Search
Thursday 15 November 2018
  • :
  • :

పారిస్‌లో పోలీస్ ఆపరేషన్

ఇద్దరు ఉగ్రవాదుల హతం, మహిళా మానవ బాంబు ఆత్మాహుతి, కీలక టెర్రరిస్ట్ అబౌద్ మృతి?

ఇద్దరు ఉగ్రవాదులు హతం
ఆత్మాహుతికి పాల్పడ్డ మహిళా మానవబాంబు
కీలక టెర్రరిస్టు అబౌద్ మృతి?

police-franceసెయింట్ డెనిస్ (ఫ్రాన్స్): పారిస్ శివార్లలో బుధవారం ఉగ్రవాదులను ఏరివేసేందుకు పోలీసులు భారీ స్థాయిలో రంగంలోకి దిగారు. శివార్లలోని డెనిస్ ప్రాంతంలోని ఓ అపార్ట్‌మెంట్‌లో ఉగ్రవాదులు తలదాచుకున్నట్లు సమాచారం అందడంతో పోలీసు బలగాలు అక్కడికి చేరుకుని పోలీసు చర్య చేపట్టాయి. ఈ దశలో మహిళా మానవ బాంబు తనను తాను పేల్చకోవడం సంచలనానికి దారితీసింది. తరువాత అపార్ట్‌మెంట్‌లోని ఉగ్రవాదులతో పోలీసు బలగాలు తీవ్రస్థాయిలో పోరుకు దిగాయి. మానవ బాంబుగా మారి ఉగ్రవాదులకు రక్షణగా ఆమె తోడ్పడినట్లు తెలిసింది. ఉగ్రవాదుల ఏరివేత కార్యక్రమం పూర్తయిందని ప్రభుత్వ అధికార ప్రతినిధి స్టీఫెన్ లీఫాల్ తెలిపారు. ఆ మహిళ పేలుడు పదార్థాలతో కూడిన కోటును ధరించి ఉంది. భద్రతా బలగాలు అక్కడికి చేరుకోగానే తనను తాను పేల్చుకున్నట్లు పోలీసు వర్గాలు తెలిపాయి. శుక్రవారం ఐసిస్ ఉగ్రవాదులు పారిస్‌లో భీకర దాడులకు దిగడంతో పారిస్ అణువణువు జల్లెడ పడుతున్న దశలో శివార్లలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఇక్కడ జరిగిన కాల్పులలో ఇద్దరు ఉగ్రవాదులు మృతి చెందారు. పోలీసు ఆపరేషన్ సందర్భంగా ఐదుగురిని అదుపులోకి తీసుకున్నారు. ఓ వ్యక్తి అపార్ట్ మెంట్‌లోనే ఉన్నట్లు నిర్ధారించారు. ఆ వ్యక్తి బెల్జియం ఇస్లామిక్ మిలిటెంట్ అబ్దె హమీద్ అబౌద్‌గా పోలీసులు నిర్ధారించారు. ఈ ఉగ్రవాది పారిస్ దాడులకు కీలక సూత్రధారి అని భావిస్తున్నారు. అతడు పారిస్ శివార్లలోని అపార్ట్‌మెంట్‌లో ఐదుగురు సాయుధులతో కలిసి ఉన్నట్లు వెల్లడి కావడంతో పోలీసులు అత్యంత అధునాతన ఆయుధాలతో అక్కడికి చేరుకున్నారు. అక్కడ వారు చేరాక, ఆపరేషన్ ప్రారంభం కావడానికి ముందు అపార్ట్‌మెంట్‌లో ఉన్న ఓ మహిళా మానవబాంబు పేల్చుకోవడంతో ఆ ప్రాంతం దద్దరిల్లిపోయింది. పోలీసు ఆపరేషన్‌లో కీలక ఉగ్రవాది హమీద్ కూడా మృతి చెందినట్లు వార్తలు వెలువడినప్పటికీ పూర్తి స్థాయిలో నిర్థారణ కాలేదు. భారీ స్థాయిలో పోలీసు బలగాలు అపార్ట్‌మెంట్‌కు చేరుకున్నప్పటికీ వారు లోపలికి ప్రవేశించకుండా లోపలి నుంచి తీవ్రస్థాయిలో ప్రతిఘటన వ్యక్తం అయినట్లు అనధికారిక వర్గాలు తెలిపాయి. లోపల ఎందరు ఉగ్రవాదులు ఉన్నదీ? పోలీసు చర్యలో ఎందరు చనిపోయిందీ వెల్లడి కాలేదు. చనిపోయిన వారిని గుర్తించలేదని, అపార్ట్‌మెంట్ సమీపంలో ఓ మహిళను అరెస్టు చేసినట్లు పోలీసు వర్గాలు తెలిపాయి.అపార్ట్‌మెంట్‌లో తొలుత ఓ భీకరమైన పేలుడు జరిగిందని, వెంటనే మరో పేలుడు సంభవించినట్లు, ఆ తరువాత కాల్పులు జరిగినట్లు వెల్లడయిందని స్థానికులు తెలిపారు. గ్రనేడ్‌లు, ఆటోమోటిక్ ఆయుధాల కాల్పుల చప్పుళ్లు విన్పించినట్లు వెల్లడించారు. అపార్ట్‌మెంట్‌లో కీలక ఉగ్రవాది హమీద్ ఉన్నట్లు స్థానికులతో పాటు అధికారులు నిర్ధారించారు.
పారిస్‌కు వెళ్లే విమానాల దారి మళ్లింపు
అమెరికా నుంచి పారిస్‌కు బయలుదేరిన రెండు ఎయిర్ ఫ్రాన్స్ విమానాలలో బాంబులు ఉన్నట్లు గుర్తు తెలియని వ్యక్తి తెలియచేయడంతో వాటిని సురక్షిత ప్రాంతానికి తరలించారు. విమానాలు బయలుదేరిన తరువాత బాంబు ఉన్నట్లు సమాచారంతో ప్రయాణికులను దింపివేసినట్లు లాస్ ఏంజిల్స్‌లో అధికారులు తెలిపారు. విమానాలలో భారీ స్థాయిలో తనిఖీలు చేపట్టారు. రష్యా విమానాన్ని ఐసిఎస్ ఉగ్రవాదులు పేల్చివేసినట్లు నిర్ధారణ కావడంతో, ఐసిస్ నుంచి మరిన్ని దాడులకు బెదిరింపులు రావడంతో పారిస్‌కు వెళ్లే పలు విమానాలను పూర్తి స్థాయిలో తనిఖీలు చేస్తున్నారు.

Comments

comments