Home కెరీర్ గమ్యం చేరాలంటే.. పట్టుదలే కాదు ప్లానూ ఉండాలి

గమ్యం చేరాలంటే.. పట్టుదలే కాదు ప్లానూ ఉండాలి

Prabhat Ranjan is ranked 137th in the Civil exams

హైదరాబాద్: మొట్టమొదటి అటెంప్ట్‌లోనే  సివిల్స్ పరీక్షల్లో 137వ ర్యాంకు సాధించిన ప్రభాత్ రంజన్ పాఠక్ అనుభవాల సారాంశం ఈ వ్యాసం. పాతికేళ్ళయినా నిండని ఈ యంగ్‌చాప్ జాగ్రఫీ ఆప్షన్‌గా తీసుకుని సివిల్స్ రాశాడు. అనుకున్న గమ్యానికి చేరుకున్నాడు. బీహార్‌లోని గయ పట్టణానికి చెందిన పాఠక్ ఇంగ్లీషు మీడియంలో చదువుకుని ఇంగ్లీషులోనే పరీక్షరాశాడు. ఇంటర్వూ కూడా ఇంగ్లీషులోనే చేశాడు. సివిల్స్ కన్నా ముందు ఐఐటిజీ రాశాడు. అప్పటికి ఆయన రాసిన మొట్టమొదటి పెద్దపోటీ పరీక్షఅదే! అందులో ఆయనకు 4,592 ర్యాంకు వచ్చింది. సివిల్స్ ప్రిపేర్ అవడానికి ఆర్థికపరిస్థితులు సహకరించక పోవడంతో స్వయంకృషినే నమ్ముకున్నాడు. చదువులలో చిన్నప్పటి నుంచే జెమ్‌గా ఉన్న ప్రభాత్ టెన్త్‌లో 93.6% మార్కులు సాధించాడు. 12 క్లాస్‌లో 85.6% మార్కులు సాధించాడు. ధన్‌బాద్ ఐఐటిలో డిగ్రీ చేసి 75.8%తో ఉత్తీర్ణుడయ్యాడు. రోజూ మెడిటేషన్ చేయడం, డైరీ రాసుకోవడం, ఎవరికైనా డౌట్స్ ఉంటే టీచింగ్‌చేయడం వంటివి చేసేవాడు. స్కూల్ లెవెల్‌లో జరిగిన డిబేట్లు, క్విజ్‌పోటీలలో అనేక బహుమతులు సంపాదించాడు. ఇంత పెద్ద పరీక్షను అంత అలవోకగా ఎలా గట్టెక్కాడో ఆయన మాటల్లోనే తెలుసుకుందాం.

కుటుంబం పేదదిపంతం పెద్దది
మా నాన్నగారు సైన్యంలో పనిచేసేవారు. చాలా సీదాసాదా కుటుంబం మాది. మా ఇంటికి వేరే చుట్టాలు వచ్చేవారుకారు. పేదరికమే మమ్మల్ని రోజూ పలకరించే అతి దగ్గరి చుట్టం. దీని ప్రభావం చదువుల మీద, ఆరోగ్యం మీద, మా ఇంట్లో కరువైన కనీస సదుపాయాల మీద కూడా పడింది. ఎప్పుడైనా పండగకనో, పబ్బానికనో మా ఊరు వెళ్తే పేదరికంతో నిట్టూర్చే కొంపలు, గుడిసె బతుకులు నన్ను నీరుగార్చేసేవి. వీరి కోసం ఏదో ఒకటి చేయాలి అనుకునే వాణ్ణి. చదువుకోడానికి సరైన సదుపాయాలు లేవని నేను బాధపడుతుంటే మా నాన్నగారు ఒకసారి “నీకున్నన్ని సదుపాయాలు నాకే గనక ఉంటే ఈ పాటికి ఐఎఎస్ ఆఫీసర్‌ని అయ్యేవాణ్ణి తెలుసా” అన్నారు. అక్కడికేదో వజ్రకిరీటం నెత్తిన పెట్టినట్టు మాట్లాడుతున్నారే అని ఉక్రోషం కొద్దీ అనాలనిపించినా ఇంటి పరిస్థితి తెలుసు కనుక గమ్మునుండిపోయాను.
ఆ ఉదంతం కసిపెంచింది
మా ఫ్రెండ్ ధన్‌బాద్‌లో ‘కర్తవ్య’ అనే వాలంట్రీ ఆర్గనైజేషన్ నడుపుతుండేవాడు. అక్కడ పేదపిల్లలు ఎవరైనా సరే వచ్చి ఉచితంగా చదువుకోవచ్చు. ఫీజులు సంస్థే భరిస్తుంది. పుస్తకాలు అవీ సంస్థే సమకూరుస్తుంది. అక్కడ క్లాసులు చెబుతుండేవాణ్ణి. ఒక్క రోజు కూడా మానకుండా వచ్చే 12యేళ్ళ అమ్మాయి మూడు రోజులు కనబడలేదు. ఏమైందా అనుకుంటుంటే ఆమె చనిపోయిందని తెలిసింది. షాక్ తిన్నాను. ఏమైంది అని అడిగితే వారం రోజులుగా అన్నంలేక ఆకలితో చనిపోయిందని తెలిసింది. అంతకు ముందు కూడా రోజుకు ఒక్కసారే అన్నంలో చిటికెడు ఉప్పేసుకుని తిని కడుపునింపుకుందని విన్నాను. బాధతో కుప్ప కూలిపోయాను. ఇలాంటి వారికేదైనా చేయాలని గట్టిగా అనుకున్నాను. మా నాన్నగారి మాటలు గుర్తుకొచ్చాయి. ఐఎఎస్ గురించి వాకబు చేశాను. అధికారం ఉండి అంతో ఇంతో సేవచేసే అవకాశం ఒక్క ఐఎఎస్ అధికారికే ఉంటుందని అర్థమైంది. దానికి సివిల్స్ చదవడమే మార్గమని మిత్రులు చెప్పారు. సివిల్స్‌కు ప్రిపేర్ అవడం ఎలా అని ఒక పెద్దాయనను అడిగితే “నువ్వు చదివేదేదైనా సరే అది ఐఎఎస్‌లో భాగమే..! బాగా చదివితే ఐఎఎస్ అదే వస్తుంది”అన్నారు. అప్పటి నుంచి కసిగా చదువుకోవడం మొదలుపెట్టాను. ఏ తరగతిలో ఉన్నా అదే సివిల్స్ పరీక్ష అన్నట్టుగా చదివాను.
ప్రింట్..మీడియా సమన్వయం
ఎకనమిక్స్, బడ్జెట్ ఎకనమిక్ సర్వే కోసం మృణాళ్‌డాట్ ఆర్గ్ మెటీరియల్ చదివాను. పెద్ద పత్రికలలో వచ్చే డైలీక్విజ్‌లు, కరెంట్ ఎఫయిర్స్, న్యూస్ ఆర్టికల్స్ నుంచి నోట్స్ ప్రిపేర్ చేసుకున్నాను. ఆ తర్వాత విజన్ ఐఎఎస్ మంత్లీ మ్యాగజైన్‌కు మారాను. అలాగే ఐఎఎస్ బాబా సైట్ నుంచి కూడా మెటీరియల్ సేకరించుకున్నాను. పేపర్‌లను పక్కనపెట్టేసి నెట్ మీదనే ఆధారపడి చదువుకున్నాను. అలా చేయడం వల్ల నాకు జనరల్ 466 మార్కులు వచ్చాయి.
సినాప్సిస్ రాసుకోవడం చాలా ముఖ్యం
ఒక రీడింగ్ ఇచ్చి సినాప్సిస్ రాసేసుకున్నాక రివైజ్ చేసుకోడం ఎంతో తేలికైంది. 560 పేజీల ఫుల్ టెక్ట్ చదవడానికి 6 రోజులు పడితే దాన్ని పిండి 35 పేజీలలో తయారుచేసుకున్న సమ్మరీని చదువుకోడానికి 6,7 గంటలు పట్టింది. చూడండి ఎంత తేడా ఉందో! పుస్తకంగా చదివినా, వీడియోలో చూసినా ప్రతీ అంశంపైనా నోట్స్ తయారుచేసుకోవాలి. మెటీరియల్‌ని డేటాగా కాక గ్రాఫ్‌లుగా, డయాగ్రాములుగా, వృత్తాలుగా, మైండ్‌మ్యాప్‌లుగా తయారుచేసుకుంటే చదువుకోడానికి, పాయింట్లు గుర్తుచేసుకోడానికి తేలికవుతుంది.
గ్రిప్ ఉన్న అంశంపైనే గురిపెట్టాలి
నా ఇంగ్లీషు అంత బాగోదు. కానీ నాకు లెక్క ల మీద మంచి గ్రిప్ ఉంది. లెక్కల్లోనూ అన్ని ప్రశ్నలూ అటెంప్ట్ చేయలేదు. 37 లెక్కలు చేశాను. 80 మార్కులు వచ్చాయి. బండగా చదవడం కాదు. కాస్త కాలిక్యులేటెడ్‌గా తెలివిగా చదివితే చాలు. మనకు గ్రిప్ ఎందులో ఉందో గుర్తించాలి. కొన్ని టెస్ట్ పేపర్లను ప్రాక్టీస్ చేయాలి. ప్రతీసారీ కనీస మార్కులు తప్పకుండా వచ్చేలా చూసుకోవాలి. మెయిన్స్‌కు వెళ్ళే ముందు దాదాపు 2 నెలలపాటు రోజూ 2గంటల చొప్పున పరీక్ష రాసి చూసుకునే వాణ్ణి. మనం ఎంచుకున్న మీడియం ఏదైతే ఆ భాషలోనే రాసి చూసుకుంటే మళ్ళీ ప్రత్యేకించి ప్రాక్టీస్ చేయాల్సిన అవసరం రాదు. కంపల్సరీ లాంగ్వేజ్ పేపర్స్ కొంచెం పెద్ద ఆన్సర్‌లతో ఉంటుంది. ఒకసారి ప్రాక్టీస్‌చేస్తే తేలికగానే అటెంప్ట్ చేయొచ్చు.
జిఎస్ స్కోరింగ్ కోసం మాక్‌టెస్ట్‌లకు వెళ్తే మంచింది. వివిధ అంశాలపై నోట్స్ రాసుకునేందుకు డెయిరీలు మైన్‌టైన్ చేశాను. టాపర్స్ రాసిన రకరకాల వ్యాసాలను చదివి వాళ్ళు సబ్జెక్ట్‌ని ఎలా హ్యాండిల్ చేస్తున్నారో, ఎలాంటి భాష వాడుతున్నారో గమనించేవాణ్ణి. ప్రిలిమ్స్ అయ్యాక నేను కూడా 2 వారాలకొకసారి సొంతంగా వ్యాసాలు రాసి చూసుకునేవాణ్ణి.
అనుభవపూర్వక సలహా
మెయిన్స్ రాసేముందు హాయిగా నిద్రపోడం మంచిది. నాకు అర్థరాత్రిదాకా చదివే అలవాటు. అందువల్ల నిద్రచాలక, డల్ అయిపోయాను. ఆరోగ్యం కూడా దెబ్బతింది. ఇది ఇంకొంచెం సీరియస్ అయితే పడిన శ్రమ అంతా బూడిదయ్యేది. అలాంటి పని ఎవ్వరూ చేయకూడదని నా మనవి.
ఏ డిస్ట్రబెన్స్‌లేకుండా చదువుకోవాలంటే చదువుకోడానికి చాలా టైమ్ మిగలాలంటే మీ చుట్టూ ఉన్న ప్రపంచాన్ని మర్చిపోవాలి. ఇంటికెవరెవరో వస్తుంటారు. పోతుంటారు. అయినా మీరు మీ గది దాటి బైటికి రాకండి. కేవలం తినడానికి, తాగడానికి తప్ప ఇక దేనికీ బైటికి రాకండి. ఫేస్‌బుక్‌లు, వాట్స్‌ఆప్‌లు, మైబైల్‌గేమ్స్ లాంటి అన్నిటినీ మరిచిపోండి. అనుభవం మీద చెబుతున్న మాట ఇది.