Home రాష్ట్ర వార్తలు వెలుగుల విప్లవం

వెలుగుల విప్లవం

kcr

విద్యుత్ సబ్సిడీ రూ.623 కోట్లు పెంపు 

 అవసరమైతే మరి రూ.500 కోట్లు ఇవ్వడానికి సిద్ధం 

ఎత్తిపోతల కరెంట్ ఖర్చు రూ.10 వేల కోట్లు ప్రభుత్వమే భరిస్తుంది 

నాడు చీకటి… నేడు నిరంతర కాంతి : సిఎం కెసిఆర్ 

 హైదరాబాద్: వ్యవసాయానికి జనవరి 1 నుంచి 24 గంటల కరెంటు ఇస్తున్న తరుణంలో విద్యుత్ సబ్సిడీని రూ.4,777 కోట్ల నుంచి రూ.5400 కోట్లకు పెంచుతున్నట్లు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ప్రకటించారు. అవసరమైతే మరో రూ.500 కోట్లు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామన్నారు. ఎత్తిపోతల పథకాల నిర్వహణ వ్యయం దాదాపుగా రూ.10 వేల కోట్లు ప్రభుత్వమే భరిస్తుందన్నారు. విద్యుత్ సరఫరాను ఐదు విభాగాలుగా విభజించి, కార్యాచరణ ప్రణాళిక రూపొందించుకోవాలని విద్యుత్ శాఖ అధికారులను ఆదేశించారు. వ్యవసాయానికి 24 గంటల విద్యుత్ సరఫరా సన్నాహాలపై ప్రగతిభవన్‌లోఅధికారులతో సిఎం శనివారం సమీక్షించారు. రైతులకు 24 గంటల కరెంటుతో పాటు వచ్చే ఏడాది ప్రారంభం కానున్న ఎత్తిపోతల పథకాల పంపుహౌస్‌లు, మిషన్ భగీరథకు, కొత్తగా వచ్చే పరిశ్రమలకు అవసరమయ్యే విద్యుత్ అందించేందుకు సరైన ప్రణాళిక రూపొందించి కార్యాచరణ ప్రణాళిక అమలు చేయాలని సిఎం సూచించారు. ‘గోదావరిపై కొత్త ఎత్తిపోతల పథకాలు వస్తున్నాయని, కాళేశ్వరం, సీతారామ, దేవాదుల వంటి భారీ ఎత్తిపోతల పథకాలతో పాటు గూడెం, శ్రీపాద ల్లంపల్లి వంటి చిన్న ఎత్తిపోతల పథకాలు వస్తున్నాయి. ఎత్తిపోతల పథకాలతో పాటు మిషన్ భగీరథ కోసం ఏర్పాటు చేసిన 1300 పంపుసెట్లకు అవసరమైన విద్యుత్‌ను అందించాలి. ఎత్తిపోతల పథకాలు, మిషన్ భగీరథకు కలిసి 10 నుంచి 12 వేల మెగావాట్ల అదనపు విద్యుత్ అవసరమవుతుంది. దీనికి తగ్గట్లుగా వ్యవస్థను మెరుగుపరచాలని’ సిఎం సూచించారు. విద్యుత్ సరఫరాను ఐదు భాగాలుగా అంటే వ్యవసాయం, ఎత్తిపోతల పథకాలుమిషన్ భగీరథ, వాణిజ్య, పారిశ్రామిక, గృహ విభాగాలుగా విభజించాలని ఆదేశించారు. .ఈ ఐదు రంగాలను వేర్వేరుగా పరిగణించి, దేనికెంత అవసరమో గుర్తించి ఏర్పాట్లు చేయాలన్నారు. . ఈ ఐదు విభాగాల్లో భవిష్యత్తులో భారీ వినియోగం ఉంటుందన్నారు. దీంతో విద్యుత్ సరఫరా వ్యవస్థలో స మూల మార్పులు వస్తాయని స్పష్టం చేశారు. వ్యవసాయానికి ఎక్కువగా విద్యుత్ సబ్సిడీలు ఇవ్వొద్దని కొంత మంది ఆర్థికవేత్తలు అభిప్రాయపడ్డారని, కానీ నేను అలా భావించడం లేదని సిఎం అన్నారు. రైతులకు అందించే సబ్సిడీల ద్వారా రూ.లక్ష కోట్ల వ్యవసాయ ఉత్పత్తులు వస్తాయని, అప్పుడు రైతుల పరిస్థితి మారుతుందని, రాష్ట్ర జిడిపి మారుతుందని వివరించారు.
విద్యుత్ ఉద్యోగులకు ఉదారం పదోన్నతులు
తెలంగాణ ఆవిర్భావం నాడు కరెంటు విషయంలో వెనుకబడి ఉన్నామని, నేడు అన్ని వర్గాలకు 24 గంటల కరెంటు ఇస్తున్నామంటే అది విద్యుత్ ఉద్యోగుల ఘనతేనని సిఎం కెసిఆర్ అభినందించారు. జనవరి 1 నుంచి రైతులకు 24 గంటల కరెంటు అందుతుందని, ఈ విజయానికి కారకులైన విద్యుత్ ఉద్యోగులకు ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని, పదోన్నతులు, ఇతర విషయాల్లో ఉదారంగా వ్యవహరిస్తోందని హామీనిచ్చారు. దేశంలోని మిగతా రాష్ట్రాలతో పోలిస్తే విద్యుత్ ఉత్పత్తి, పంపిణీ, సరఫరా వ్యవస్థల్లో తెలంగాణ ముందంజలో ఉందని సిఎం అన్నారు. విద్యుత్ ఉద్యోగులకే ఈ ఘనత దక్కుతుందని, ఇదే స్ఫూర్తిని కొనసాగించాలని అభినందించారు. జిల్లాల వారీగా ప్రస్తుత డిమాండ్, సరఫరా, భవిష్యత్తులో వచ్చే డి మాండ్ సరఫరా అంశాలపై డైరెక్టర్లు, సిఇలు, ఎస్‌ఇలతో ముఖ్యమంత్రి నేరు గా మాట్లాడారు. అన్ని పాత జిల్లా కేంద్రాల్లో పవర్ ట్రాన్స్‌ఫార్మర్ల రోలింగ్ స్టాక్‌ను అందుబాటులో ఉంచుతామని, ప్రతి సబ్‌స్టేషన్లో కూడా ట్రాన్స్‌ఫార్మర్లు పెట్టామని, ఎక్కడ ట్రాన్స్‌ఫార్మర్ చెడిపోయినా 24 గంటల్లో మరొకటి ఏర్పాటు చేస్తామని అధికారులు సిఎంకు చెప్పారు. విద్యుత్‌శాఖ మంత్రి జగదీష్ రెడ్డి, జెన్‌కో, ట్రాన్స్‌కో సిఎండి దేవులపల్లి ప్రభాకరరావు, ప్రభుత్వ ముఖ్య సలహాదారు రాజీవ్ శర్మ, ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్ మిశ్రా, డిజిపి ఎం. మహేందర్‌రెడ్డి, ట్రాన్స్‌కో జెఎండి సి.శ్రీనివాసరావు, ఎస్‌పిడిసిఎల్ సిఎండి జి.రఘుమారెడ్డి, ఎన్‌పిడిసిఎల్ సిఎండి గోపాలరావుతో పాటు విద్యుత్ సంస్థల డైరెక్టర్లు, సిఇలు, ఎస్‌ఇలు ఈ సమావేశంలో పాల్గొన్నారు.
కునుకులేకుండా పనిచేస్తున్నాం : సిఎండి ప్రభాకర్‌రావు
నిరంతర విద్యుత్ అందించాలన్న ముఖ్యమంత్రి ఆదేశాల అమలుకు విద్యుత్ సిబ్బంది కంటికి కునుకు లేకుండా పనిచేస్తున్నారని జెన్‌కో, ట్రాన్స్‌కో సిఎండి దేవులపల్లి ప్రభాకరరావు తెలిపారు.విద్యుత్ సరఫరా మెరుగుపరిచేందుకు అనేక చర్యలు తీసుకున్నామని, ట్రాన్స్‌ఫార్మర్ల ఫెయిల్యూర్లు 30 శాతం నుంచి నాలుగు శాతానికి తగ్గాయని, పంపిణీ, సరఫరా నష్టాలు 18 నుంచి 16 శాతానికి తగ్గాయని వివరించారు.