Home కలం సాంఘిక విప్లవకారుడు పోతులూరి

సాంఘిక విప్లవకారుడు పోతులూరి

Veerabramhendra-Swamy

తెలుగునాట బ్రహ్మం గారి పేరు వినని వారు, ఆయన కాలజ్ఞాన తత్వాలను తెలియని వారు బహు అరుదుగా కనిపిస్తారు. 17వ శతా బ్దంలో తెలుగు సమాజాన్ని ప్రభావితం చేసిన తత్త్వవేత్త శ్రీ పోతులూరి వీరబ్రహ్మం గారు. భారత దేశంలో ఏ సాహిత్య ప్రక్రియయైనా లలిత కళాస్వరూపమైనా మానవుని మోక్షపథ గాముని గా చేయడంలోనే పరవశిస్తుంది అనేది నిరూపిత సత్యం. రాబోయే రోజులలో జరగబోయే అనేక విషయాలను తన కాలజ్ఞానం ద్వారా ముందుగానే లోకానికి తెలిపిన బ్రహ్మంగారు తన “కాళికాంబా సప్తశతి”ని సమాజంలోని మనిషి కోసం రచించారు. మనిషిని మహిత సంస్కారిగా తీర్చటం కోసం ప్రతీ పద్యాన్ని అందించారు. సంఘంలో మకిలిపట్టిన దురాచారాల నెన్నింటినో నిరసించారు. కాళికాంబా సప్తశతి ద్వారా ఆనాటి సమాజంలోనే గాక ప్రస్తుత సమాజంలో కూడా పేరుకు పోయిన సాంఘిక దురాచారాల్ని ఏ విధంగా నిరసించారో తెలియజేసే ప్రయత్నమే ఈ వ్యాస ఉద్దేశ్యము.

కులతత్వం:
భారతదేశం వేదభూమి, కర్మభూమి. కులాల కుంపట్లు మధ్యయుగాలనాడు ఉన్నంత తీవ్రంగా పురాణ ఇతిహాస కాలాలనాడు కనిపించదు. ఋగ్వేదంలోనిదిగా చెప్పబడే పురుష సూక్తంలో చాతుర్వర్ణ విభాగం ఉంది. గీతలో “చాతుర్వర్ణం మయాస్పష్టం గుణకర్మ విభాగిన:” అని గీతాచార్యుడు చెప్పడం మనందరికి తెలిసిన విషయమే. చేసే వృత్తిని బట్టి కాలక్రమంలో వృత్తులే కులాలుగా పరిణ మించడం భారత సమాజం లో మనకు కనిపిస్తుంది. వశిష్టుడు ఛండాలకన్య అయిన అరుంధతిని పరిణయమాడి ఆదర్శదంపతు లయ్యారు. వ్యాసుడు దాశరాజకుమార్తె అయిన మత్స్యగంధి సంతానమే కదా! ఆళ్వారులలో, నయనార్లలో కూడా నిమ్న కులాలకు చెందినవారున్నారు.
“శూరులజన్మంబు సురుల జన్మంబు
యేరులజన్మంబు ఎరుకనగునే ” నన్నయ భారతం
“జన్మాత్ జాయతే న శూద్ర” అని అంటూనే కుల వ్యవస్థ విషయంలో తీవ్రమైనపట్టింఫులను పాటించారు. ఇటువంటి కుల వ్యవస్థపై బ్రహ్మంగారి దృష్టి ఇలా ఉంది.
వదలవలయు జాతి వర్ణవ్యవస్థలు
పట్టవలయు గురుని పాదయుగము
మ్రొక్కవలయు నాదు మూర్తికి ముక్తికై
కాళికాంబ హంస కాళికాంబ ! (కా.స.శ 305)
జాతిబేధము, వర్ణబేధములు వదిలి గురునిపాదమును పట్టవలెనని, ముక్తికోసం ఆత్మజ్ఞానాన్ని పొందాలని ఆత్మజ్ఞాన సంపన్నులై నాయనార్లు గా ప్రసిద్ధులైన శివభక్తులలో బ్రాహ్మణేతరులు కూడా ఉన్నారు. భక్తికిజ్ఞానా నికి కులబేధం లేదని చెప్పటం పై పద్యాలలో కనిపిస్తుంది. ఈ భూమిపైకి వచ్చేరోజున ఎవరికీ కులము నిర్ణయించబడలేదు. వెనుకటి రోజుల్లో శూద్రుడు బ్రాహ్మణుడిగా మారిన వైనం తెలుసుకోమని గుర్తు చేశారు.

శృతులలోని విషయం:
విశ్వామిత్రుడు పుట్టుకతో క్షత్రియుడు. కాని అతడు తపస్సుచేత బ్రహ్మర్షిగా అవతరించాడు. మహాభారత కర్త అయిన వ్యాస మహర్షి తల్లి కులమేది? ఈ విధంగా పుట్టుకచే కాకుండా వారి వారి ఆత్మ విశ్వాసంచే మహాత్ములైనారని తెలుస్తుంది. తమ స్వశక్తిచే ఎందరో వేదాంతులు ఋషులుగా మారినట్లు పురాణాలలో ఆధారాలున్నాయి.
శూద్రులుగా జన్మించిన గరిమరెడ్డి అచ్చమ్మకు, దూదేకుల సిద్ధయ్య కు, పంచముడైన కక్కయ్యకు “సాంద్రసింధువేదం” అయిన కాలజ్ఞానాన్ని బోధించి, షడ్చక్రములను వివరించి శరీరంలోని దేవతలను జ్ఞాననేత్రానికి చూపించి శిష్యులుగా స్వీకరించి తనకు కుల, మత బేధాలు లేవని ఆచరణలో చూపిన ఘనత బ్రహ్మంగారిది.
అర్హత గలవారికి బ్రహ్మవిద్యాధికారం ఉన్నదని చాటాడు. బ్రాహ్మణాది వర్ణములు సత్త్వ,రజో,తమో గుణముల న్యూనతా ధిక్యములను బట్టి ఏర్పడతాయని బ్రహ్మంగారి అభిప్రాయము. “చాతుర్వర్ణం మయాస్పష్టం, గుణకర్మవిభాగశ:” అన్న గీతాచార్యుని అభిప్రాయం కూడా ఇదే. బ్రాహ్మణునకు పుట్టిన వారెల్ల బ్రాహ్మణుడని యు, శూద్రపుత్రుడు శూద్రుడే అనియు నేడు అనుసరిస్తున్న వ్యవస్థ సరియైనది కాదు అని బ్రహ్మంగారి ఉద్దేశ్యము.
కులము కులమటంచు గొణిగెడి పెద్దలు
చూడరైరి తొల్లి జాడలెల్ల
మునుల పుట్టువులకు మూలమ్ము లేదండ్రు
కాళికాంబ హంస కాళికాంబ ! ( కా.స.శ 21)

ఏ కులమందు పుట్టినా మునులు నడిచిన దారి, పొందిన అమరత్వం స్వీకరించాలని మునుల పుట్టుకలు హీనమైనా, వారు తపశ్శక్తిచే సాధించిన ఉన్నత స్థానాన్ని మనం గుర్తుంచుకోవాలని వివరించారు. కుల,మతాలు ఎన్ని ఉన్నా అన్ని మాతాలసారం ఒక్కటేయని ,మానవులంతా సమానులని 300 సం॥ల క్రితమే బ్రహ్మంగారు ప్రవచించారు.
మతము అంటే మార్గమని కదా అర్ధం. ఏ మతమయినా అది మనిషి శ్వాసలా సహజంగా ఉండాలి కాని మత్తుమందు కారాదు. మతం మత్తులో ఇతరులకు కీడు చేయరాదని, ఏ మతమయినా హితం చేయాలి, హితం చేయలేని మతంలేకపోయినా నష్టంలేదని “మతము మత్తుగూర్చు మార్గమ్ము కారాదు” కా.స.శ(694) అని వివరించారు.
అన్ని మతాలు ఒక్కటేనని అన్ని మతాల వారు కలసి సహజీవనం సాగిస్తూ సహపంక్తి భోజనం చేస్తారని, పంచములు సైతం సమున్నత గౌరవం పొందుతారని ఇది కాలంలో అపరిహర్యమైన అంశమని తన కాలజ్ఞానతత్వాల్లో బోధించి సర్వమానవ సామరస్యం, దాని ఆవశ్యకతను నొక్కి చెప్పారు.
బ్రహ్మంగారు తాను బోధించిన‘అస్పృశ్యతా నిర్మూలన’, ‘మతసామర స్య భావన’లు తాను అనుసరించి ముందుకు సాగుతూ, చండభానుని ప్రచండ కిరణాల్లాంటి వ్యతిరేకతను నిర్భయంగా ఎదుర్కొంటూ అభ్యుద య విప్లవ భావాలను వెదజల్లుతూ భిన్నత్వంలో ఏకత్వ సాధనకు, సర్వ మానవ సౌభ్రాతృత్వానికి, నూతన సమైక్య సమసమాజ స్థాపనకు కృషి చేశారు.

విగ్రహారాధనపై విముఖత:
బ్రహ్మంగారి భావనలో విగ్రహ రూపంలో ఉన్న రాయిని మ్రొక్కట మంటే సాటిమానవుడికి సాయపడడం ఉత్తమం అనే తత్త్వం కనబడు తుంది. విగ్రహారాధనను తీవ్రంగా ఖండించిన వైనం కనబడుతుంది.
సాటి మానవులకు సాయమ్ము పడబోక
నల్లరాళ్లు తెచ్చి గుళ్లు కట్టి
మ్రొక్కులిడిన బ్రతుకు చక్కపడంబోదు
కాళికాంబ హంస కాళికాంబ ! (కా.స.శ 113)
మనసును పట్టించుకోకుండా చేసే మడి, ఆచారాలు, స్నానపానాలు శ్రీ వైష్ణవులచక్రాంకితాలు, ఉపవాసవ్రతాలు, యజ్ఞోపవీత ధారణలు, బాహ్యాడంబర వేషాలను నిరసించినట్లుగా పై పద్యాల ద్వారా తెలుస్తున్నది. అన్నిటికీ మూలం జ్ఞానమని తెలుసుకోలేని ప్రజలు చేసే మూర్తి పూజలను, ెమాలను, పైపై డాంభికాచారాలను విమర్శించి ప్రజలను జాగృతులను చేశారు.

అధికార వ్యామోహం పై నిరసన :
పాచిపీనుగైన బలవంతుడైనను
భీరువైన లేక ధీరుడైన
పెత్తనమ్ము చేయ తత్తరించు జనుండు
కాళికాంబ హంస కాళికాంబ ! (కా.స.శ 277)
పై పద్యంలో అధికార వ్యామోహాన్ని ఈసడించడం కనిపిస్తుంది. ఎంత లోభియైన, ధనవంతుడైన, బలవంతుడైన, బలహీనుడైనా పెత్తనం కోసం పెనుగులాడతారని చెప్పటం పై పద్య సారాంశం.

దోపిడీ వ్యవస్థపై నిరసన:
స్వీయ సౌఖ్యములకు వెంపరలాడుచు
క్రూరముగను పరుల కొల్లగొట్టు
మానవుండు ముందు మార్గమ్ము గానడు
కాళికాంబ హంస కాళికాంబ (కా.స.శ 19)

ఆర్ధిక అసమానతలకు స్వార్ధకాంక్ష, దోపిడి మనస్తత్వం మూలం. స్వీయ సుఖాలకై వెంపర్లాడుతూ పరులను దోపిడీ చేసేవారు భవిష్యత్తులో నష్టపోతారని హెచ్చరిస్తూ దోపిడీ వ్యవస్థను గర్హించారు. ఇలా సమాజంలోని అనేక దురాచారాలపై ఆనాడే నిరసన జ్వాలలు రగిలించి సమాజ సముద్ధరణకు పాటుపడడమే గాకుండా నేటి వ్యవస్థను జాగృతం చేయడంలో కాళికాంబాసప్తశతి ఎంతో ఉపయుక్తంగా ఉండగలదనటంలో అతిశయోక్తి లేదు.