Home దునియా ఆందోళనలపై అశ్వపాదం

ఆందోళనలపై అశ్వపాదం

Horse

గుర్తుందా, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో రాజధాని హైదరాబాద్‌లో ఆందోళన చేపట్టిన అంగన్‌వాడీ కార్యకర్తలను పోలీసు గుర్రాలతో తొక్కించిన సన్నివేశం! ఈ మౌంటెడ్  పోలీసులను రాచరిక పాలనలో ప్రజలపై వినియోగించేవారు. ఇప్పటికీ ఈ దళం కొనసాగుతుండడం చారిత్రక అవశేషం అనుకోవాలి. అయితే దీనిని ఆందోళనకారుల మీద ప్రయోగించడంలోని అప్రజాస్వామికత ఏమని చెప్పాలి! ఈ దళం పుట్టుపూర్వోత్తరాలు  వివరించడానికే ఈ వ్యాసం. 

అభివృద్ది చెందిన దేశాల్లో గుంపు ఎక్కువగా ఉండే ప్రదేశాల్లో మౌంటెడ్ పోలీసులతోనే పహారా పెడుతున్నారు. నిత్యం మూడు లక్షలమంది సందర్శించే అమెరికాలోని న్యూయార్క్, టైమ్స్ స్క్వేర్‌లో కూడా మౌంటెడ్ పోలీసు దళం ఉంది. గుర్రం మీద ఎక్కితే జాకీకి దూరంలో ఉన్నవారు కనబడతారు. దూరంలో ఉన్న వారు కూడా మౌంటెండ్ పోలీసులను చూసి అదుపులో ఉంటారనేది ఈ దళం పోషణ ఉద్దేశం. గుంపులో క్రమశిక్షణ నెలకొల్పడానికి నగరంలో కూడా మౌంటెడ్ పోలీసు దళాన్ని ఉపయోగిస్తున్నారు.

నిజాం కాలం నుంచే….
నిజాం ప్రభుత్వ కాలంలో అంబర్‌పేట్‌లో మౌంటెడ్ పోలీసు దళం ఉండేది. హైదరాబాద్ సంస్థానాన్ని భారత్‌లో విలీనం చేసిన తరువాత 1951లో అంబర్‌పేట్‌లోని మౌంటెడ్ పోలీసు దళాన్ని గోషామహల్‌కు మార్చారు. ఇక్కడ సుమారు 50 మంది సిబ్బంది ఉంటారు. ఇందులో హోంగార్డులు, కానిస్టేబుళ్లు, హెడ్‌కానిస్టేబుళ్లతో పాటు ఆర్‌ఐ వెంకటేశ్వరరావు, ఎఆర్‌ఎస్‌ఐ ఎజికెల్, ఆర్‌ఎస్‌ఐ వరదరాజులు విధులు నిర్వహిస్తున్నారు. నగర పోలీసు కమిషనర్ ఎం.మహేందర్‌రెడ్డి ఆదేశాల మేరకు అదనపు పోలీసు కమిషనర్ శివప్రసాద్, అదనపు డిసిపి రవికుమార్‌లు ఈ మౌంటెడ్ పోలీసు దళాన్ని పర్యవేక్షిస్తుంటారు.

మన మౌంటెడ్ పోలీసు విభాగానికి ఇటీవలే ‘ఇంటాక్ట్-2016’ అవార్డు దక్కింది. ప్రస్తుతం ఈ సెంటర్‌లో 40 గుర్రాలు ఉన్నాయి. రిపబ్లిక్ డే (జనవరి 26), స్వాతంత్ర దినోత్సవం (ఆగస్టు 15), గణేష్ నిమజ్జనం, బోనాల ఉత్సవాలు, రంజాన్, మెహర్రం తదితర పండుగల సందర్భంగా ఆశ్విక దళ పోలీసులను బందోబస్తులో వినియోగించుకుంటారు. పాతబస్తీ వంటి చోట్ల పోలీసు వాహనం వెళ్లలేని చిన్న చిన్న గల్లీలలో ఈ అశ్వక పోలీసులు గస్తీ తిరుగుతుంటారు.

సకల సౌకర్యాలు…..
గోషామహల్‌లోని ఆశ్విక దళం కేంద్రంలో ఈ గుర్రాలకు సకల సౌకర్యాలు కల్పించారు. పోషక విలువలతో కూడిన ఆహారం నిల్వ కోసం గౌడాన్‌లు, పరిశుభ్రమైన నీటి కోసం ప్రత్యేక హౌస్‌లు, ఒక్కో గుర్రం ఉండేందుకు విశాలమైన గదులు నిర్మించారు. దోమలు కరవకుండా ఉండేందుకు ఫ్యాన్‌లను సైతం ఏర్పాటు చేశారు. ఈ గదిలో అన్ని కాలాలలో సైతం గుర్రంకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా సౌకర్యాలు కల్పించారు. రాత్రిపూట గుర్రం నిద్రకు ఉపక్రమించేందుకు నేలపై గడ్డితో పరిచిన బెడ్‌ను వేస్తారు.

మరుసటి రోజు ఈ బెడ్‌ను తీసివేస్తారు. వీటి ఆరోగ్యబాగోగులు చూసుకునేందుకు ప్రత్యేకంగా ఇద్దరు పశువైద్యులను ఇక్కడ నియమించారు. జాకీలు ఇక్కడి గుర్రాలను తమ సొంత పిల్లల కంటే ఎక్కువగా చూసుకుంటారు. ఒక్కోసారి ఆ గుర్రాలతో కూడా వీరు ఆడుకుంటారు. దేశీయ గుర్రాలను రూ.70,000 నుంచి రూ.80,000 వరకు ఖరీదు చేస్తారు. విదేశీ గుర్రాలకు మాత్రం రూ.45,000 నుంచి రూ.55,000 వరకు ధర ఉంటుంది. ఈ గుర్రాల జీవిత కాలం 25 ఏళ్లు ఉంటుంది. గతంలో గుర్రాలను బెంగళూరు, ఢిల్లీ, రాజస్థాన్ వంటి ప్రాంతాలకు వెళ్లి కొనుగోలు చేసేవారు. మూడేళ్లుగా హైదరాబాద్ రేస్‌కోర్స్ నుంచి తీసుకువస్తున్నారు. కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిటి (సిఎస్‌ఆర్) కింద దాతలు ఆశ్వాలను మౌంటెడ్ పోలీసులకు విభాగానికి అందజేస్తున్నారు.

2015 డిసెంబర్‌లో జైపూర్‌లో 2016 ఫిబ్రవరిలో హైదరాబాద్ నగరంలో జరిగిన నేషనల్ ఛాంపియన్ షిప్ పోటీల్లో నగర మౌంటెడ్ పోలీసు విభాగం గోల్డ్ మెడల్ సాధించి సత్తా చాటింది. ఈ ఆశ్విక దళంలో రైడర్స్ (జాకీలు)గా పనిచేయాలంటే 1980 వరకు ప్రత్యేక రిక్రూట్‌మెంట్ ద్వారా తీసుకునేవారు. ఆ తరువాత కానిస్టేబుల్‌లుగా ఎంపికైన వారిలో ఔత్సాహికులను మాత్రమే ప్రస్తుతం ఈ విభాగానికి తీసుకుంటున్నారు. ఇలా కొత్తగా చేరిన వారికి 15 రోజుల పాటు శివరాంపల్లిలోని జాతీయ పోలీసు అకాడమిలో, మరో 15 రోజులు మలక్‌పేట్‌లోని రేస్ కోర్సులో శిక్షణ ఇస్తున్నారు.

ప్రత్యేక శ్రద్ద తీసుకుంటున్నాము: మహేందర్‌రెడ్డి , నగర కొత్వాల్
నగర శాంతి భద్రతల పరిరక్షణలో ఆశ్విక దళం కీలక పాత్ర పోషిస్తుంది. ఈ దళంలో ఉన్న గుర్రాలు, జాకీల (రైడర్స్)కు ప్రత్యేక శిక్షణ ఇచ్చాము. వీరికి అన్ని సౌకర్యాలు కల్పించాము. ఈ విభాగంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నాము. మన మౌంటెడ్ పోలీసు విభాగానికి దేశ వ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు ఉంది. జాతీయ స్థాయి ఛాంపియన్ షిప్ పోటీల్లో మన ఆశ్విక దళం పలుమార్లు బంగారు పతకాలను సొంతం చేసుకుంది.

మౌంటెడ్ పోలీసుల దిన చర్య… ఉదయం : 6 గంటలకు ఆర్‌ఐ లేదా ఆర్‌ఎస్‌ఐ చేత మార్నింగ్ రోల్‌కాల్ (సమీక్ష), అంతకుముందు సెంటర్‌లో ఉన్న గుర్రాలను రైడర్స్( సిబ్బంది) చెక్ చేస్తారు. 6 గంటల నుంచి 6:15 గంటల వరకు గుర్రాలను రైడర్స్ శుభ్రం, బ్రషింగ్ చేస్తారు. 6:15 గంటల నుంచి 7:15 గంటలకు మైదానంలో రైడింగ్, 7:15 నుంచి 07:45 గంటలకు గుర్రాలకు ప్రత్యేక శిక్షణ, 7:45 నుంచి 8:15 గుర్రాలను తిరిగి శుభ్రం చేస్తారు, 8:15 నుంచి 08:25 గంటలకు మొదటి మేత (రైడర్స్, అబ్జర్వర్స్ పర్యవేక్షణలో), 8:25 నుంచి 9:15 రైడర్స్ (జాకీలు) అల్పాహారం, 9:15 గంటలకు ఆర్‌ఐ లేదా ఆర్‌ఎస్‌ఐ చేత రోల్‌కాల్, 9:15 నుంచి 10:45 గంటలకు గుర్రాలకు స్నానం చేయించడం, 10:45 నుంచి 11:00 గంటలకు చర్మ వస్తువులకు పాలిషింగ్, 11:00 నుంచి 11:15 గంటలకు గుర్రాలకు నీళ్లు తాపించడం, 11:15 నుంచి 11:20 గంటల వరకు రెండోసారి గుర్రాలకు మేత తినిపించడం, 11:20 నుంచి 16:05 గంటలకు వరకు రైడర్స్‌కు భోజన విరామం, విశ్రాంతి, 16:05 ఆర్‌ఐ లేదా ఆర్‌ఎస్‌ఐ రోల్‌కాల్, 16:10 నుంచి 16:30 గుర్రాల షెడ్స్ క్లీనింగ్, 16:30 నుంచి 17:30 గంటలకు రైడింగ్ మైదానంలో గుర్రాలను నడిపించడం, 17:30 నుంచి 17:45 గంటలకు మూడోసారి గుర్రాలకు మేత తినిపించడం, 18:00 ఆర్‌ఐ లేదా ఆర్‌ఎస్‌ఐ చేత రోల్‌కాల్.

-బి. వాసుదేవరాజు, 9912199549