Home కలం భాగవతం తెలిసి పలికిన పోతన్న

భాగవతం తెలిసి పలికిన పోతన్న

కొందఱికి తెనుగు గుణమగు
కొందఱికిని సంస్కృతము గుణంబగు, రెండున్
కొందఱికి గుణములగు నే
నందఱి మెప్పింతు కృతుల నయ్యైయెడలన్
(భాగవతము ప్ర.స్కం. 18)

Pothana-Poet‘శ్రీ మహాభాగవతానువాదంలో పోతన్న ముందుగా ఇష్టదేవతాస్తుతిని, రచనా ప్రేరణను, కారణమును తెలిపి, పలికెద వేఱొండు గాథ పలుకగునేలా? అని భాగవత విషయాన్ని ( వస్తువును ) స్థిరం చేసుకొని తెలిపే విధాన క్రమాన్ని వ్యక్తం చేయడంపోతన్న నిర్మాణ క్రమం. భాగవతము తెలిసి పలుకుట చిత్రంబు , అన్నాడు. ఎందుకు? విచారించాలి.ఈ పద్యం వెంటనే ‘కొందఱికి’ తెలుగు అనే పై పద్యం రాశారు. అంటే వస్తువు భాగవతం అని నిర్ణయం. ఆ వస్తువును ప్రకటించడానికి తెలుగు సంస్కృతములు రెండింటిలో ఏది ఎంచుకోవాలనే సంప్రశ్నంలోంచి ఈ పద్యం వెలువడింది. ఇక్కడ సంస్కృతం అనే మాట నిజంగా సంస్కృతం కాదు. ఎందుకంటే అది ముందే ఆ భాషలో ఉంది. దాన్ని మళ్ళీ ఆ భాషలోనే రాయాలని ఆయన ఉద్దేశం కాదు, రెండు కొందఱికి నచ్చుతాయి కనుక అందఱినీ మెప్పిస్తానని అన్నాడు.
ఇక్కడ పోతన్న తెనుగును దేశీయమైన తెలుగుగా, సంస్కృతం అంటే మార్గకవిత్వంలో ఉన్న మాదిరి అని ఆయన ఉద్దేశం. కవితా మార్గమే కాక భాష తెలుగు ఎక్కువగా వాడవలెనా? సంస్కృత పదభూయిష్టంగా సమాసఘటితంగా ఆర్భాటంగా ఉండాలా? అని చర్చ. ఈ చర్చ ఎందుకు చేశాడు. నన్నయ మహాభారతంలో రెండు వంతులు సంస్కృతం ఒక వంతు తెలుగు రాయగా, తిక్కన్న రెండు వంతులు తెలుగు ఒక వంతు సంస్కృతం రాశాడు. తన కాలంనాటికి సుప్రసిద్ధులుగా ఉన్న శ్రీనాథుడు నైషధాన్ని ఒకవిధంగా హరవిలాసం ఒకవిధంగా చాటువులు మరొక విధంగా పల్నాటి వీరచరిత్ర మరో విధంగా అంటే తెలుగు, సంస్కృతాదుల ప్రయోగ వైవిధ్యంతో రాశాడు, సంస్కృత , ప్రాకృత, శౌరసేనీ మొదలగు బహుభాషా కోవిదుడనని చెప్పుకున్నాడు.
కనుక ఆయన వివిధ పోకడలను పోయినాడు. కొన్ని సందర్భాలలో ఆయనది డు, ము, వు ల భాష అని విమర్శకు గురియైనాడు. ‘ ఎవ్వరేమన్న గాని నాకేమి కొరత , నా కవిత్వంబు నిజము కర్ణాట భాష ’ అని సమాధానం చెప్పుకున్నాడు. ఈ సమాధానం పై పండితులు అనేక విధాల చర్చలు చేశారు.
కర్ణాటక భాష అంటే అప్పటికి దక్షిణ దేశ భాషగానే భావించాలి. ఎందుకంటే కర్ణాటక సంగీతం కూడా అటువంటి మాటే. ఆయనకు ఉత్తర దేశ భాషలు కూడా వచ్చుకనుక నేను దక్షిణాది భాషనే ఉపయోగిస్తున్నాను అని ఆయన గడుసైన సమాధానం.
శ్రీనాథుని వలె పోతన గడుసరి కాదు. సాత్త్వికుడు. అందుకని పై పద్యంలో రెండు భాషలనుపయోగించుకున్నట్లు అందిరినీ అంటే తెనుగు ఇష్ట పడేవారిని, సంస్కృతం ఇష్టపడేవారిని, రెండూ కలిపిన భాషను ఇష్టపడేవారిని మెప్పించెదనని అన్నాడు, దాదాపు అదే కాలంలో కొఱవి గోపరాజు కూడా ‘ తెనుగున తేటగా కథలు తెల్పిన కావ్యము పొందులేదు, మె/ త్తనపసచాలదండ్రు, విశదంబుగు సంస్కృత మూదజె/ప్పిన నవి దర్బముండ్లనుచు బెట్టరు వీనుల, గావునన్ రుచుల్/ దనర తెనుంగు దేశియును తద్భవముం గలయంగ జెప్పెదన్‌” అని తెలుగు సంస్కృత భాషా ప్రయోగ చర్చ చేశాడు.తాను కూడా తెనుగు, దేశి, తద్భవములు కలిపి చెపుతానన్నాడు. అంటే తెలుగు కవిత్వం ప్రారంభం నుండి ఏదో విధంగా కవులలో పండితులలో ఈ చర్చ సాగుతూనే ఉంది. పాఠకుల , శ్రోతల విమర్శలు కూడా ఇందుకు కారణం కావచ్చు. పండితులకే పరిమితం కాకూడదనే ఉద్ధేశంతో పాల్కురికి సోమన జాను తెనుగు అనే పదాన్ని, ద్విపద పద్ధతినీ వీరికంటే ముందే ప్రవేశపెట్టాడు. ఈ చర్చ పోతన్న నాటికి సాగుతుంది కనుకనే పోతన్న పై విధంగా చెప్పుకోవలసి వచ్చింది.
చారిత్రక, ప్రాంతీయ భేదాలతో చూసినప్పుడు నన్నయ, ఎఱ్ఱనాదులు మార్గపద్ధతిలో సంస్కృత పదసమాసఘటితమైన తెలుగును వాడినట్లు , తిక్కన, సోమన, పోతనలు తెనుగు భాషకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చినట్లు స్పష్టము.
ఈ తెనుగు ప్రయోగంలో పోతన ప్రత్యేకతలు అనేకం ఉన్నాయి. ఒకటి ఆయన భాగవతం విషయం జటిలమైంది. ‘ అతి రహస్యమైన హరిజన్మకథనంబు’ అని తానే అన్నాడు. ఉపనిష్వద్విద్యాసారాంశమంతా అందులో ఉంది. ఉపనిషత్తులకు రహస్యవిద్య అని ఆదిశంకరులు తమ భాష్యంలో పేర్కొన్నారు, వేద తాత్త్విక పారిభాషిక పదజాలం లేకుండా ఆ శాస్త్ర ప్రామాణికత తెలియడం గాని, అర్థమవడం కాని అంత సులభం కాదు. అందుకనే ‘ భాగవతము తెలిసి పలుకుట చిత్రంబు’ అనే పద్యం రాశారు పోతన్న.