Home తాజా వార్తలు రైతులకు 9గంటల పాటు పగటిపూట విద్యుత్: కెసిఆర్

రైతులకు 9గంటల పాటు పగటిపూట విద్యుత్: కెసిఆర్

CM KCR Assembly Image

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో విద్యుత్ సంక్షోభాన్ని అధిగమించామని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు తెలిపారు. బుధవారం ఆయన శాసన సభలో మాట్లాడుతూ… తెలంగాణను మిగులు విద్యుత్ రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు అంకితభావంతో పని చేస్తామని మాటిచ్చారు. తెలంగాణ ప్రజలకు నిత్యం విద్యుత్ కాంతులతో నింపుతామన్నారు. ఉమ్మడి రాష్ట్రలో ఏర్పడిన సమస్యలను విజయవంతంగా అధిగమించామని స్పష్టం చేశారు.

విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచేందుకు స్వల్ప, మధ్య, దీర్ఘకాలిక చర్యలు చేపట్టామన్నారు. జెన్‌కో ద్వారా విద్యుత్ ఉత్పత్తిని పెంచామని వెల్లడించారు. రెండున్నర ఏండ్లలో 5039 మెగావాట్ల విద్యుత్‌ను అందుబాటులోకి తీసుకోస్తామని హామీ ఇచ్చారు. రాష్ట్రంలో ప్రస్తుతం 7371 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి అవుతోందని కెసిఆర్ వెల్లడించారు. రాష్ట్రానికి 8284 మెగావాట్ల విద్యుత్ అవసరముందని చెప్పారు. విద్యుత్ కోతలు విధించకుండా నాణ్యమైన విద్యుత్‌ను అందిస్తున్నామని, రైతులకు 9 గంటలపాటు పగటిపూట విద్యుత్ అందిస్తున్నామని తెలిపారు. 2019 నాటికి విద్యుత్ రంగంలో స్వయం సమృద్ధిని సాధిస్తామన్నారు. రాష్ట్రంలో ఇన్వెర్టర్లు పోయి, ఇన్వెస్టర్లు వస్తున్నారని ఆయన కొనియాడారు.