Home భద్రాద్రి కొత్తగూడెం అనగనగా ఒక పోలీస్.. ఫ్రెండ్లీ నర్సయ్య

అనగనగా ఒక పోలీస్.. ఫ్రెండ్లీ నర్సయ్య

ప్రజా సేవలో సర్కిల్ ఇన్‌స్పెక్టర్

పల్లెల్లో అవగాహన కార్యక్రమాలు

ఏజెన్సీ వాసులతో స్నేహ పూర్వక వాతావరణం

పలువురి మన్ననలు పొందుతున్న ఏడూళ్ల బయ్యారం సిఐ

Police

పోలీసులంటేనే సామాన్యులకు భయం.! పోలీసులంటేనే ప్రజలకు హడల్..!! ఏజెన్సీలో అది మరింత ఎక్కువ..!!! అయితే ఏడూళ్ల బయ్యారం పోలీస్‌స్టేషన్‌కు మాత్రం వీటినుంచి మినహాయింపు ఇవ్వాల్సిందే.. ఫ్రెండ్లీ పోలీసింగ్‌కు ఐకాన్‌గా నిలుస్తున్నారు అక్కడి సర్కిల్ ఇన్‌స్పెక్టర్ నర్సయ్య. అక్కడి స్నేహ పూర్వక వాతావరణం అన్ని పోలీస్ స్టేషన్‌లకు ఆదర్శం. పల్లెల్లో అవగాహనలు కల్పించడం.. ఏజెన్సీ వాసులతో మమేకమైపోవడం…
ఆపదలో ఉన్న వారికి చేయూతనివ్వడం… ఇంతకంటే ఫ్రెండ్లీ పోలీసింగ్ ఇంకేముంటుంది. అందుకే అంబటి నర్సయ్య ఫ్రెండ్లీ పోలీసింగ్‌కు ఐకాన్.

పినపాక: నగరాలతో పోల్చుకుంటే ఏజెన్సీలో పోలీసు స్టేషన్‌ల లో ఓ విభిన్నమైన వాతావరణం ఉంటుంది. అందరూ స్వేచ్ఛగా స్టేషన్‌లోకి వెళ్లడమంటే అక్కడ వింతన్నట్టే! ఇటువంటి పరిస్థితుల్లో పోలీస్ స్టేషన్ అంటే.. సమాజ హితం కోసం నిర్మించినదేనని, ప్రజల కోసమే పనిచేస్తుందనే భావన ప్రజల్లోకి తీసుకెళ్లారు ఏడూళ్లబయ్యారం సర్కిల్ ఇన్‌స్పెక్టర్ అంబటి నర్సయ్య. అక్షరం ముక్క రాకపోయినా స్టేషన్‌కు ధైర్యంగా వచ్చి ఫిర్యాదు చేయగలిగే స్థాయికి చేర్చారు అక్కడి ప్రజలను. అర్ధరాత్రి సైతం ధైర్యంగా స్టేషన్‌కు వచ్చి సమస్యను వివరించే వాతావరణం ప్రస్తుతం
అక్కడి పోలీస్‌స్టేషన్‌లో ఉందంటే ఒక పోలీసు అధికారి నిబద్ధతకు ఇంతకంటే కొలమానం ఇంకేముంటుంది.

టీచర్ కాబోయి పోలీస్…
అంబటి నర్సయ్యది సిరిసిల్ల జిల్లా రుద్రాంగి గ్రామం. పదో తరగతి వరకూ కోరుట్లలో చదివారు. ఇంటర్ నుంచి డిగ్రీ వరకూ కరీంనగర్‌లో, పిజి కాకతీయ యూనివర్సిటీలో పూర్తి చేశారు. ఉపాధ్యాయ వృత్తంటే నర్సయ్యకు చిన్నప్పటి నుంచి ఎంతో ఇష్టం. జీవితంలో ఆ వృత్తిలోనే స్థిర పడాలన్నది ఆయన ఆశయం. అయితే పరిస్థితులు మాత్రం నర్సయ్యను పోలీసును చేశాయి. అప్పటి నుంచి వివిధ పోలీస్ స్టేషన్‌లలో నిబద్ధతతో విధులు నిర్వహిస్తూ
వస్తున్నారు. ప్రస్తుతం రెండు సంవత్సరాల మూడు నెలలుగా ఏడూళ్లబయ్యారంలో సిఐగా పలువురి మన్ననలు పొందుతున్నారు.

ప్రజలతో మమేకమై…
సర్కిల్ ఇన్‌స్పెక్టర్ అనే గర్వం నర్సయ్యలో ఏమాత్రం కనిపించదు. ప్రతి ఫిర్యాదును క్షుణ్నంగా పరిశీలించడం, సమస్యను ఓపికగా వినడం, అవసరమైతే వారిలో మానసిక స్థైర్యాన్ని పెంచడం.. ఇవన్నీ నర్సయ్యకే సాధ్యం. హరితహారంలో భాగంగా వేలాది మొక్కలను పల్లెల్లో నాటారు. వలస ఆదివాసీ గ్రామాలకు వెళ్లి ఆర్థికసాయం చేస్తుంటారు. వారి సమస్యలను సానుకూలంగా విని పరిష్కరిస్తుంటారు. పల్లెల్లో యువతను క్రీడల వైపు నడిపిస్తుంటారు. వారికి వాలీబాల్ కిట్లు, క్రికెట్ కిట్లు అందజేస్తుంటారు. ఇటీవలే ఏడూళ్లబయ్యారంలో కిడ్నీ వ్యాధితో బాధపడుతున్న గాదె వెంకటేశ్వర్లుకు రూ.75 వేలు ఇచ్చి మానవత్వాన్ని చాటుకున్నారు. ఇలా చెప్పుకుంటూ వెళితే నర్సయ్య సేవలు ఎన్నో.! అందుకే ఇక్కడందరూ ఆయన్ను ఫ్రెండ్లీ పోలీసింగ్‌కు ఐకాన్ అని అంటుంటారు. ఒక ఉత్తమమైన పోలీసుకు ఇంతకంటే నిదర్శనం ఇంకేముంటుంది. అందుకే హాట్సాఫ్ నర్సయ్య..