవితను, కార్యాచరణను చేపట్టాడు. రచయితగా ఆయన గొప్ప తత్వవేత్త అనే చెప్పాలి.
సిద్ధప్ప కవి ఆనాటి కాలాన పరివ్యాప్తమైన విలువలపై త్రీవంగా ధ్వజమెత్తాడు. భగవంతునిపై ధ్యాసతో ఆధ్యాత్మికంగా దగ్గరైన అనుయాయులతో భౌతిక వాస్తవికతపై ప్రవచన రూపేణా విడమరిచి చెప్పడం ఆయన అనుసరించిన పద్ధతి. మొత్తంగా చూస్తే ముస్లిం సమాజంలో సూఫీ కవులు ఏ వైఖరిని అనుసరించారో అదే రీతిన తత్వకవులు అనుసరించారని చెప్పడానికి వరకవి సిద్ధప్పలో అనేక ఉదాహరణలను చూపవచ్చు. హైదరాబాద్‌కే చెందిన ఉర్దూ మహాకవి అంజద్ హైదరాబాది, జొన్న ఎల్లదాసు, కాళోజీ గురువు గార్లపాటి రాఘవరెడ్డి కవితలో కనిపించే లోతైన భావవీచికలు అంతర్గత సారం వరకవి సిద్ధప్ప రాసిన శతకాలలో కూడా చూడవచ్చు. సూఫీ తాత్వికత వల్ల కావచ్చు భాషలో, అభివ్యక్తిలో ఒక సారూప్యత కూడా ఉన్నది. తెలుగులో వారి కాలమైన 1900 తొలి, మలి దశకాలనాటికి ఈ మహాకవులు తెలంగాణ కవితా సంప్రదాయంలో ప్రవేశపెట్టిన కావ్య వస్తువు చాలా వినూత్నమైంది. అప్పటివరకు కూడా కావ్య వస్తువు పురాణ పాత్రలు అంటి పెట్టకుని ఉండేది. దాని నుంచి విడివడి సంకెల తెంచుకుని కవిని కూడా విముక్తున్ని చేసింది. కల్పన, ఊహా అనేది విస్తరించి కొత్తదనాన్ని సంతరించు కున్నది. 18వ శతాబ్దంలో తొలి పాదాలలో తత్వ కవులుగా రూపుదిద్దుకున్న రాకమ చర్ల వెంకటదాసు, దున్న ఇద్దాసు. రామసింహ జొన్న ఎల్లదాసులో నైరూప్యత, కన్నడ వచనాలలో కనిపించే ప్యారడాక్స్ కనిపిస్తుంది. ఇదే సూఫీ కవితలో కూడ కనిపిస్తుంది. వరకవి సిద్ధప్పకంటే కొంత ముందు తరానికి చెందిన రామసింహ కవి తత్వకవులలో విశిష్టమార్గాన్ని తొక్కాడు. 1857 తర్వాత ఇంగ్లీషు విద్యవల్ల వ్యాపించిన హేతుబద్ధమైన ఆలోచన సరళిని తత్వకవితలో ప్రవేశపెట్టాడు. సమ సమాజ భావాలు కూడా ఆయన కవితలో ఆనాడే కనిపిస్తాయి. రెండు ప్రపంచ యుద్ధాల మధ్య కవిగా రూపు దిద్దుకున్న వరకవి సిద్ధప్ప తత్వకవితలో హేతువు మరింత స్ధిరపడింది. ఉదారవాద, సంస్కరణ భావాలు కూడా తగ్గుముఖం పట్టడం చూడవచ్చు. తత్వకవిత సరికొత్త తాత్వికతను సంతరించుకున్నది. దైవ విశ్వాసాన్ని గురువును నమ్ముకొమ్మని చెబుతూనే ఎప్పటికీ మారే భౌతిక వాస్తవికత గురించి విశదం చేస్తూనే మనిషి జీవితానికి ఉండే పరిమితులను, గురించి నైతికత గురించి నిష్కర్షగా చర్చించింది. ఈ కాలం నుంచి తెలంగాణ సాయుధ పోరాటం ముగిసే నాటికి ఈ కవిత సంప్రదాయం విప్లకరపాత్రను నిర్వహించిందనే చెప్పుకోవాలి.
హైదరాబాద్ రాష్ట్రం, చివరి నిజాం పాలన కాలంలో ఆయన గొప్పకవిగా ఒక వెలుగు వెలిగిన కవి సిద్ధప్ప. తెలంగాణ ఆత్మగౌరవ సంచికగా పేరు గాంచిన గోల్కొండ సంచిక (1934)లో ఆయన కవిత చోటు చేసుకున్నది. రెండు ప్రపంచ యుద్ధాల మధ్య తెలంగాణ సాహిత్యరంగంలో సురవరం ప్రతాపరెడ్డి, కాళోజీ, ఆళ్వారుస్వామి, గంగుల శాయిరెడ్డివలే ప్రధాన స్రవంతిలోనూ ఆయన ప్రముఖుడు. వీరికన్నా ఆయన ప్రత్యేకత ఏమిటంటే సాధారణ గ్రామీణ వృత్తికులాలలో, రైతాంగంలో కూడా ఆయన చాలా ప్రశస్తమైన, ప్రభావశీలమైన వ్యక్తి. బూర్గుల రామకిషన్ రావు కాలంలోనే ఆయన కవిత పాఠశాలకు, విద్యార్థులకు పఠనీయ గ్రంథంగా ఉండేదని ప్రముఖ పండితుడు నీలా జంగయ్య రాశారు. తాను అది చదివే ప్రభావితమైనట్టు తెలిపారు.
చిన్న వయస్సు నుంచే కవిగా బయలుదేరి జీవితాంతం రచయితగా బతికిన వ్యక్తి సిద్ధప్ప పేదరికం వల్ల సొంతంగా పాఠశాలకు వెళ్లలేదు. సొంతంగా ఏడవ తరగతి చదువుకుని ఉపాధ్యాయునిగా జీవించిన వ్యక్తి. ఉర్దూ, పార్శీ, తెలుగు సాహిత్యాలు కూడా బాగా చదువుకున్న వ్యక్తి. ఎప్పటికీ మారే జీవిత వాస్తకతను, అందులోని వైరుధ్యాలను, వాటి ప్రతిఫలనాలను తనదైన పద్ధతిలో వ్యాఖ్యానించడం ఆయన ప్రత్యేకత.
సిద్ధప్ప తన సమకాలంలో జాతీయస్థాయి నుంచి మొదలు పెడితే తెలంగాణ అంతటా రచన- కార్యాచరణ చేపట్టి, ఊరూర తిరిగి తన భావాలను ప్రచారం చేశాడు. దీనితో ఆయనకంటూ అనుయాయులు, అనుచరులు ఏర్పడ్డారు.
వరకవిగా, రాజయోగిగా పేరు గాంచిన రచయిత కూడ సిద్ధప్పనే. పండితుడు కాదు, పెద్ద చదువులున్న వారు కాదు. పెద్ద కులానికి చెందిన వ్యక్తి కూడా కాదు. కులం రీత్యా, సామాజిక హోదా రీత్యా సామాన్యుడే అయినా కవితా రచనలో జీవిత వాస్తవికతను ఎంతటి సామాన్యునికైనా విడమరిచి చెప్పడంలో అసమాన్యుడు. సామాజిక తాత్వికతలో దేశికవితా రచనలో ప్రజాకవి వేమనకు, కబీర్‌కు, సిద్ధప్పకు, కక్కయ్యలకు సరిసమానుడు.

(ప్రఖ్యాత తత్వకవి వరకవి సిద్ధప్ప రచనల సంకలనం తెవి ఆడిటోరియంలో శనివారం 11న ఆవిష్కరణ సందర్భంగా)

– సామిడి జగన్ రెడ్డి

8500632551