Home ఆఫ్ బీట్ హిమాలయాల ఒడిలో ఖజ్జియార్

హిమాలయాల ఒడిలో ఖజ్జియార్

Popular Tourist Attractions places in Khajjiar

 

ప్రకృతికే వన్నె తెచ్చేలా ఉన్న ఎత్తైన దేవదారు వృక్షాలు, చలికాలంలో గడ్డలు కట్టిన మంచు, చుట్టూ తివాచీ పరిచినట్టుగా కనిపించే పచ్చగడ్డి, వీటన్నింటి మధ్యలో చిన్న సరస్సు..వీటన్నింటినీ చూడడానికి రెండు కళ్లు సరిపోవేమో అన్నట్టుగా ఉంది…ఈ ప్రాంతం. ఈ ప్రదేశం వర్ణణాతీతం..ఇంత అందమైన ప్రదేశం ఎక్కడ అనుకుంటున్నారా! అదే ఖజ్జియార్.. స్విట్జర్లాండ్. దీన్నే స్విట్జర్లాండ్ ఆఫ్ ఇండియాగా పిలుస్తారు.
హిమాచల్ ప్రదేశ్.. హిమాలయాల ఒడిలోని చల్లని రాష్ట్రం. సిమ్లా, కులు మనాలి లాంటి ప్రఖ్యాత పర్యాటక ప్రాంతాలకు నెలవు. అదే రాష్ట్రంలోని చంబా జిల్లాలో మనకంతగా పరిచయం లేని మరో చోటే ఖజ్జియార్.

సముద్ర మట్టానికి 6500 అడుగుల ఎత్తులో, ధౌలాధార్ పర్వత సానువుల్లో భాగంగా ఉందీ ప్రాంతం ప్రకృతి అందాలకు ఆల వాలమైన ఈ చోటును చూసేందుకూ, పచ్చదనపు ఒడిలో సేదతీరేందుకూ, ఏడాదంతా ఇక్కడికి పర్యటకులు వస్తూనే ఉన్నా… వేసవి విడిదిగానే ఇది ఎక్కువ ప్రాచుర్యం పొందింది.
మరో స్విట్జర్లాండ్.. ఏడాది పొడువునా చల్లని వాతావరణం, అప్పుడప్పుడూ హఠాత్తుగా పలకరించే చిరుజల్లులూ ఈ ప్రాంతపు ప్రత్యేకతలు. ఆదే చలికాలంలో వెళితే మాత్రం గడ్డలు కట్టిన మంచు వణికించేస్తుంది. పచ్చని ఆ ప్రాంతాన్ని మంచి చలికాలంలో చూస్తే అందమైన బ్లాక్ అండ్ వైట్ చిత్రాన్ని చూసినట్టే కనిపిస్తుంది.

ఓ పక్క ఏపుగా పెరిగిన దేవదారు, పైన్ వృక్షాల అడవి.. వాటి పక్కనే పట్టులాంటి మెత్తటి పచ్చిక బయలు, దాని మధ్య ఓ నీటి సరస్సు… ఇలా మూడు రకాల పర్యావరణ వ్యవస్థల కలబోతగా ఉండటం ఈ చోటు విశేషం భౌగోళికంగా ఈ ప్రాంతం స్విట్జర్లాండ్‌ను పోలీ ఉండటంతో 1992లో ఇక్కడికి వచ్చిన వైస్ కౌన్సెలర్, ఛాన్సెరీ ఆఫ్ స్విట్జర్లాండ్ ఇన్ ఇండియా అధ్యక్షుడు విల్లీ. టి. బ్లేజర్ స్విట్జర్లాండ్ దీన్ని మినీ ఆఫ్ ఇండియాగా అభివర్ణించారు. అంతేకాదు స్విట్జర్లాండ్ రాజధాని బెర్నర్‌కు ఇక్కడి నుంచి దూరాన్ని తెలిపేలా సైన్ బోర్డుతో ఉండే స్తూపాన్నీ ఏర్పాటు చేసి ప్రపంచ పటంలో ఓ ప్రత్యేకత పర్యటక ప్రదేశంగా దీన్ని చేర్చేలా చేశారు.

సొగసు చూడతరమా.. ప్రభాత సూర్యుడి ఆగమనాన్ని మంచు దుప్పట్లోంచి తొంగి చూడటం మది పులకరించే అనుభూతి. కొండమీద ఉండే సన్‌రైజ్ వ్యూ పాయింట్ నుంచి చూస్తే దివాకరుడి బంగారు కిరణాలు కొండకు అభిషేకం చేస్తున్నట్టు కనిపిస్తుంది. ఇక్కడికి వెళ్లిన వాళ్లు తప్పక అనుభూతి చెందే ఓ దృశ్యం ఇది. ఇక పశ్చిమ హిమాలయాలూ, ముఖ్యంగా కైలాస పర్వతపు (మౌంట్ కైలాస్) అందాల్ని ఖజ్జియార్ నుంచి వీక్షించొచ్చు. ఈ ప్రాంతమంతా పరుచుకుని ఉండే ‘వచా’ అని పిలిచే ఒక రకం గడ్డి కాలికి దూదిలా తగులుతూ పచ్చని తివాచీ మీద నడుస్తోన్న అనుభూతిని కలిగిస్తుంది. వాలుగా ఉండే ఈ ప్రాంతంలో దొర్లడం పిల్లలకు మంచి ఆట. అంతేకాదు, పైన్ చెట్ల అడవిలోనూ సరదాగా ఎవరమైనా నడవచ్చు. ఇక, కొండ వాలుల్లో కనిపించే పచ్చటి పల్లెటూళ్లు ఈ ప్రాంతపు మరొక ప్రత్యేకత.

ఈ ఊళ్ల దగ్గర ఆపిల్ తోటలనూ చూడొచ్చు. స్వచ్ఛమైన నీటితో ఉండే ఖజ్జియార్ సరస్సును చూసేందుకు ఇక్కడకు వచ్చిన ఎవరైనా తప్పక వెళతారు. అందమైన, ప్రశాంతమైన ఈ సరస్సు ఒడ్డున ఎన్ని గంటలు గడిపినా ఎవరికీ ముఖ్యంగా ప్రేమికులకు విసుగురాదూ తనివి తీరదంటే అతిశయోక్తి కాదు. ఈ సరస్సుకు కాస్త దూరంలో ఖజ్జినాగ్ టెంపుల్ అని పిలిచే ఓ నాగేంద్రుడి గుడి ఉంటుంది. పన్నెండో శతాబ్దానికి చెందిన ఇది హిమాచల్ ప్రదేశ్‌లోని ప్రముఖ దేవాలయాల్లో ఒకటిగా పేరొందింది. అక్కడే గోల్డెన్ దేవి టెంపుల్‌గా పిలిచే మరో గుడినీ చూడొచ్చు. ఒకే పైన్ వృక్షం నుంచి ఆరు పొడవాటి పైభాగాలు వచ్చిన పంచపాండవ చెట్టును ఇక్కడికి వచ్చిన వారు ప్రత్కేకంగా దర్శిస్తారు. ఆ ఆరు కొమ్మలూ పంచ పాండవులూ, ద్రౌపదికి చిహ్నాలుగా చెబుతారు.

బోలెడు ఆటలు.. ఈ ప్రాంతపు అందాన్ని ఆకాశంలో ఎగురుతూ చూసేందుకు సహకరించే పారాగ్లైడింగ్ అందుబాటులో ఉంది. ఒక పెద్ద పారదర్శకపు బంతిలోకి దూరిపోయి అక్కడి వాలుల్లో దొర్లుతూ ఆడే ఆట జోర్బింగ్ కూడా ఇక్కడ ప్రత్యేక ఆకర్షణ. ఇక, ఖజ్జియార్ పచ్చికబయళ్లలో శిక్షకుడి సహాయంతో గుర్రపు స్వారీ చేయడం ఓ సరదా ఆట. అక్కడే ఓ చోట కుందేళ్లతో కలిసి ఫొటోలు దిగొచ్చు. హిమాచల్ ప్రదేశ్ వాళ్లు వేసుకునే ప్రతేక వస్త్రాలనూ మనం వేసుకునే ఫొటోలు దిగేందుకు అద్దెకు ఇస్తారు.

ట్రెక్కింగ్ ఇష్టపడేవాళ్లకు ఇది మంచి ప్రదేశం. నేర్చుకునే దశలో ఉన్నవాళ్లూ ఇక్కడి ట్రెక్‌ను డల్హౌసీ ఇక్కడి నుంచి 22 కి.మీ. అక్కడి నుంచి ఖజ్జియార్ ప్రయాణమూ అందంగానే ఉంటుంది. ఇక ఖజ్జియార్‌లో ఉండేందుకు అక్కడి రాష్ట్ర ప్రభుత్వ కాటేజీలతో పాటు, అటవీశాఖ, పీడబ్లూడీ వాళ్ల గెస్ట్‌హౌస్‌లు ఉన్నాయి. ఇవి కాక ప్రైవేటు హోటళ్లూ అందుబాటులో ఉంటాయి. ఇన్ని విశేషాలు తెలిశాక, ఈ ఊరిని ఎప్పుడెప్పుడు చూద్దామా అనిపిస్తోంది కదూ!

Popular Tourist Attractions places in Khajjiar

Telangana Latest News