Home అంతర్జాతీయ వార్తలు ఫ్రాన్స్ లో చమురు మంటలు

ఫ్రాన్స్ లో చమురు మంటలు

Police and protesters clash in Paris

 

ఎమర్జెన్సీ దిశగా పారిస్

రంగంలోకి అధ్యక్షుడు మేక్రాన్

పారిస్: ఫ్రాన్స్‌లో అత్యయిక స్థితిని ప్రకటించే అవకాశం ఉంది. అల్లరి మూకలను అదుపు చేసేందుకు, హింసాత్మక ఘర్షణలను నివారించేందుకు ఎమర్జెన్సీ విధింపు ప్రతిపాదన ఉంది. దీనిని తీవ్రంగా పరిశీలిస్తున్నట్లు ఆదివారం ప్రభుత్వ ప్రతినిధి ఒకరు తెలిపారు. శనివారం ముసుగులు ధరించిన యువకులు కడ్డీలు, గొడ్డళ్లు పట్టుకుని దేశ రాజధాని పారిస్‌లో విధ్వంసానికి దిగారు. సెంట్రల్ పారిస్‌లో ఘర్షణలు చెలరేగాయి. పలు వాహనాలను తగులబెట్టారు. భవనాలను ధ్వంసం చేశారు. ఈ పరిణామాలతో పరిస్థితిని అదుపులో పెట్టేందుకు తీవ్ర చర్యలు తీసుకోవల్సి ఉందని ప్రభుత్వ ప్రతినిధి బెంజమిన్ గ్రివియక్స్ స్పష్టం చేశారు. దశాబ్దంలో దేశంలో ఎప్పుడూ లేని స్థాయిలో ఘర్షణలు చెలరేగాయని, ఇటువంటి పరిస్థితి తిరిగి రాకుండా చేసేందుకు అత్యయిక స్థితిని ప్రకటించే అంశంపై తర్జనభర్జనలు సాగుతున్నట్లు తెలిపారు.

నిరసనకారులు తమ సమస్యలను సంప్రదింపుల ద్వారా పరిష్కరించుకోవచ్చునని, హింస మార్గం కాదని గ్రివియక్స్ స్పష్టం చేశారు. ఏదో ఒక అసాధారణ చర్య తీసుకుంటే తప్ప శనివారం నాటి ఘటనలు తిరిగి చోటుచేసుకోవని భావిస్తున్నట్లు ఆయన యూరోప్ 1 రేడియోకు చెప్పారు. దేశంలో ఇంధనంపై పన్నుల విధింపుపై నిరసన చెలరేగింది. రెండు వారాలుగా ఇది కొనసాగుతోంది. జీవన వ్యయం పెరిగిందని, దీనిని అదుపులో పెట్టేందుకు ఎటువంటి చర్యలూ చేపట్టడం లేదని ఎల్లోవెస్ట్ మూవ్‌మెంట్ పేరిట నిరసనోధృతి అలుముకుంది. ప్రస్తుత పరిస్థితిపై ఫ్రాన్స్ అధ్యక్షులు ఎమ్మాన్యుయెల్ మెక్రాన్ రంగంలోకి దిగారు.

ప్రధానితో, అంతర్గత వ్యవహారాల మంత్రితో విస్తృత చర్చలు జరిపారు. నిరసన ఉద్యమకారులతో సంప్రదింపుల ప్రక్రియ తీరుతెన్నుల గురించి వారితో సమీక్షించారు. ఇప్పటి ఉద్యమానికి నిర్థిష్ట నాయకత్వం కానీ సరైన రూపం కానీ లేకపోవడంతో చర్చలు ఎవరితో జరపాలనేది అధికార వర్గాలకు ఇప్పటికీ జటిల సమస్యగా మారింది. ఏది ఏమైనా ప్రతివారాంతం, ఏదో ఒక సభ లేదా హింసాకాండ తంతులు ఉండటాన్ని ప్రభుత్వ యంత్రాంగం సహించేది లేదని అధికార ప్రతినిధి హెచ్చరించారు.

సెంట్రల్ పారిస్ భగ్గు
దేశంలో ఇంధనంపై భారీగా పెరిగిన పన్నులపై గత నెల 17వ తేదీన నిరసన జ్వాలలు భగ్గుమన్నాయి. అప్పటినుంచి ఇవి వ్యాపిస్తూ వచ్చా యి. సామాజిక మాధ్యమాన్ని ఆధారంగా చేసుకుని సామాన్య బాధిత ప్రజానీకం తమ వ్యాఖ్యలను వెలువరించడంతో క్రమేపీ ఆందోళన తీవ్రస్థాయికి చేరుకుంది. దేశవ్యాప్తంగా పలుచోట్ల రోడ్ల దిగ్భంధనాలతో షాపింగ్ మాల్స్‌కు సరుకుల రవాణాపై ప్రభావం పడింది.

ఫ్యాక్టరీలకు ముడిసరుకులు, ఇంధన డిపోలకు ఇంధనం సరిగ్గా అందడం లేదు. దీనితో దేశంలో పలు ప్రాంతాలలో కటకట పరిస్థితి ఏర్పడింది. అతివాద, తీవ్ర వామపక్ష శక్తులు చేపడుతున్న నిరసనల సందర్భాన్ని వినియోగించుకుని దోపిడీ దొంగలు, సంఘ విద్రోహ శక్తులు కూడా రంగ ప్రవేశం చేయడంతో పరిస్థితి తీవ్ర స్థాయికి చేరుకుందని అధికార వర్గాలు అంగీకరించాయి. హింసాకాండ నివారణకు అన్ని చర్యలూ తీసుకున్నట్లు, నిరసనకారులను ఎక్కడికక్కడ కట్టడి చేస్తున్నట్లు అంతర్గత వ్యవహారాల మంత్రి క్రిస్టోఫే కస్టనెర్ తెలిపారు.

Police and protesters clash in Paris

Telangana Latest News