Home దునియా అంతర్జాల మాయాజాలం

అంతర్జాల మాయాజాలం

Internet

అరవై లేదా దగ్గర దగ్గర డెభ్బై ఏళ్ల క్రితం విడుదల అయిన భానుమతి ఎన్టీఆర్‌ల మల్లీశ్వరి సినిమా అందరికీ గుర్తు ఉంది కదా, అందులో నూతి గట్టు వద్ద నీళ్లు పట్టుకుంటూ మహిళామణులు గలగలా కబుర్లు చెప్పుకుంటూ ఉండే సీన్ లో ఓ పాత్ర మటుకు ఇప్పటికీ గుర్తు ఉండిపోయింది. ఆమె అనవల్సిన మాటలు అన్నీ అనేసి ‘ అయినా నాకెందుకమ్మా ‘ అంటూ మూతి తిప్పుకుంటూ అనడంలో గొప్ప హాస్యం , సంఘంలో ఇలాంటి అమ్మలక్కల పాత్ర ఎలాంటిదో , చెప్పీ చెప్పక ఒక చురక వేశారు దర్శకుడు బి ఎన్ రెడ్డి గారు.

ఆయన ముందు చూపు అందామా , లేక సమాజంలో ఈ రకంగా వంకర మాటలు అనేవారు ఎప్పటి నుంచో ఉన్నారు అని ఒప్పుకుందామా , అవును రామాయణంలో మంధర పాత్ర ని మరిచిపోగలమా ?  ఇప్పుడు ఈ 21వ శతాబ్దంలో నెట్ అనబడే కనిపించని అంతర్జాల జాలంలో నెటిజెన్స్ అనబడే అంతర్జాల వాడుకదారులు ఎదుర్కొనే కొత్త ఎదురుదాడి ట్రాలింగ్.మన ప్రధాన మంత్రి మోడీ మొదలు అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ , త్వరలో పెళ్లి చేసుకోబోయే ప్రియాంకా చోప్రా మొదలు , ఇటీవల పెళ్లి అయిన దీపికా పదుకొనె , నటుడు అమీర్ ఖాన్ మొదలు మన తెలుగు నటుడు నానీ , విజయ్ దేవరకొండ , అక్కినేని కుటుంబ సభ్యురాలు అయిన సమంత నుండి మీటూ అంటూ అభియోగాలు చేస్తున్న నటీమణులు , సింగర్స్, ఇలా ఎవరి మీదైనా సరే ఒక సామాన్య పౌరుడు తన అభిప్రాయమో , లేదా వారి మీద తన అయిష్టమో , కోపమో ఏదో ఒక తిరస్కారం వెలిబుచ్చే విధానాన్నే ట్రాలింగ్ అంటారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్, ఇమ్మిగ్రేనట్స్ మీద ఆంక్షలు విధించడం మీద ఎన్ని రకాల ట్రాల్స్ జరిగాయో లెక్క లేదు. మెక్సికో సరిహద్దు వద్ద గోడ కట్టించడం మీద ఎన్ని జోక్స్ , ఎంత విద్వేషం కక్కారో చెపితే ఒక పెద్ద గ్రంధం అయిపోతుంది.అలాగే మన ప్రధాని మోడీ గారి మీద. రాజకీయ ప్రముఖులు మీద చేసే ఈ ట్రాల్స్ మీడియాకి న్యూస్ పండుగ లాంటిదే. ఆ ట్రాల్స్ పట్టుకుని వారిని విమర్శించడమో , విమర్శకు విమర్శలో ఇలా ఓ రోజంతా చానల్ నింపేయొచ్చు , ఈ ట్రాల్స్ పై వార్తలు పుట్టించి.

రాజకీయ ట్రాల్స్ ఒక ఎత్తు. ఈ ట్రాల్స్‌కి జవాబు చెప్పేందుకే విడిగా కొంత మందిని నియమించుకుంటారు అని లోపల వార్త. రాజకీయ ప్రముఖుల జోలికి అందరూ వెళ్లక పోయినా సినిమా రంగంలో నటులని మటుకు ఎవరూ వదిలిపెట్టటం లేదు ఈ మధ్య.మునుపు మనం ఒక సినిమా చూసి బాగుందా లేదా అని ఓ మాట అనుకుని అక్కడితో మరిచిపోయే వాళ్ళం.ఇప్పుడు అలా కాదు , వారి రోజు వారీ విషయాలు మీద ఆసక్తి , వారి దుస్తులు , నగలు , ఫ్యాషన్లు , ఒకటేమిటి వాళ్ల కుటుంబ జీవితం అన్నీ వార్త విషయాలే.ఇక సినీ రంగంలో నటీ నటుల వివాహాలు జరిగితే ,ప్రతీ చిన్న వివరము న్యూసే ఇప్పుడు .ట్విట్టర్లో ట్వీట్ అవగానే మొదలు అవుతాయి , వాళ్ళ మీద నానా రకాల కామెంట్స్ అనబడే ట్రాల్స్.మునుపు ఇంట్లో , బయటా అలా మాట్లాడుకుంటే పనికిరాని పరిజ్ఞానం అని పెద్దలు తిడుతూ ఉండేవారు. ఆ పెద్దలే ఇలా వీళ్ళ మీదా వాళ్ళ మీదా అనుకుంటే తప్పు అని సరిదిద్దే వాళ్ళు విజ్ఞులు. ఇప్పుడు అవే కబుర్లు ట్వీట్స్ మరియు ట్రాల్స్ గా పరిణామం పొంది , హల్చల్ చేస్తున్నాయి అంతర్జాలంలో.

అసలీ అంతర్జాలమే ఒక మాయ.ఆ మాయలో వ్యక్తులు ఉండరు.వారి ఛాయలు , నీడలు ఉంటాయి.గోప్యత ఒక పెద్ద వరం వీరికి. వీధిలో గొడవ జరుగుతూ ఉంటే నలుగురూ తమకి సంబంధం లేక పోయినా తలో రాయి వేసినట్టు, ఒక ప్రముఖురాలు ,లేదా నటి ,నటుడో ఓ మాట అంటే , లేదా ఓ చిత్రం పెడితే ,దాని మీద నలుగురూ నాలుగు మాటలు అనేయడం ఓ ఫ్యాషన్ అయిపోయింది ఇప్పుడు.ఈ మధ్య సమంత కొన్ని ఫోటోలు పెడితే అక్కినేని వారి కోడలుగా ఇవి తగునా అంటూ మాటలతో ట్రాల్ చేశారు., అలాగే ప్రియాంకా వేసుకున్న గౌను, లేదా అభిషేక్ బచ్చన్ ఐశ్వర్య ల కుటుంబ విషయాలు , కరీనా ,సైఫ్ ఖాన్ల కొడుకు తైమూర్ పేరు మీద , ఇలా మనకి అవసరమా కదా అని కాదు ,చేతిలో మొబైల్ ఉంది , అనడానికి ఏమిటి అడ్డు అన్నట్టుగా ట్రాల్స్ పేరుతో ఏవో అంటూనే ఉన్నారు.

అయితే ఇందులో ఇంకో కోణం కూడా ఉంది. నటులు తమ సినిమా రిలీజుకు ముందు ఇలాంటి ట్వీట్స్ అండ్ ట్రాల్స్ చేయించుకుని సినిమాకి ఫ్రీ పబ్లిసిటీ చేయించుకుంటున్నారు అని.మగవారి పై ట్రాల్స్ వారికి పెద్ద ఇబ్బంది కాదు.స్త్రీలపై ఈ ట్రాల్స్ చేస్తూ వారిని నానా రకాల మాటలు అంటూ ,అణగదొక్కేయాలి అని చూసే ఈ గుంపు ధోరణే ప్రస్తుతం చర్చనీయాంశం.స్త్రీల పై విధించే ఆంక్షల్లో భాగంగా ఇప్పుడు ఈ ట్రాల్స్ కూడా భాగం పంచుకుంటున్నాయి.పబ్లిక్ స్పేస్ అంటే మగవారితో సమానంగా అవకాశాలు అంది పుచ్చుకుని ,స్త్రీలు ముందుకు చొరబడడం సహించలేని సమాజపు పెద్దలు ఈ ట్రాల్స్ కూడా ఓ అవకాశంగా తీసుకున్నట్టుగా తోస్తోంది.ఆకాశమే నీ హద్దు అని స్లోగన్స్ ఇవ్వడం కాదు , ఆకాశంలో సగం అనే మహిళా లోకం తన లిమిట్స్ తాను తెలుసుకోగలదు, ఎవరి సలహా సంప్రదింపులు లేకుండా అని ఎప్పటికి గ్రహిస్తారో పెద్దలు.ఆనాడే మహిలకు సంపూర్ణ స్వాతంత్య్రం వచ్చినట్టు.ట్విట్టర్ అనే సోషల్ మీడియా లో మనం రాసే మాటలని ట్వీట్ అంటారు..ఆ ట్వీట్స్ మీద తిరస్కార కామెంట్స్ ను ట్రాలింగ్ అంటారు.

వసంత లక్ష్మి. పి.

9440156968