Home రంగారెడ్డి చేవెళ్ల మండలంలో కార్డన్ సెర్చ్

చేవెళ్ల మండలంలో కార్డన్ సెర్చ్

 Police Cordon Search in Chevella Mandal

మన తెలంగాణ / చేవెళ్ల : చేవెళ్ల మండల కేంద్రంలోని  భగత్‌సింగ్ నగర్ కాలనీలో పోలీసులు కార్డన్ సెర్చ్ ఆదివారం ఉదయం  నిర్వహించారు. గత కొన్ని రోజులుగా నగరంలోని పలు కాలనీల్లో జల్లెడ పడుతున్న పోలీసులు తాజాగా గ్రామీణ ప్రాంతాలపై దృష్టి పె ట్టారు. సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలోని చేవెళ్ల మండల కేంద్రంలో చేవెళ్ల ఎసిపి టి. స్వామి ఆధ్వర్యం లో తెల్లవారు జామున 3 గంటల నుంచి భగత్‌సింగ్ నగర్  కాలనీలో  కార్డన్ సెర్చ్‌ని చేపట్టారు. ఉదయం 3 గంటలకు డిసిపితో పాటు చేవెళ్ల ఏసిపి స్వామి, సీఐ గురువయ్య, శశాంక్‌రెడ్డి, ఎస్‌ఐ శ్రీధర్‌రెడ్డిలతో పాటు 100 మంది పోలీసులు విస్తృతంగా తనిఖీలు చేశారు. కాలనీకి వెళ్లే దారులన్ని మూసి వేసి ఇంటింటి తనిఖీలను చేపట్టారు. తెల్లవారుజామునే పోలీసులు కాలనీని దిగ్భందం చేయడంతో కాలనీవాసులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. ఏం జరుగుతుందో అని ఆందోళనకు గురయ్యారు. పోలీసులు  బృందాలుగా ఏర్పడి క్షుణ్ణంగా తనిఖీ చేశారు. ఇంట్లో ఉన్న వ్యక్తులు ఎవరు, వారి ఆధార్ కార్డులను పరిశీలించారు. అద్దెకు ఉంటున్న వారి నుంచి పూర్తి వివరాలను పోలీసులు సేకరించారు. ప్రతి కుటుంబానికి సంబంధించి వివరాలు, ఫోన్ నంబర్‌లు నమోదు చేసుకున్నారు. అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు తమ వెంట  తీసుకువచ్చిన ట్యాబ్‌లలో అనుమానితుల వేలిముద్రలను సేకరించారు. గతంలో ఏమైనా నేరాలు చేశారా..? అని పోలీసులు ఆరా తీశారు. కాలనీని జల్లడ పట్టారు. ఇళ్లలో ఉన్న వాహనాలకు సంబంధించి ఆర్‌సి నంబర్‌తో పాటు ఇంజన్ నంబర్‌ను తనిఖీ చేశారు. ట్రాన్స్‌పోర్ట్ డిపార్ట్‌మెంట్  యాప్ ద్వారా ఆ వాహనం ఎవరి పేరు మీద రిజిస్ట్రేషన్ ఉన్న వివరాలను పరిశీలించారు. ఉదయం 3 గంటల నుంచి 6 గంటల వరకు తనిఖీలు కొనసాగాయి. అనంతరం చేవెళ్ల సీఐ జి. గురువయ్యగౌడ్ విలేకర్లతో మాట్లాడారు. తనిఖీల్లో సరైన పత్రాలు లేని  రెండు కార్లు, ఒక ఆటో, 14 బైక్‌లను  స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. అదే విధంగా ఇద్దరు పాత నేరస్తులు, అనుమానితులను అదుపులోకి  తీసుకున్న ట్లు వెల్లడించారు. కార్డన్ అండ్ సెర్చ్ ద్వారా పాత నేరస్తులు దొరికి మరిన్ని నేరాలకు పాల్పడకుండా ఉంటుందన్నారు. అదే విధంగా ప్రజలతో పోలీసులు మరింత మమేకం కావచ్చని తెలిపారు.