Home తాజా వార్తలు పేలుడు పదార్థాలు స్వాధీనం

పేలుడు పదార్థాలు స్వాధీనం

blastingగద్వాలరూరల్: మండల పరిధిలోని అనంతాపురం గ్రామ శివారులో అనుమతులు లేకుండా పేలుళ్లు చేస్తుండగా స్థానికుల సమాచారం మేరకు రూరల్ పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా సిఐ జి.సురేష్, రూరల్ ఎస్‌ఐ సత్యనారాయణలు మాట్లాడుతూ నల్గొండ జిల్లా ఆత్మకూరు మండల కేంద్రానికి చెందిన బొంగురాజుల విజయ్ గత కొన్నాళ్లుగా పెబ్బేరు మండల కేంద్రంలో నివాసం ఉంటూ, కంప్రెషర్‌తో వ్యాపారం నిర్వహిస్తూ జీవనం సాగిస్తున్నాడు. మండల పరిధిలోని అనంతాపురం దగ్గర ఎల్ అండ్ టి అనే కంపెనీ హైటెన్షన్ లైన్ పనులను నిర్వహిస్తుంది.

ఈ లైన్ వేయడానికి విద్యుత్ స్తంభాల కొరకు గుంతలు తవ్వాలని విజయ్‌ను ఎల్ అండ్ టి మేనేజర్ దండయ్యపాని సంప్రదించారు. విజయ్ పనులు నిర్వహించబోయే స్థలాన్ని పరిశీలించి కంప్రెషర్‌తో అనుకూలం కాదు బ్లాస్టింగ్ చేయాలని కంపెనీ ఉద్యోగికి తెలిపారు. దీంతో కంపెనీ ఉద్యోగితో విజయ్ బేరం కుదుర్చుకుని ఎర్రవల్లి సమీపంలో భాస్కర్ అనే తన స్నేహితునికి తెలిపాడు. భాస్కర్ ఓ అధీకృత డీలర్ దగ్గర గోడౌన్ సూపర్‌వైజర్‌గా విధులు నిర్వహిస్తున్నట్లు తెలిసింది. దీంతో విజయ్, భాస్కర్‌కు మధ్య ఒప్పందం కుదుర్చుకుని అనధికారికంగా 80 ఎలక్ట్రోడీటోనేటర్స్, 35 జిలెటిన్ స్టిక్స్ కావాలని కోరడంతో అనధికారికంగా భాస్కర్ తీసుకువచ్చి విజయ్‌కు అప్పజెప్పారు.

గత మూడు రోజులుగా విజయ్ అనంతాపురం సమీపంలోని మెయిన్‌రోడ్డు దగ్గరలో పేలుళ్లు జరుపుతుండగా స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఎస్‌ఐ సత్యనారాయణ సంఘటన స్థలానికి చేరుకుని పేలుళ్లు జరుపుతున్న విజయ్‌ను అదుపులోకి తీసుకుని విచారించారు. దీంతో తన దగ్గర గల 55 ఎలక్ట్రో డిటోనేటర్‌లు, 30 జిలెటిన్ స్టిక్స్, కంప్రెషర్ ట్రాక్టర్ (ఏపీ 22 హెచ్ 4745)ను స్వాధీనం చేసుకున్నారు. దీంతో విజయ్‌పై కేసు నమోదు చేసి కోర్టులో హాజరుపరిచి రిమాండ్‌కు తరలించనున్నట్లు సిఐ తెలిపారు.