Search
Tuesday 20 November 2018
  • :
  • :
Latest News

గులాబీ వర్సెస్ కమలం

Political War In Warangal District

మన తెలంగాణ/ వరంగల్ అర్బన్ జిల్లా ప్రతినిధి : ఓరుగల్లులో రాజకీయ వార్ మొదలైంది. ఉమ్మడి వరంగల్ జిల్లాలో బిజెపి నిర్వహించిన జన చైతన్య యాత్ర గులాబీ పార్టీతో పాటు హస్తం శ్రేణులలో సైతం ఫైర్‌ను లేపింది. బిజెపి జాతీయ స్థాయి నేతలు, రాష్ట్ర స్థాయి నేతలు సైతం బిజెపి జన చైతన్య యాత్రలో పాల్గొని గులాబీ పార్టీ విధానాలపై ఘాటుగా మండిపడ్డ విషయం విధితమే. పనిలో పనిగా కాంగ్రెస్‌ను సైతం టార్గెట్ చేసి యాత్ర సందర్భంగా నిర్వహించిన సభలలో కమలం నేతలు ప్రసంగించారు. నగరంలో సైతం కొంత మంది యువకులను బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ కె.లక్ష్మన్ ఆధ్వర్యంలో చేరికలు జరిగాయి. పలు చోట్ల బిజెపి శ్రేణులను కదలికలోకి తేవడంతో పాటు, ముఖ్యంగా అధికార పార్టీ శ్రేణులు సైతం బిజెపి పట్ల ఆకర్శితులవుతున్నారనే విధంగా తమ కార్యచరణను కొనసాగించారు. అయితే అధికార గులాబి పార్టీని ఘాటుగా విమర్శించడం, తెలంగాణలో కెసిఆర్ గద్దె దింపుతాం అనే విధంగా బిజెపి నేతలు ప్రసంగించడంతో, టిఆర్‌ఎస్ ప్రభుత్వం  అభివృద్ధి బూటకమనే వాదనకు గులాబీ నేతలు గుర్రుమన్నారు. నగరంలో శుక్రవారం బిజెపిలోకి టిఆర్‌ఎస్ యుత్ శ్రేణులు చేరడంతో బిజెపి మీడియా సమావేశం ఏర్పాటు చేసి మరింతగా టిఆర్‌ఎస్‌ను ఎండగట్టింది. మరో పక్కా టిఆర్‌ఎస్ నేతలు సైతం మీడియా సమావేశాలు నిర్వహించి బిజెపి ధోరణులను ఎండగడుతూ ఎదురుదాడికి దిగింది. నగర మేయర్ సైతం ప్రెస్‌మీట్ ఏర్పాటు చేసి బిజెపి నిర్వహించిన జన చైతన్య యాత్రను జనం లేని యాత్రగా అభివర్ణించారు. బిజెపి తీరుకు నొచ్చుకున్న కాంగ్రెస్ సైతం విమర్శలు, ప్రత్యారోపణలకు దిగడం తో ఓరు గల్లులో త్రిముఖ వార్‌కు ఆజ్యం పోసినట్లైందనే వాతావరణం నెలకొంది. ప్రముఖ రాజకీయ పార్టీలలో బిజెపి జన చైతన్య యాత్రతో రాజకీయ వేడి మొదలైందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఏదిఏమైనప్పటికీ రానున్న ఎన్నికల దృశ్య ప్రధాన పార్టీల రాజకీయ వేడి ఘాటుగా మొదలవడానికి బిజెపి జన చైతన్య యాత్ర ఆజ్యం పోసిందనేది గమనార్హం.

Comments

comments