Search
Saturday 17 November 2018
  • :
  • :

ఆధునిక కవులకు దిక్సూచి శ్రీశ్రీ!

Sri-Sri

“ప్రపంచమొక పద్మ వ్యూహం /కవిత్వ మొక తీరని దాహం” అంటూ ప్రపంచమనే పద్మవ్యూహంలో సమస్యలున్నంత కాలం… కవి కలానికి విశ్రాంతి ఉండదనే భావం ధ్వనించేలా… శ్రీశ్రీ పై రెండు పంక్తుల ద్వారా అర్థవంతంగా కవుల బాధ్యతలను గుర్తు చేశారు. విశ్వంలో ఏ వస్తువూ కవి యొక్క ఆవేశానికి బహిర్విషయం కాదని ఘంటా పదంగా ప్రకటించిన శ్రీశ్రీ.. కవి తన అసమాన ప్రతిభతో, సృజనా త్మక శక్తితో, నేర్పరితనంతో అప్రధానమైన, అల్పమైన వస్తువును సైతం… కవితా త్మకం చేయవచ్చని ఎలుగెత్తి చాటారు..
“తలుపు గొళ్లెం/ హారతి పళ్లెం
గుర్రపు కళ్లెం/ కాదేదీ కవితకనర్హం
ఔనౌను శిల్పమనర్ఘం” కవిత్వానికి అన్ని వస్తువులు అర్హమేనని అంటూనే… ‘శిల్ప మనర్ఘం’ అని తేల్చి చెప్పారు.. అంటే దేన్నయినా… కవిత్వంగా మలచవచ్చు.. కానీ దానికి శిల్పం తోడవ్వా లని సూచించారు.. భావాన్ని సూటిగా ప్రకటించడం కవిత పర మార్థం కాదని… కొన్ని సందర్భాల్లో మాత్రమే సూటిగా చెబితే అందమనీ… మరికొన్ని చోట్ల నర్మగర్భంగా ఆవిష్కరిస్తేనే… కవిత్వ మనిపించుకుంటుందని శ్రీశ్రీ నొక్కి చెప్పారు.. అయితే, నర్మగర్భంగా కవిత్వాన్ని పండించే క్రమంలో.. వర్ణనలు.. ప్రతీకలు.. అవి సహజం గా ఒదిగి పోవాలని శ్రీశ్రీ ఆకాంక్షించారు. ఎంత సౌందర్యవతి స్త్రీ అయినా .. ఆమె భూషణాలు సముచితంగా లేకపోతే.. ఆమె సౌంద ర్యం శోభించదనీ.. అక్షర ఆభరణాలైనా.. అలంకారాలైనా… వర్ణనలైనా.. ప్రతీకలైనా.. ఉపమానాలైనా.. వాటి ప్రయోగంలో కవులు ఔచిత్వాన్ని పాటించాలని శ్రీశ్రీ తమ రచనల ద్వారా విడమ రిచి చెప్పారు.. ఆధునిక కవులు తమ కవిత్వాన్ని ఎలా పండించాలో.. కావలసినంత మార్గదర్శనం శ్రీశ్రీ కవిత్వం ద్వారా లభిస్తుంది!
కవితా వస్తువు నిరంతరం నూతనత్వాన్ని ప్రదర్శించాలని.. సమాజం యొక్క మార్పుతోపాటు కవి ఎంపిక చేసుకునే వస్తువులో కూడా మార్పు రావాలని శ్రీశ్రీ అభిప్రాయపడ్డారు. అందుకే.. శ్రీశ్రీ కవితా వస్తు ప్రయోజనాన్ని సమాజ దృష్టితోనే నిర్దేశించారు..
“కదిలేదీ కదిలించేదీ / మారేదీ మార్పించేదీ
పాడేదీ పాడించేదీ/పెను నిద్దుర వదిలించేదీ
మును ముందుకు సాగించేదీ/పరిపూర్ణపు బ్రతుకిచ్చేదీ
కావాలోయ్ నవకవనానికి” అంటూ కవిత్వం సమాజ హితం కోరాలనీ..సామాజిక చైతన్యానికి దోహదపడాలని శ్రీశ్రీ పిలుపునిచ్చారు.
వ్యధార్థ జీవిత/ యథార్థ దృశ్యం
పునాదిగా ఇక జనించబోయే
భావి వేదముల జీవనాదముల
జగత్తుకంతా చవులిస్తావోయ్‌” అంటూ కవిత్వంలో.. వ్యథార్త జీవుల యథార్థమైన దృశ్యాలను చిత్రించినట్లయితే.. అవి భావి వేదముల జీవనాద ములను ప్రతిఫలిస్తాయని పై అయిదు పంక్తుల్లో చక్కగా ప్రస్తావించారు. వస్తు ప్రధానంగా రాసే కవిత్వం ఎక్కువ కాలం నిలవదనీ.. కవిత్వానికి వస్తువు ప్రధానం కాదనీ.. రస నిర్దేశమే కవిత్వానికి ప్రాణమని శ్రీశ్రీ విడమరిచి నిర్దేశించారు.
“ఉండాలోయ్ కవితావేశం/కానీవోయ్ రస నిర్దేశం
దొరకదటోయ్ శోభావేశం /కళ్లంటూ ఉంటే చూసి,
వాక్కుంటే వ్రాసి” అంటూ కవిత్వానికి నిర్దేశ్యం ఆవశ్యకం అని గుర్తు చేశారు.
ఒక కవి యొక్క రచనలో ఎన్ని హంగులున్నప్పటికీ.. అతడు ఉత్తమ కవిగా మనగలగాలంటే.. తన కవిత్వంలో “ధ్వని” ఉండాలని శ్రీశ్రీ అభిలషించారు. స్వయంగా తన కవిత్వంలో పాటించారు. కవి తాను ఏ భావజాలానికైనా బానిసైనప్పటికీ.. తన కవిత్వంలో మానవత్వాన్ని ప్రతిబింబింపజేయాలని శ్రీశ్రీ కాంక్షించారు. అందుకే “మహాప్రస్థానం” కానీ మరే ఆయన రచనలోనైనా మానవ త్వానికే పెద్ద పీట వేశారు.. ‘మహా ప్రస్థానంలో” మనకు ప్రపంచం లోని మానవుల గూర్చి, వారి కవితల్ని గూర్చి తెలియజెప్పారు..
కవిత్వంలో కవి యొక్క స్వతంత్రత ఉట్టిపడాలని విశ్వసించిన శ్రీశ్రీ తన రచనల నిండా స్వతంత్రతను పాటించి పాఠకులను మెప్పించారు.
కేవలం భావావేశానికి లొంగిన వాడు కవి ఉదాత్త కళను .. ఉత్తమమైన కవిత్వాన్ని సృష్టించలేడని శ్రీశ్రీ తేల్చి చెప్పారు. కవులు తమకంటూ ఓ శైలిని నిర్ణయించుకుని.. తమదైన రచనా రీతులతో కవిత్వ సృజన చేయాలని ఆధునిక కవులందరికీ శ్రీశ్రీ తన రచనల ద్వారా నొక్కి వకాణించారు. భావోద్రేకంతో.. భావోద్వేగంతో శ్రీశ్రీ ప్రకటించిన భావాలు.. ప్రతి ఒక్కరిలో చైతన్య దీప్తిని కలిగిస్తాయి!
“ఎముకలు క్రుల్లిన /వయస్సు మళ్లిన
సోమరులారా – చావండి/ నెత్తురు మండే
శక్తులు నిండే /సైనికులారా… రారండి” అని భావోద్వేగంతో ఆయన ఇచ్చిన పిలుపులో ఔచిత్యముంది! శ్రీశ్రీ రచనల్లో కవులకు కావలసినంత మార్గదర్శకత్వం లభిస్తుంది! కవిత్వం యొక్క పరమార్థం ఒంటపడుతుంది! కవులు తమ కలాలకు పదును పెట్టుకునేందుకు శక్తిని ప్రసాదిస్తుంది! కవిత్వం ఎలా రాయాలో యుక్తి తెలుస్తుంది. అలతి అలతి పదాలతో అద్భుత భావాలను ఎలా పండించాలో బోధప డుతుంది! శ్రమైక జీవన సౌందర్యానికి ప్రాధాన్యత నిస్తూ.. కవితా రచనా నుభూతిని మనకు పంచిన ఘనత ఆయనకుంది! అభ్యుదయ కవులలో మేరు పర్వతం లా భాసిల్లిన శ్రీశ్రీ నేడు మన మధ్యలేక పోయిన ప్పటికీ ..ఆయన కవిత్వం అజరామరంగా రచనలలో చూస్తాం. ఆయన మార్గ దర్శకత్వం సదా ఆచరణీయం! మహాకవిగా అందరి హృదయాల్లో కొలువు దీరిన శ్రీశ్రీ వర్ధంతి సందర్భంగా అందరం శ్రద్ధాంజలి ఘటిద్దాం..

Comments

comments